పరిశ్రమలో పూర్తిస్థాయి భద్రత చేపట్టలేదు
ఫార్మా కంపెనీని పరిశీలించిన సిఎం చంద్రబాబు
అనకాపల్లి : అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ప్రమాదం చోటుచేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఇక్కడ నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదని తెలుస్తోంది. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదు. గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలి. రెడ్ కేటగిరిలోని పరిశ్రమలన్నీ కచ్చితంగా ఎస్‌వోపీని పాటించాలి. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నాం. పరిశ్రమలో ఏం జరిగింది.. లోపాలపై కమిటీ విచారిస్తుంది. నివేదిక వచ్చాక ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టం.. శిక్షిస్తాం. బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నాం. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతాం. పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం‘అని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్ ఆస్పత్రిలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్నివిధాలా చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని హావిూ ఇచ్చారు. తాము అండగా ఉంటామని.. ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, మెడికవర్ ఆస్పత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగం అయ్యారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి, 36 మందికి గాయాలయ్యాయాని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలు అయ్యాయని తెలిపారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడిరచారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
