జివో విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, ప్రజలు
సృజనక్రాంతి/అమరావతి : ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక జీవోను సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా.. సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వస్తుండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వహనాలు బారులు తీరాయి. అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాక పోవడంతో అధికారులు ఎదురు చూపులు చూశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యం అని కింద స్థాయి అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్లా స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్‌ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించ నవసరం లేదు. అయితే, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. అదే వాగులు, వంకలు, చిన్న చిన్న నదుల్లోని ఇసుకను ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. సవిూప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎండ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా ఇసుకను తరలించుకోవచ్చు. ఇప్పటివరకూ కాంట్రాక్టర్లు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు. అయితే, నూతన ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందనుంది. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. కమర్షియల్ అవసరాల కోసం ఎవరైనా లారీల్లో ఇసుకను భారీగా తరలించేందుకు యత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. అక్రమ రవాణా జరగకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టెంబర్ వరకూ 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. దీన్ని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కలెక్టర్లు, స్థానిక ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు, కి.విూకు రూ.4.90 పైసలు.. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ వేస్తారు. స్టాక్ పాయింట్లలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అక్కడ ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ణయిస్తారు. కాగా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున తీసుకోనున్నారు. అయితే, ఉచిత ఇసుకకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. అధికారిక పోర్టల్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులోనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. ఉచిత ఇసుకకు సంబంధించిన పూర్తి వివరాలు సైతం ఇందులో ఉంటాయని తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు కావడంపై భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు చెబుతున్నారు.