***********
*నూతన సాంకేతికత, నయా ఉదార విధానాలు నిరుద్యోగాన్ని పెంచాయి..*
* ఉద్యోగ, ఉపాధులను ఒక సార్వత్రిక హక్కుగా గుర్తించాలి..*
*సంపన్నుల సంపదపై పన్నుతోనే నిరుద్యోగ నిర్మూలన మార్గం..
*ఏ నిరుద్యోగి యాచకుడు కాదు? ఉద్యోగ, ఉపాధుల కల్పన ప్రభుత్వాల బాధ్యత..
*యువశక్తిని జాలిగా గాలికి వదిలేస్తే! విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది..
~~~~~~~
ఏది ఏమైనా ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గకుండా.. ఆ యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి “యువశక్తి” నిర్వీర్యం కాకుండా చూడాలి. ఈ నిరుద్యోగం నానాటికి ఇలాగే పెరిగిపోతే? యువశక్తిని ఇలాగే జాలిగా గాలికి వదిలేస్తే! రాబోయే రోజుల్లో మన దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. గత వైఫల్యాలను అధిగమించి పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంపన్నులపై అధిక పన్నులను విధించి, దానిని కార్యాచరణలో పెట్టి ఉప్పొంగుతున్న నది లాంటి యువశక్తిని ఊరికే వదిలేయకుండా ఉద్యోగ, ఉపాధులు దండిగా కల్పించాల్సిందే..
మనదేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నానాటికి తీవ్ర రూపం దాల్చడంతో నిరుద్యోగుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. దీని మూలంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు దేశానికి క్షేమం కాదు!. విద్యావంతుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా ఉపాధి, ఉద్యోగాలు కల్పించబడనందు వల్ల నిరుద్యోగుల రేటు పెరిగిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వేళ నిరుద్యోగుల ఓట్లు దండుకోవడానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీల వల విసిరి అధికార పీఠాన్ని అధిరోహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత పదేళ్ల పాలనలో ఆ ప్రక్రియను చిత్తశుద్ధితో చేపట్టకుండా కల్లిబొల్లి మాటలతో, అనేక లోపభూయిష్ట విధానాలతో నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఇంతలా దిగజారడం ఇదే ప్రథమం. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధులు కోల్పోయారు. వారిలో అనేక మందికి నేటికీ సరైన అవకాశాలు లభించలేదు.
2023-24 లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019-20 లో నమోదైన దానికంటే 18% అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, గత ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో వృద్ది లేదని “సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ” అనే సంస్థ తెలిపింది. నిరుద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి మరో కారణం నయా సరళీకరణ విధానాల కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ పై ప్రభుత్వాల పెత్తనం తగ్గడం, పెట్టుబడిదారీ, ప్రైవేటీకరణ పెరగడంతో ఉద్యోగ కల్పన లో వృద్ధి సగానికి సగం తగ్గిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వందమంది చేసే పనిని 50 మందితోనే చేయిస్తున్నారు. తక్కువ మందితో పనిచేయించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించేందుకే ప్రైవేటు, కార్పొరేట్ పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి ఉండదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేటీకరణకు పూనుకున్నాయి. లాభాల బాట నడిపే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మడంలో మునిగిపోయారు. నింగి నుండి నేల వరకు అన్నింటిలో ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ లేకపోవడంతో నిరుద్యోగం భారీ స్థాయికి పెరుగుతుంది. ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలించబడాలంటే? ఉపాధి కల్పనను ఓ హక్కుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
దేశంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించినప్పటికీ అందుకయ్యే ఖర్చు జీడీపీలో 3 శాతం మించదు. ఉపాధి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా వస్తు ఉత్పత్తి పెరుగుతుంది, దీనివల్ల ఉద్యోగుల కల్పన పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే? ఓ వ్యక్తికి వేతనం ఇచ్చారు అనుకోండి.. అతను దానితో తన అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తాడు. వాటి ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడుతుంది. ఇది మరికొందరికి ఉపాధి చూపుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం చాలా స్వల్పమే. పైగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇందుకు పూనుకుంటుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రజలకు ఉపాధి హక్కు కల్పించాలంటే పార్లమెంటులో చట్టాన్ని చేయవలసి ఉంటుంది. ఇందుకు పాలకులు సంసిద్ధపడతారా అనేది ప్రశ్న?.
ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉండటం అతడు లేదా ఆమె తప్పు కాదు. ముమ్మాటికీ ఆ వ్యక్తి జీవించే సమాజంలో ఉన్న సామాజిక వ్యవస్థది ఆ తప్పు. ఆ వ్యక్తికి ఉపాధి కల్పించడం ఆ వ్యవస్థకు చేతకాదని నిర్ధారణ అవుతుంది. మరి అటువంటప్పుడు ఉపాధి కల్పన విషయంలో ముందుకు తేవలసిన డిమాండ్ ఎలా ఉండాలి.. సమీప కాలంలో నిరుద్యోగ సమస్య నుండి కొంత ఊరట కలిగించేదిగా, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే కల్పించగలిగేదిగా ఆ డిమాండ్ ఉండాలి. అంటే ఉపాధి హక్కు ఒక సార్వత్రికమైన హక్కుగా ఉండాలి. దానికి రాజ్యాంగపరమైన గ్యారెంటీ ఉండాలి. రాజకీయ హక్కులు, పౌర హక్కులు ఏ విధంగా ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడ్డాయో అదే విధంగా ఉపాధి హక్కు కూడా గ్యారంటీ చేయబడాలి. ఉపాధి హక్కును గ్యారంటీ చేసి కనీస ప్రాథమిక ఆదాయాన్ని అమలు చేయడానికి జీడీపీలో 3శాతం కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఒక నిరుద్యోగికి కనీస వేతనం నెలకు 20 వేల చొప్పున చెల్లించాలనుకుంటే ప్రస్తుతం నిరుద్యోగ రేటు 10% ఉంటుందని లెక్కవేస్తే దేశంలో ఉన్న నాలుగు కోట్ల మంది నిరుద్యోగులకు ఏడాదికి రూపాయలు 9.6 లక్షల కోట్లు అవసరమవుతుంది. ఇది మన జీడీపీలో 3.2శాతం.
దేశంలో శ్రామిక వర్గం సంఖ్య పెరుగుదల రేటు కన్నా కూడా ఉపాధి అవకాశాల కల్పనా రేటు తక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలను తొలగించడంతో ఉపాధిని హరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని ఉపాధి అవకాశాలను కుదించడం దీనికి కారణం. దీనివలన ఉత్పాదకత వేగంగా పెరిగింది కానీ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. మరొకవైపు రైతాంగానికి వ్యవసాయంలో ఇస్తూ వస్తున్న మద్దతును, సబ్సిడీలను, రుణాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో చిన్న రైతులు వ్యవసాయాన్ని మానుకొని పట్టణాలకు వలసలు పోవడం మొదలుపెట్టారు. అది పట్టణాల్లో నిరుద్యోగం మరింత పెరగడానికి దోహదం చేసింది. ఇలాంటి వేళ రాజకీయ పార్టీలు సైతం అయిష్టంగానైనా ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ఒప్పుకోక తప్పడం లేదు. అది వెంటనే సాధ్యం కాదని చెబుతూ ప్రతి ఒక్కరికి కనీస ప్రాథమిక ఆదాయం కల్పించాలన్న ప్రతిపాదనను ఓట్లు దండుకోవడానికి ముందుకు తెస్తున్నాయి. అది ఒక ఎన్నికల హామీగా ఉండడం చేత కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కనీస ఆదాయం అనేది ప్రభుత్వాలు దయతో ఇచ్చే బిక్ష కాదు? నిజానికి ఏ నిరుద్యోగి యాచకుడు కాదు. వారికి ఉద్యోగాలు కావాలి లేదా ఉపాధి కల్పించబడాలి. వాటిని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమవుతున్నప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉన్నందున, ఒక హక్కుగా కనీస ప్రాథమిక ఆదాయాన్ని వాళ్లు పొందగలగాలి.
ఉపాధి హక్కు ఒక సార్వత్రికమైన హక్కుగా ఉండాలని, దాని కోసం దేశంలోని అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక్క శాతం సూపర్ రిచ్ మీద ప్రభుత్వాలు రాయితీలు ఇవ్యడం మానుకొని సంపద పన్ను విధిస్తే సరిపోతుంది. ఈ పాటి పని కూడా ప్రభుత్వం చేయలేదంటే?. అది తన బాధ్యత నుండి దూరంగా పారిపోతుందన్నమాట. సంపన్నులపై ప్రేమనుకోవాలా!. ఏది ఏమైనా ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గకుండా.. ఆ యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి “యువశక్తి” నిర్వీర్యం కాకుండా చూడాలి. ఈ నిరుద్యోగం నానాటికి ఇలాగే పెరిగిపోతే? యువశక్తిని ఇలాగే జాలిగా గాలికి వదిలేస్తే! రాబోయే రోజుల్లో మన దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. గత వైఫల్యాలను అధిగమించి పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంపన్నులపై అధిక పన్నులను విధించి, దానిని కార్యాచరణలో పెట్టి ఉప్పొంగుతున్న నది లాంటి యువశక్తిని ఊరికే వదిలేయకుండా ఉద్యోగ, ఉపాధులు దండిగా కల్పించాల్సిందే..
మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు, వరంగల్