అందరి పండుగ.. ప్రకృతి పండుగ.. బతుకమ్మ

హోమ్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఎంత ప్రాముఖ్యత అంటే, రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపుతారు.దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.ఈ మాసంలో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ వుంటుంది.అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం వుంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం వుందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం వుంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి వుంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి.వీటిలో గునుక, తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. అలాగే సీతాఫలాలు కూడా విరగకాస్తాయి.పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై వుంటుంది. ప్రకృతి రమణీయతతోపాటు రైతులకు కూడా సంతృప్తికరంగా వుండే వాతావరణం తెలంగాణ అంతటా వుంటుంది.ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.బతుకమ్మకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది. తరువాత ఆమె అలసటతో ‘ఆశ్వయుజ పాడ్యమి’ నాడు నిద్రపోయింది.భక్తులు ఆమెను మేల్కొలపమని ప్రార్థించారు.ఈ నేపథ్యంలో ఆమె దశమి నాడు మేల్కొందని చెబుతారు.మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి.ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10తేదీ వరకు జరుపుకోనున్నారు. నేడు ప్రారంభం కాబోతున్న బతుకమ్మ పండుగ కోసం మహిళలు అందరూ పొలాల గట్ల వెంబడి రంగు రంగుల పూల కోసం వెళతారు.తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గౌరీ దేవిని పూజిస్తారు.అమ్మలక్కలు అందరూ ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారు.గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని, వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు.ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుసెనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు.ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, కోసలాదేశుండు నుండి ఉయ్యాలో, దశరధ రాముండు ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుండి జాలువారుతాయి. ఇంత చక్కని, అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పటం తెలంగాణాకే గర్వకారణం.

– మోటె చిరంజీవి,
సామాజిక వేత్త, విశ్లేషకులు
సెల్ : 9949194327.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *