త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరు

తెలంగాణ

హైదరాబాద్‌: త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని, మంచి నాయకుడు అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమన్నారు. హైదరాబాద్‌,గచ్చిబౌలిలోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బి) లీడర్‌ షిప్‌ సమ్మిట్‌’ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఐఎస్‌బి ప్రాంగణంలో సిఎం రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యమని, తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పని చేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమన్నారు. నాయకునిగా ఎదగాలంటే ముందుగా ధైర్యం, త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించాలని సూచించారు. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని, మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చని, దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్‌ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారని తెలిపారు. ప్రజలతో నిత్యం, నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని,పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా సమాన గౌరవమిస్తూ స్నేహ భావంతో అందరినీ కలుపుకుపోవాలని విద్యార్థులకు సిఎం సూచించారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌, పివి నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని,తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు.
తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తమ లక్ష్యమని,ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్‌ డాలర్ల నగరంగా మార్చాలని, ఇందుకు ఐఎస్‌బి విద్యార్థుల సహకారం అవసరమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి తనకు ఐఎస్‌బి విద్యార్థుల సాయం కావాలని, ‘మీరు’ ఎక్కడికెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్‌ గురించి మాట్లాడాలని కోరారు. భారత దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్‌ పోటీపడాలని తాను కోరుకోవడం లేదని, న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌, టోక్యో , సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్‌ పోటీపడాలని కోరుకుంటున్నాని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్‌ అత్యుత్తమంగా మారాలన్నదే తన పెద్ద లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన అని సిఎం చెప్పారు. గచ్చిబౌలిలో స్పోర్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రెండు, మూడేళ్ల పాటు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి
ఐఎస్‌బి విద్యార్థులు తమ ప్రభుత్వంతో రెండు, మూడేళ్లు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నానని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘మీకు’ పెద్ద జీతాలు ఇవ్వలేకపోయినప్పటికీ మంచి అవకాశాలు, పెద్ద సవాళ్ళను,జీవితానికి సరిపడా నాలెడ్జ్‌ను మాత్రం అందిస్తుందని తెలిపారు. ఐఎస్‌బిలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని అన్నారు.