డా.మహేంద్రకుమార్ మిశ్రా ప్రముఖ ఒడియా రచయిత మరియు జానపద పరిశోధకులు. ఒడిశాలో తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పచ్చని భూములనిండా విస్తరించిన వందలాది పండ్ల వృక్షాల నీడన, దక్షిణ, పశ్చిమ దిక్కులలో ఆకాశాన్ని అందుకునే పర్వత శ్రేణులు, పచ్చదనాన్ని విస్తారపు పంటల్లా పండించే అరణ్యాలలో సేద తీర్చుకున్న జనజీవన స్రవంతిలోని స్వరాలను శృతిచేసుకున్న జానపద కథల గుండె సవ్వడిని సుదీర్ఘకాలంగా నమోదు చేసుకుంటూ, నాణ్యమైన కథా సాహిత్య భాండాగారాన్ని విశ్వానికి కానుకగా అందించిన సుప్రసిద్ధ నిత్య సాహిత్య హాలికుడు డా. మహేంద్రకుమార్ మిశ్రా.
____________
‘పశ్చిమ ఒడిశాలో లోక సంస్కృతి’, ‘కలహండీలో లోక సంస్కృతి’, ‘విజనింగ్ ఫోక్ లోర్..మొదలైన విశిష్ట రచనలు ఆయన కలం ప్రసాదించిన వెలుగులే. ఆ వరుసలో మిశ్రా సంపాదకత్వంలో, సంకలనం గావించిన మరో అఖండ సాహిత్య సజీవ కథల సమాహారమే ‘ఒడిశా లోక కహాని’ గ్రంథం. 240 పేజీలలో విస్తరించిన ఈ అక్షర సమూహాన్ని ‘ఒడిశా జానపద కథలు’ పేరుతో తెలుగులోని ప్రామాణిక స్థాయిలో అనువాదం చేసిన వారు, ఉత్తమ రచయిత్రి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కార గ్రహీత ‘డా. తుర్లపాటి రాజేశ్వరి’.
____________
ఈ జానపద కథల పచ్చదనం రహదారుల్లో అడుగుపెట్టగానే, అత్యంత అల్లారు ముద్దుగా పెరిగి, చుట్టూ రత్నాలు పొదిగిన చందమామ కావాలని ఆశించి, మధ్యలో అష్టకష్టాలు అనుభవించి, చావు దొరికితే చాలని ఆశించిన అమ్మాయి ‘తొపోయి’, ఆమెపట్ల మనం చూపించే జాలిని వెన్నెలలాగా ఆస్వాదిస్తుంది ఈ కథ.
ఇక చివరి కథ ‘నాలుగు యుగాలు’ నాణ్యమైన వస్తుసంపదతో కలకాలం మన జ్ఞాపకాలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ రెండు కథల మధ్య మరో 49 జానపద కథలు అత్యంత ప్రశంసనీయమైన శైలితో గాఢమైన సాహిత్య స్నేహానికి పాఠకులను ఆహ్వానిస్తూ పాడిన పాటలకు కోకిల స్వరాలను అరువు తెచ్చుకున్న దృశ్యాలు ముగ్ధమనోహరంగా వుండటం ఒక గొప్ప విశేషం.
కాలక్షేపం కోసం కేటాయించుకునే కథల జాబితాకు చాలా దూరంగా నిలిచిన కథలు ‘ఒడిశా జానపద కథలు’. ఈ కథల్లో జానపదుల జీవితాలే కాదు. ఆ జీవితాలతో ముడిపడిన అసంఖ్యాకమైన సంప్రదాయాలు, సంస్కృతులు, రాచరికాలు, మాయలు, మంత్రాలు, దైవదర్శనాలు, గగుర్పాటు కలిగించే వింతల విన్యాసాలు, పాతాళలోకంలాంటి ఇతర లోకాల పరిచయాలు, గారడీపక్షి దీపంపురుగులా మారిపోవడం, అంతలోనే రాబందులా రూపాన్ని సంతరించుకోవటం, శివాలయం నుంచి తెచ్చిన పాదుకను రెక్కమీద చల్లగానే ఇంద్రజాల పక్షి జీవం పోసుకుని పైకి లేవడం, స్వర్గంలో ‘ఛాయాపథం’ అనే నది ఏర్పడటానికి దారితీసిన కథా విశేషాల గమ్మత్తులు, ఏడుగురు దేవతా స్త్రీలు ప్రత్యక్షమై, ఒంటరిగా బ్రతికే సమర్ ప్రధాన్ కు మశూచి వ్యాధిని నయంచేసే మంత్రాన్ని ఉపదేశించడం, ఆ మంత్రాన్ని స్వార్థంకోసం ఉపయోగించుకుని కష్టాల పాలైన సన్నివేశాలనుంచి కొన్ని సందేశాలు మన చుట్టూ చేరిపోవడం,అడవికి వెళ్లిన ఒక వృద్ధురాలి తలలోనుంచి ఒక ఎలుకపిల్ల రావటం,అది పిల్లిగా మారి చూస్తుండగానే పులిగామారి అడవిలోకి వెళ్లిపోవడం, ఆ తరువాత అనేక సన్నివేశాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయటం, ఒక దట్టమైన అడవిలో పులులు, ఎలుగుబంట్లు, సింహాలు, లేళ్లు, ఖడ్గమృగాలు, నక్కలు, ఏనుగులు.. ఇలా సమస్తం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ దేశపు రాకుమారికి సరైన వరుడు దొరకడం లేదు.
ఆ కన్యకు మన ఏనుగే సరైన వరుడంటూ తీర్మానించి, ప్రతిరోజు తెల్లవారుజామున ఉద్యానవనంలోని కొలనుకు స్నానంకోసం రాకుమారి వస్తుందని, సమయం కాచి ఆమెను తీసుకొచ్చే బాధ్యతను ఏనుగుల గుంపు స్వీకరించడం, ఆ తరువాత ఊహకు అందని మలుపులు కథలో చోటుచేసుకుని పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేయటం, సవరభాషలో ‘జెంబరామాతు’ దీర్ఘ జానపద కావ్యానికి చేసిన అనువాదంలో సవరలు ఎందుకు ఎర్రమట్టితో గోడలమీద చిత్రించి పూజిస్తారో వివరించిన విధానం. ఇలా ప్రతి కథలోనూ ఒక విశేషం విశాలమైన అనుభూతికి తివాచీలు పరచటం ఈ జానపద కథల ప్రత్యేకతకు దండోరాలు మ్రోగించినట్లుగా వుంది.
ఈ జానపద కథల నిర్మాణంలో అనుసరించిన శైలి.. కథలు రాసేవారికి ఉత్తమ పాఠ్యాంశాలుగా ఉపయుక్తమవుతున్నాయి. కథలలోని ప్రారంభం, ఆయా కథలను చదవడానికి పాఠకులను మానసికంగా సిద్ధం చేయటం చాలా విశేషంగా కనపడుతోంది. “ఒకసారి పాతాళలోకం నుంచి నాగరాజు కుమారుడు హాలాహల కుమార్ భూలోకంలో నాటక ప్రదర్శనలు చూడటానికి వచ్చాడు..” అంటూ ‘శశిసేణ’ కథ, “ఎంతకాలం కిందో ఎవరు చెప్పగలరు? ఒక రాజు ఉండేవాడు.
రాజు అనగానే ఒక రాజ్యం ఉంటుంది కదా! రాజ్యమనగానే అక్కడ ప్రజలుంటారు. ప్రజలంటే వారు సాధారణమైన వాళ్లు అనుకునేరు. అసలు కారు…” అంటూ చాలా ఆశ్చర్యకరమైన దృశ్యాలతో .. ‘సారుకుమార్ – నాగకన్యలు’ కథ, “ఒక రాజ్యంలో ఒక ముసలి రాక్షసి ఉండేది. పగటివేళ అది నీళ్లల్లో ఉండి రాత్రి సమయాల్లో భూమిమీద తిరుగుతూ మనుషుల్ని తినేది” అంటూ ‘కేశ సుందరి’ కథ. ఇలా చాలా ఆసక్తిని కలిగిస్తూ కథలన్నీ తమ ప్రారంభాలకు తలుపులు తీస్తున్నాయి. ఈ కథలు చాలావరకు సుఖాంతపు సన్నివేశాలతో ముగింపు పలకటం మరో విశేషం. ఈ జానపద కథలలో రాజు, రాణీలు, రాజకుమార్తె, రాజకుమారుడు, రాజభవనాల వర్ణనలే అధికంగా వుంటాయి.
చాలా కథల్లో అతీత శక్తుల ప్రభావం వల్ల మామూలు మనిషి అత్యంత శక్తివంతుడిగా మారటం, తన మనసులోని కోరికలను జయించడం జరుగుతూ వుంది. సిల్కులాంటి కత్తి, ఎగిరే గుర్రం, ఇంద్రజాలి పక్షి, మాయావి ఈగ, ఉపకారి చిలుక, పరోపకారి సర్పం మొదలైనవి ఆశ్చర్యాన్ని కలిగించే శక్తులతో నాయికా, నాయకుల కష్టాలని తీర్చి, ఆనంద తీరాలను చేర్చడం కథలలోని సాంద్రతకు మరింత బలాన్ని అందించినట్లుగా వుంది.
ఈ సంకలనంలోని చివరి కథ ‘నాలుగు యుగాలు’, చాలాకాలం పాఠకులను ఆలోచనా దారుల్లో నడిపిస్తూనే వుంటుంది. ఈ కథలో నాలుగు యుగాలు కలుసుకుని ఆయా యుగాలలో న్యాయం ఎలా వుండేదన్న విషయం మీద మాట్లాడుకుంటాయి. సత్య యుగంలో ‘ప్రజలు తప్పు చేస్తే రాజు శిక్ష అనుభవించేవాడు’, త్రేతాయుగంలో ‘గ్రామంలో జనాలు తప్పుచేస్తే గ్రామాధికారి శిక్ష అనుభవించేవాడు’, ద్వాపరయుగంలో జనం పాపకార్యాలు చేస్తే కుటుంబ పెద్ద శిక్ష అనుభవించేవాడు’, మరి కలియుగంలో పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు జవాబుగా ఒక కథ చెప్పబడింది. ‘పాపం ఎవరు చేసినా ఆ పాపం చేసినవాళ్లే శిక్ష అనుభవిస్తారు’. కలియుగంలో మనిషి వికృత చేష్టలను చాలా బలంగా ఆవిష్కరించిన ఈ కథ ఈ సంకలనానికి నిలువెత్తు తిలకంలా నిలిచింది.
ఈ కథలను అధ్యయనం చేశాక, జనశ్రుతిలో ఉన్న కథల ఉద్దేశ్యం మనసులను రంజింపజేయటమే కాదు, “లోకజ్ఞానాన్ని కలిగించడం” అన్న సత్యం చాలా స్పష్టంగా తన ఉనికిని ప్రకటించుకుంటోంది. ఎన్నో ఏళ్లనాటి ఈ జానపద కథలు అప్పటికీ, ఇప్పటికీ ప్రజాహృదయాలకు చాలా దగ్గరవుతూనే వున్నాయి. ఆ కథలలోని స్థితి నేడు కనిపించకపోయినా, కథ, కథనం, పాత్రలు, విచిత్రమైన సన్నివేశాలు, ఊహకు అందని మలుపులు, మాయలు, మంత్రాలు, ఇంద్రజాల విద్యలు, భూతప్రేతాల విన్యాసాలు, దేవతల ప్రత్యక్షాలు, రాజులు, రాచరికాలు, మనసును ఆహ్లాదపరిచే వినోదాలు..చిత్రీకరణలో వీటి సామర్థ్యాల ఫలితంగా ఎప్పటికీ సజీవంగా పాఠకులను పలకరిస్తూనే వుంటాయి ఈ కథలు.
ఈ కథలలో కనిపించే మానవ నైజాలు, తప్పిదాలు, బలహీనతలు, కోరికలు, కోపాలు, తాపాలు, అదృష్ట, దురదృష్టాలు, పూజాపునస్కారాలు, దేవుడిమీద నమ్మకాలు, కొన్ని ఆచార వ్యవహారాలు.. ఇవన్నీ వర్తమానంలో సైతం సజీవంగా కొనసాగుతూనే వున్నాయి. కథలలో ఎక్కడో ఒకచోట పాఠకుడి నీడలు కనిపిస్తూ వుంటాయి. ఆదివాసీ, ద్రావిడ, ఆర్య కుటుంబాల ఒడిశా సంస్కృతి ఈ కథలలో స్పష్టంగా కనపడుతోంది. ఈ జానపద కథల నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు దక్షిణ, పశ్చిమ ఒడిశాలలో లభ్యమైన ప్రాదేశిక భాషలలోని మౌఖిక సాహిత్యం, మరియు ఒడియా భాష మాట్లాడే పూరీ, ఖుర్దా ప్రాంతాల మౌఖిక సాహిత్యంలోని అసంఖ్యాకమైన కథలలో కొన్నింటిని తీసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించిన ప్రయత్నం చాలా అభినందనపూర్వకంగా వుంది.
______________
ఈ మొత్తం కథలన్నీ అతిసాధారణ ప్రజలనుండి స్వీకరించిన దాఖాలాలు తమ గొంతులను గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కథలలో కాల్పనికత, వాస్తవికత రెండు అంశాలు కథను నడిపించడంలో సమర్థవంతమైన పాత్రను పోషించాయి. అంతేకాదు మానవ జీవితాలతో ముడివేసుకున్న సుఖదుఃఖాలు, కష్టనష్టాలు చాలా సహజంగా చిత్రీకరించబడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జనం భాషా, సంస్కృతులకు, ఆదివాసీ జీవన సత్యాలకు ప్రాతినిథ్యం వహించిన కథలు ఈ సంకలనంలో సంపూర్ణంగా చోటు చేసుకున్నాయి.
______________
ఒడియా భాషలో మహేంద్ర కుమార్ మిశ్రా సంకలన పరిచిన జానపద కథలను తెలుగులోకి అద్భుతంగా అనువదించిన డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒక అమూల్యమైన అనువాద సంపదను తెలుగు పాఠకులకు అందించిన ఈ సందర్భం కలకాలం చాలా శోభాయమానంగా ప్రకాశిస్తూనే వుంటుంది. ఆమె సుప్రసిద్ధ రచయిత్రి, వ్యాసకర్త, పరిశోధకురాలు. ఎన్నో ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు స్వీకరించిన బలమైన కలం ఆమెది. గతంలో ప్రతిభారాయ్ కథలు ‘ఉల్లంఘన’, గోపీనాథ మహంతి ‘దాదీ బుఢా’ (ఈతచెట్టు దేవుడు) మొదలైన గ్రంథాలను తెలుగు.సాహితీ లోకానికి అందించారు.
-‘సాహిత్య ప్రపూర్ణ’ డాక్టర్ కె.జి. వేణు
98480 70084