గేయ రచయిత ధర్మ తేజకు పరిశ్రమ వర్గాల ప్రశంసలు
హైద్రాబాద్ , సృజన క్రాంతి ప్రత్యేక ప్రతినిధి : అయోధ్య రాముడిపై తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన పాటలను తెలంగాణ గవర్నర్ డా. తమిళసై ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు, గేయ రచయిత ఓరుగంటి ధర్మ తేజ తెలుగులో ఈ పాటలను రాయగా, హిందీలో సతీష్ శ్రీ వాస్తవ సాహిత్యాన్ని అందించారు. బి. ఎస్. కృష్ణ మూర్తి సంగీతాన్ని అందించిన ఈ పాటలను ది మ్యూజిక్ గ్రూప్ బృందం సహకారంతో గాయకుడు సాయి చరణ్ తెలుగులో ఈ పాటలను పాడగా, హిందీలో సాయి చరణ్, జయరామ్ లు ఆలపించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ గేయాలను త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పరిశీలిస్తారు. అయోధ్య రాముడిపై తెలుగు వారికి అత్యంత వినసొంపైన పాటలను అందించే దిశగా చేసిన ఈ ప్రయత్నం ఫలించడంతో పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ పాటలను త్వరలో అయోధ్యలో జరుగనున్న ప్రతిష్టా కార్యక్రమంలో ప్రసారం చేయనుండడం విశేషం.
కాగా, తెలుగు గేయ రచయిత ఓరుగంటి ధర్మ తేజ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా ఇప్పటికే అనేక సినిమాలకు, ఆల్బమ్ లకు , సీరియళ్లకు పని చేశారు. ఆయన సినిమాలకు రాసిన అనేక పాటలు జన బాహుళ్యంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రస్తుతం కొన్ని నూతన చిత్రాలకు గేయాలను, స్వరాలను సమకూరుస్తున్న ధర్మతేజ , ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి శిష్యుడు కావడం అందరికీ తెలిసిందే… వేటూరి వారితో కలిసి ఆయన వందలాది చిత్రాలకు పని చేశారు. పరిశ్రమలో ఓ సమర్ధత కల్గిన గేయ రచయితగా, సంగీత దర్శకుడిగా పేర్గాంచిన ధర్మ తేజ అయోధ్య రాముడిపై పాటలను అందించడం ప్రశంసించదగిన విషయమని పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.