కోటి విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్
5లక్షలు ప్రకటించిన నటుడు విశ్వక్ సేన్
రూ.50 లక్షల సాయం ప్రకటించిన నిర్మాత రాధాకృష్ణ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఎంతో మంది సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తమ తమవంతుగా సాయం చేస్తున్నప్పటికీ.. సాధ్యం కాని పరిస్థితి. ఈ క్రమంలో సినీ, రాజకీయ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ ’మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ 25 లక్షల రూపాయిలకు ఏపీకి విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్టాల్రకు కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ’రెండు తెలుగు రాష్టాల్ల్రో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్టాల్ర ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా.. ఆంధప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయిలు విరాళంగా ఇస్తున్నాను’ అని ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ప్రకటించారు. మరోవైపు.. వరద భాదితుల సహాయార్ధం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విశ్వక్ సేన్ రూ. 5 లక్షల విరాళంగా ప్రకటించారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, విపత్తు ముంచెత్తినా… తమ వంతు సాయం చేయడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎల్లప్పుడూ ఓ అడుగు ముందు ఉంటారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయనతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు), సూర్యదేవర నాగవంశీ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.