“ది పర్సనల్ ఈజ్ పొలిటికల్” అంటుంది స్త్రీవాద కార్యకర్త కరోల్ హానిష్. “రణ రంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో” అంటారు శ్రీశ్రీ. ఈ రెండు ఉదాహరణలకు ఏమిటీ సంబంధం? అది తెలుసుకోవాలంటే గీతాంజలి ఇల్లొక రాజకీయం చదవాలి. వ్యక్తిగతం కూడా రాజకీయమే అయినప్పుడు రాజకీయమంతా రణరంగమే. కనుక రాజకీయమైన రణరంగమంతా వ్యక్తిగతమే. ఆ వ్యక్తిగతానికి మరొక పేరు ఇల్లు. అవును ఇల్లొక రాజకీయం.
డాక్టర్ గీతాంజలి “ఇల్లోక రాజకీయం” సమకాలీన తెలుగు కవిత్వంలో ఒక ముఖ్యమైన రచన. ఇల్లు అనేది రాజకీయమని, పితృస్వామ్య వ్యవస్థ భారత సంస్కృతిని కుటుంబ పునాదిపై నిలబెట్టిందని, ఇల్లు రాజ్యానికి సంక్షిప్త రూపమని చెపుతుంది. మహిళలు ఇంట్లోని రాజకీయాలను అర్థం చేసుకోలేక వాటిని అత్యంత సహజమైన బాధలుగా భావించి అంతా తమ తలరాతగా సమాధానపడతారు.
________________
మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం పేరిట స్త్రీలను అజ్ఞానంలో ఉంచడం కూడా ఒక రాజకీయమే అని ఆమె బలంగా తన కవిత్వంలో విశ్లేషిస్తారు. ఇంటి గోడల మధ్య జరిగే అధికార సంబంధాలను, స్త్రీ-పురుష డైనమిక్స్ ని, కుటుంబంలోని అసమానతలని, బయటి సమాజంలోని గ్లోబల్ రాజకీయాలతో అనుసంధానం చేసి ఈ స్త్రీ పురుష సంబంధాలలో ఉన్న లోతు ఇదీ అని బలంగా అవగాహనలోకి తీసుకుని వస్తారు. ఈ సంకలనం ఆధునిక తెలుగు కవిత్వంలో స్త్రీవాద ధోరణులను బలపరుస్తూ, రోజువారీ జీవితాన్ని రాజకీయ లెన్స్ ద్వారా చూపిస్తుంది.
________________
ఆమె కవితలు సరళంగా, స్వచ్ఛంగా కనిపించినా, ప్రతి వాక్యంలో ఒక లోతైన ఆలోచన ఉంటుంది. ఇల్లు, ఇంట్లో గదులు, తలుపులు, కిటికీలు, మంచాలు, గోడలు ఇలా సమస్తమూ పురుషులు తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ఎలా సాధనాలుగా ఉపయోగపడతాయో, అలా ఉపయోగపడుతున్నప్పుడు అవి ఎంతలా సంఘర్షణకు గురి అవుతాయో కూడా చాలా సునిశితంగా, సున్నితంగా చర్చకు పెడతారు. నిజంగా ఈ కవిత్వం చదవడమంటే మనతో మనం సంభాషించుకోవడం. ఈ కవిత్వమొక మోనోలాగ్ కాదు. ఇదొక సంభాషణ. స్త్రీలు తమతో తాము చేసుకునే సంభాషణ. పురుషులు చదువుతూ, తమను తాము చెక్ చేసుకుంటూ, తమను తాము విమర్శించుకుంటూ,తమను తాము సంస్కరించుకుంటూ ఆంతరంగికంగా చేసుకునే సంభాషణ.
ఒక చిత్రకారుడు నిద్రాహారాలు మాని తదేక దీక్షతో తన చిత్రాన్ని గీచినట్టు గీతాంజలి ఈ కవిత్వాన్ని బొమ్మ కట్టింది. చిత్రకారుడు రకరకాల రంగులు కలిపి వివిధ నీడలు సృష్టించి బొమ్మ తాత్వికతను ప్రేక్షకుడి హృదయం లోకి ఒంపినట్టు, గీతాంజలి ఒకే వస్తువును వేయి రకాలుగా దర్శించి, ఆ వేయి దృక్కులను కవితలుగా మలిచింది. స్నానాల గది మీద రెండు కవితలు, వాకిలి మీద ఐదు కవితలు ఇలా ఒకే వస్తువును వందరకాలుగా తాను దర్శించి ఆ అనుభవాన్ని కవిత్వంగా మలిచింది. స్నానాలగదిని ఒక శరణార్థి శిబిరం తో పోలుస్తుంది. వాకిలిని ఒక స్ట్రెస్ బర్నర్ గా దర్శిస్తుంది. వాకిలిని ఒంటరి చేయకు అని ప్రాథేయ పడుతుంది. వంటగదిలో నులక మంచం వేసుకుని పడుకుంటుంది. పుట్టింటిలో వున్నప్పుడు తన కలల సామ్రాజ్యంగా వున్న పడకగది అత్తింటికి వచ్చాక తనను బయటకు గెంటేసి పురుషుడి పడక గదిగా ఎలా మారిపోయిందో కరుణ రసార్ద్రంగా వర్ణిస్తుంది. తినే కంచం, పడుకునే మంచం కూడా స్త్రీ స్థానాన్ని మార్మికంగా ఎలా తెలియజేస్తాయో కరతలామలకం చేస్తుంది.
ఈ కవిత్వం చదువుతూ నేనైతే చాలాసార్లు అపరాధ భావానికి లోనయ్యాను. మరీ ముఖ్యంగా “ఆడ కంచం-మగ కంచం” కవిత చదువుతున్నప్పుడు.. ‘అమ్మ ఒక ఖాళీ కంచం అంటుంది’. కొంతమంది గాబరాగా తినే స్త్రీలు కవిత చదువుతున్నప్పుడు నాకైతే మా అమ్మే గుర్తుకు వచ్చింది. మా అమ్మ ఎప్పుడూ నింపాదిగా భోజనం చేసింది లేదు. ఎప్పుడూ హడావిడే! పొయ్యి మీద పాలు పెట్టి అవి ఎక్కడ పొంగుతాయో అని టెన్షన్ పడుతూ అన్నం తిన్నాను అనిపించేది. మా అందరికీ అన్నం వండి వడ్డించి చివరకు అనుకోకుండా ఎవరో ఒక అతిథి వస్తే తనకు కూడా పెట్టి చాలా సార్లు “ఈ కాస్త అన్నానికి మళ్ళీ కంచం ఎందుకు?” అని ఆ గిన్నెలోనే అడుగుబొడుగు మిగిలిన అన్నం లోనే ఇంత పచ్చడో,మజ్జిగో పోసుకుని తిన్నాను అనిపించేది. నేనప్పుడు గీతాంజలి లాగా ఎందుకు మారలేకపోయాను అనే అపరాధ భావం నన్ను చుట్టుముట్టింది.
“తిను వైశాలీ కాస్త మెల్లిగా తిను
మనువు పాలిస్తున్న ఏడు
మన్వంతరాల కాలం నుండి
రెండు వందల పదిహేను కోట్ల
తొంభయి ఒక్క వేల ముప్పైఆరు
సంవత్సరాల నుండి
రోజూ ప్రతిపూటా ఆదరా బాదరా
ఎవరో తరుముతున్నట్టే
త్వరగా తినబోతే ఎవరో
కొట్టబోతున్నట్టే
దేన్నో తప్పించుకున్నట్టే గాబరాగా
ముద్దలు మింగే
పరుగు పందెం ఎందుకు”..అంటూ మొదలయ్యే ఈ కవిత అమ్మ తనకు తెలియకుండా తానే ఒక రెసిపీగా ఎలా మారిపోయిందో వివరిస్తుంది. నిజానికి అమ్మలే కాదు, స్త్రీలు అందరూ తమకు తెలియకుండానే తమ నుండి తాము విడిపోయి పురుషుడి ఆజ్ఞలు పాటించే మర బొమ్మలుగా మారిపోతారు. అలా మారిపోవడానికి ఇల్లే ప్రథమ పాఠశాల.
కల్పన తన తన్హాయి నవలలో స్త్రీలకు పర్సనల్ స్పేస్ అంటూ ఒకటి వున్నది అంటే అది వాష్ రూమ్ అంటుంది. స్త్రీలు తమ హృదయ భారం ఏడుస్తూ దింపుకోవడానికి శరణార్థి శిబిరంగా మారిన స్నానాల గదిని గీతాంజలి చిత్రిస్తుంది. మూసిన తలుపుల వెనకాల దాంపత్యం పేరుతో హింసల కొలిమి అయిన దేహానికి మందు రాసుకోవడానికి, అలవికాని దుఃఖాన్ని పెదవి అంచున భరించడానికి స్నానాల గది శరణార్థి శిబిరంగా మారి ఆమెను అక్కున చేర్చుకుంటుంది అంటుంది గీతాంజలి.
తన దుఃఖాన్ని మరొకరు చూడకూడదు అనుకున్నప్పుడు స్త్రీలైనా, పురుషులైనా ఆశ్రయించేది స్నానాల గదినే. అయితే స్త్రీలు వందసార్లు ఆశ్రయిస్తే పురుషుడు ఒక్కసారి ఆశ్రయిస్తాడు. అదీ విషాదం.
ఇటీవల కడలి తనకంటూ ఒక ఇల్లు లేదు అంటే చాలా చర్చ జరిగింది. కొంతకాలం క్రితం కవనశర్మ ‘ఆమె యిల్లు’ అని ఒక కథ రాశారు. ఆమెకంటూ ఒక ఇల్లు లేకపోవడం గురించి. చిన్నప్పుడు ఆమె వున్నది తండ్రి ఇల్లు. పెద్దయ్యాక ఆమె భర్త ఇంట్లో వుంది. వయసు మీద పడ్డాక పిల్లల ఇంట్లో వుంది. తనకంటూ ఒక ఇల్లు లేకపోవడం ఒక విషాదం. నిజానికి ఇల్లు అంటే నాలుగు గోడలు, పైన ఒక కప్పు, ఇంటి ముందు నాలుగు పూల మొక్కలు అనే వాచ్యార్థం తీసుకుంటే నేనేమీ చెప్పలేను కానీ ఇల్లు లేదు అంటే తనకంటూ ఒక స్పేస్ లేకపోవడమే. ఇల్లు లేకపోవడంలో ఇల్లు భౌతికం అయితే ఆ ఇంటి చుట్టూ స్త్రీ అల్లుకునే ఊహలు, బంధాలు, అన్నీ అభౌతికం. ఈ అభౌతిక, భౌతిక అంశాల గురించి కూడా చాలా కవిత్వం వుంది ఈ సంపుటిలో. వంటగది ఇంటిల్లిపాదికీ మూడు పూటలా వండిపెట్టే వంటమనిషిలా మార్చినా, స్నానాల గది శరణార్థి శిబిరంలో శరణార్ధిలా మార్చినా, పడకగది పునరుత్పత్తి అవయవంలా మార్చినా, కత్తులని, గరిటెలని, పోపుడబ్బాలని అమ్మలకు ఇచ్చి, పుస్తకాలని, టి.వీ లని, సెల్ లను నాన్నలకు ఇచ్చినా, ఖాళీ కంచాన్ని ఇచ్చినా, స్త్రీలకు ఇల్లు లేకపోతే ఊపిరి ఆడదు. మరి గీతాంజలి కి డ్రీమ్ హవుస్ ఏదైనా ఉందా?
“నాకో ఇల్లు కావాలి
నాకో వంటిల్లు లేని ఇల్లు కావాలి
నా ఉదయ మధ్యాహ్నాలను
సాయం సంధ్యలను…
రాత్రుళ్ల కాలాన్ని
దగ్ధం చేసే వంటిల్లు లేని
ఇల్లు కావాలి” అని అడుగుతుంది గీతాంజలి.
_______________
నిజంగా గీతాంజలి కోరుకునే ఇల్లు ఈ భూ ప్రపంచం మీద ఉంటుందా? దుర్భిణి వేసి వెతికినా అలాంటి ఇల్లు ఉండదు. దొరకదు. కానీ అలాంటి ఇల్లును మనం తయారు చేయాలి. అందుకు మనమేం చేయాలి. ఇదుగో గీతాంజలి అది కూడా చెపుతున్నది.
_______________
కొంతమంది/మనువును తప్పించుకున్న పురుషులు / ఆమెలతో పాటు వంటిళ్లలోకి వస్తారు/ఆ పురుషులు ఆమెకి పది చేతులు మొలవకుండా/తమ చేతులని ఇస్తారు/ఆమె ఖాళీ కంచాన్ని మొదటగా నింపుతారు/ ఆమె నోటికి తొలి ముద్దగా మారిపోతారు/ఆ పురుషులు భార్యలకు అమ్మలైపోయి అన్నం తినిపిస్తారు/భార్యలు రక్త హీనత బారి పడకుండా తమ రక్తాన్ని ఇస్తారు/ఆమెలకు ప్రాణం పోసి/ తమతో పాటు కూర్చోపెట్టుకుని/ భోజనం చేయడమే అందం అంటారు./అమ్మలు,భార్యలు/ మగాడి జీవితకాలం కోసం అపాయింట్ అయిన/ వంట మనుషులు కారని/వాళ్లందుకు పుట్టలేదని కొడుకులను/హెచ్చరించే పురుషులు/ నూతన మానవులు వాళ్ళు.”అంటుంది. ఆ నూతన మానవులను తయారు చేయడం కోసం ఈ ఇల్లొక రాజకీయం.
డాక్టర్ గీతాంజలి ఇల్లొక రాజకీయం ఇంటిని రాజకీయ క్షేత్రంగా చూపిస్తుంది. స్త్రీల మౌనాన్ని, శ్రమను, హింసను ప్రశ్నిస్తుంది. గీతాంజలి కవిత్వంలో ఐరనీ, ప్యారడాక్స్ పాఠకుడిని కట్టిపడేస్తుంది. సిద్ధాంతము, జీవితమూ అవిభాజ్యంగా పెనవేసుకున్న ఈ సంకలనం పాఠకులను ఆత్మపరిశీలనకు పిలుస్తుంది.

-వంశీకృష్ణ
95734 27422
