తెరతీసి వివరిస్తున్న ప్రధాన కార్యదర్శి డా. జి.వి.పూర్ణచందు
మీకు ఇటీవల ‘సరస్వతీసమ్మాన్’ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించిన సందర్భంగా మీ అనుభూతి, స్పందన మా సజన క్రాంతితో పంచుకోండి…
అవార్డులు, సన్మానాలు సెల్ ఫోన్ రీచార్జి చేయటం లాంటివి. ఎప్పటికప్పుడు పునరుత్తేజితం కావటానికి ఇవి ప్రోత్సాహకాలు. అదిన్నీ, మన భాష, మన ప్రాంతం కాని ఒక సంస్థ ఇచ్చిన గుర్తింపు తప్పనిసరిగా ఉత్సాహాన్నిస్తుంది. ఈ సంస్థ ఊభయ రాష్ట్రాల ప్రతినిధులకు నా ధన్యవాదాలు. ఆచార్య కసిరెడ్డి వేంకటరెడ్డి గారితో పాటుగా ఈ పురస్కారానికి ఎంపిక కావటం గర్వకారణం నాకు.
మీరు రేపు డిసెంబరులో నిర్వహించనున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ఉద్ధేశ్యం?
2024లో రెండు రాష్ట్రాలలోనూ రాజకీయపరంగానూ, సామాజికంగా కూడా మార్పు అనేది ప్రధాన అంశం అయ్యింది. ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు. రేపటి తరం కోసం ఇప్పటి మనం వివిధ రంగాలకు సంబంధించి ఏ విధమైన మార్పుని కోరుతున్నామన్నదే ఈ సభల ముఖ్య చర్చనీయాశం. సాహిత్య రంగాలతో పాటు, విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలు, రాజకీయ, సామాజిక రంగాలలో మార్పుల మీద మా దష్టి ఎక్కువగా ఉంది. సదస్సులు ఈ అంశం పైనే ప్రధానంగా జరుగుతాయి.
యువగళ సమ్మేళనం అన్నారుకదా? దానిగురించి చెప్పండి?
ఐదు పర్యాయాలు ప్రపంచ సభలు, ఒక పర్యాయం జాతీయ సభలు, ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు ఇలా ఎన్నో నిర్వహించినప్పటికీ యువత పాత్ర, ప్రమేయం చాలా స్వల్పంగా ఉన్నాయనే ఆవేదన చెందుతున్నాం. అందుకని ఈ మహాసభలలో యువతరం కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాము. వాటిలో ‘ఆలపిస్తాం హాయిగా’ పేరుతో యువగళ సమ్మేళనాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో ఆసక్తిదాయకంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సభలలోనే వేరే వేదికపైన ఈ కార్యక్రమం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కవితాంశంగా ప్రకటించాము. ఈ యుగళసమ్మేళనం 40 యేళ్ల లోపు యువతీ యువకులతో జరుగుతుంది. పాల్గొనేవారు తమ రచనను ఎంపిక కోసం మాకు పంపవలసి ఉంటుంది. ఎంపికైన వారి పేర్లను ఆహ్వాన పత్రికలో ప్రకటిస్తాము. అలాగే, కథ, కవిత, పద్యం, నవల ఇలా 10 సాహిత్య ప్రక్రియలలో నిపుణులతో వర్క్ షాపుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. విద్యార్థులు తమ విద్యాలయాల నుండి ధ్రువీకరణ పత్రాలు ఉంటే వారికి భోజన, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నాము.
మరి మీరు ఆశించిన స్పందన ఉన్నదా?
సున్నా స్థాయి నుండి ప్రారంభిస్తున్నాం కాబట్టి, నిరాశపడ నవసరం లేదు. వివిధ విశ్వవిద్యాలయాల నుండి కళాశాలల నుండి విద్యార్థులు, విద్యార్థినులు ఇప్పటికే 300 మంది దాకా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మేము 500 మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో 300 చిన్న సంఖ్యేమీ కాదు. ఉపాధ్యాయ వర్గం కాస్త గట్టిగా పూనుకుంటే 500 సంఖ్యను చేరటం అసాధ్యం కాదు. సి వి రెడ్డి ఛారిటీస్ అతిథి గహాన్ని విద్యార్థులకు కేటాయించటానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కె యస్ రామారావు ఆమోదం తెలిపారు.
ఆసక్తి కలిగిన పెద్దవాళ్లు కూడా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనవచ్చా?
సభాస్థలిలో తరగతి గదుల అందుబాటుని బట్టి శిక్షణాతరగతుల్లో పాల్గొనేందుకు పెద్దవాళ్లని కూడా అనుమతించే అవకాశం ఉంటుంది.
ఈ సారి ప్రతినిధుల నమోదు ఎలా ఉంది?
500/- రూపాయలు ప్రతినిధి రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకున్న 1,000 మంది ప్రతినిధులు , 500 మంది విద్యార్థులు, 500 మంది అతిథులు, పాత్రికేయులు మరియు ఇతరులతో కలిపి మొత్తం 2000 మందికి ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతినిధుల నమోదు మా గరిష్ట సంఖ్య 1000 మందిని ఇప్పటికే దాటేశాము.
ఈ సభలకు మీరు కోరినట్టు అన్ని ప్రాంతాల నుండీ ప్రతినిధులు వస్తున్నారా?
ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు అభిమానంగా ప్రతినిధులు తరలి వస్తున్నారు. తెలంగాణా నుండి వచ్చేవారి సంఖ్య ఒకింత ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడూ!
రెండు రోజులపాటు ఇంత భారీ కార్యక్రమ నిర్వహణ సామాన్యమైన విషయం కాదు. మీకు ఎలా సాధ్యం అవుతోంది?
మా పిలుపుకు ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది స్పందించగలగటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కష్ణాజిల్లా రచయితల సంఘం పట్ల అభిమానమే కారణం. మొదటినుండీ మా సభలకు వేదికల నిచ్చి సహకరించిన శేషశాయి, యస్ వి యస్ కళ్యాణమంటపం అధినేత బసవయ్య గారు, కష్ణవేణి విద్యాసంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్ గారు, సిద్ధార్థ అకాడెమీ పాలకవర్గాలకు మేమెప్పుడూ ఋణపడి ఉంటాము. ఈ సారి కాకరపర్తి భావనారాయణ కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తోంది. మా అన్ని సభలకు భూరి విరాళాలిచ్చి సహకరిస్తున్న కె. ఐ. వరప్రసాద రెడ్డిగారు బొమ్మిడాల శ్రీ కష్ణమూర్తిగారు, స్వాతి బలరాం గారు ఇలా ఎందరో ఇప్పుడూ చేయూత నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి, విజయవాడ పూర్వ లోకసభ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు, చందనా గ్రాండ్ వారు ఇంకా అనేక సంస్థలవారు మేమున్నామంటూ మా భుజం తడుతున్నారు. చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… కష్ణాజిల్లా రచయితలసంఘానికి బలమైన కార్యనిర్వాహక వర్గం ఉంది. గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్ద లక్ష్మీప్రసాద్, అధ్యక్షులు శ్రీ గుత్తికొండసుబ్బారావు ఈ సంస్థకు జవసత్వాలు నింపుతున్నారు
మహాసభలకు ప్రముఖులు వస్తున్నారా?
తెలుగు భాషకు పెద్ద దిక్కుగా ఉన్న పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మార్గదర్శి సిఇవో శ్రీమతి శైలజాకిరణ్ గారు, ప్రఖ్యాత కవులు శ్రీ కె. శివారెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఒడియా కవయిత్రి సుశ్రీ సంగీత మిశ్రా, పశ్చిమ బెంగాల్ స్త్రీ, శిశుసంక్షేమ శాఖామాత్యులు డా.శశి పంజా, ెసూరు పార్లమెంటు సభ్యులు శ్రీ కె. గోపీనాథ్ ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకమంది తెలుగు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఉభయరాష్ర్ట ప్రభుత్వాల ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. వారి ఆమోదం రాగానే తెలియబరుస్తాం.
రేపటి మీ ప్రపంచ మహాసభల్లో ప్రభుత్వం పాత్ర ఏమీ లేనట్టుంది…?
ఇప్పటి వరకూ 5 పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహసభలను నిర్వహించాము. ఇవి 6వ మహాసభలు. ఈ ఆరు పర్యాయాల్లోనూ మొదటి రెండు సభలకే ప్రభుత్వం సహకరించింది. అది కూడా చాలా స్వల్పంగా! ఆ తరువాత సభలకు మేము ప్రభుత్వ పరమైన ఆర్థిక సహకారం కోరలేదు. 2019, 2022లలో జరిగిన సభలకు ఆనాటి ప్రభుత్వం వ్యతిరేకత కనబరచింది కూడా! భాషాభిమానులైన ప్రముఖులు, పెద్దల సహకారంతో మా సభలు వియవంతం అయ్యాయి.
తెలుగు అకాడమీ, అధికార భాషాసంఘం వంటివి క్రియాశీలకంగా పని చేస్తేనే భాషకు పునర్వైభవం. గత ఉమ్మడి రాష్ర్టంలో ఉన్న వైభవం మళ్ళీ ఆశించవచ్చా? రేపటి సభల్లో వాటి మీద చర్చ ఉంటుందా?
తెలుగు అకాడెమీ, అధికార భాషా సంఘం లాంటి సంస్థలు పొలిటికల్ నామినేషన్ల జాబితాలో ఉన్నంత కాలం వాటినుండి క్రియాశీలతను ఆశించలేము. అధికార భాషాసంఘం పదును లేని కత్తి. దాని వలన ఫలితం తక్కువ. రాజకీయాలకు అతీతంగా, పునరావాస కేంద్రాలుగా కాకుండా, భాషా ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకోవాలని మా సభలలో అనేకసార్లు తీర్మానాలు చేశాము కూడా!
వ్యక్తిగతంగా మీరు సూచించే మార్గాంతరం ఏమిటీ?
2017లో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తెలుగు భాషా పరిరక్షణ విషయమై ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలలోపర్యటించి, అక్కడి ప్రాధికార సంస్థలు, అకాడెమీల పనితీరుని పరిశీలించింది. 2018లో కమిటీ వారు తెలుగు భాషాప్రాధికార సంస్థని ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ప్రాధికార సంస్థకి శిక్షవేసే అధికారాలని కల్పించారు. ఆ నాటి ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించింది. కానీ ఆచరణకు రాలేదు. వీసమెత్తు భాషాపచారం జరిగినా శిక్షించే సంస్థ ఉంటేనే బడిభాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు సాధ్యం అవుతుంది. ఈ పదునైన సంస్థకి రాజనీత్ఞిడు, పాలనా దక్షుడు, ప్రజల్లో భాషాభిమానిగా గుర్తింపు ఉన్న వ్యక్తిని వెదికి బాధ్యతలు అప్పగిస్తే తెలుగు భాషకు మంచి రోజు లొస్తాయి. భాషకు సంబంధించినంతవరకూ రాజకీయ నియామకాలు చెడే చేస్తాయి. రేపటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రాథికార సంస్థ ఏర్పాటుని గట్టిగా కోరతాయి కూడా!
తమిళులకోసం గత 2-3 యేళ్ళుగా కాశీలో తమిళ మహాసభల్లాంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది. తెలుగుకు అలాంటి భాగ్యం ఎన్నడో…?
రాజకీయ ప్రయోజనాలకు భాషని ఒక ఆయుధంగా తమిళ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. మన రాజకీయ పార్టీలకు తెలుగు పేరు చెప్తే పడే ఓట్లు కూడా పడవనే భయం ఉంది. ‘పొలిటికల్ విల్’ అంటామే రాజకీయ నిర్ణాయకత ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. అయినా, కాశీలోనే కాదు, తెలుగు వారు దేశంలో దండిగా ఉన్న ప్రాంతాలన్నింటా తెలుగు మహాసభలను ప్రభుత్వం పైన ఆధారపడకుండా మనమే ఏర్పరచుకోవచ్చు. ప్రభుత్వం తల దూరిస్తే రాజకీయ పార్టీల కార్యక్రమంగా మారిపోయి భాషాసాహిత్యాలు అప్రధానం అవుతాయి. తెలుగువారికి నిర్వహణా చైతన్యం, సన్నద్ధత ఉన్నాయి. ఉదారులైన ప్రాయోజకులు కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాహితీ సాంస్కతిక సంస్థలతో అనుబంధం రీత్యా ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆ బాధ్యతను చేపట్టగలదు కూడా!
మళ్ళీ సభల విషయానికి వద్దాం! మీ సభలన్నీ మంచి పరిశోధనా వ్యాస సంపుటి ద్వారా చిరస్మరణీయం అవుతాయి. ఈ సారి కూడా అలాంటి పుస్తకం తెచ్చే ఆలోచన ఉన్నదా?
‘మార్పు’ పేరుతో వివిధ రంగాలలో రేపటి తరం కోసం తేవలసిన మార్పుల గురించి ఆ యా రంగాల నిపుణులతో వ్యాససంపుటిని ఈ మహాసభల కానుకగా వెలువరించే ప్రయత్నంలో ఉన్నాము. ప్రాయోజికుల కోసం ప్రయత్నిస్తున్నాము.
ఆంధ్ర రాష్ర్టం రెండుగా విడిపోయాక, అమరావతి విశిష్టత, తెలుగు వారి వైభవం తెలిసే విధంగా పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుపలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటివి ఆశించవచ్చా?
2018లో ఆనాటి సాంస్కతిక శాఖ సంచాలకులు డా. దీర్ఘాసి విజయభాస్కర్ అమరావతి తెలుగు మెత్సవాలు నిర్వహణకు ఒక ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వానికి పంపారు. అది ఆచరణకొచ్చి ఉంటే ఒక ఆనవాయితీ మొదలై ఉండేది. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం కొంచెం కుదుట పడ్డాక ఈ విషయంపై దష్టి సారించాలని కోరుతున్నాం. సహకరించేందుకు ప్రపంచ తెలుగు రచయితల సంఘం సిద్ధమే!
రాష్ర్ట ప్రభుత్వాలు, పెద్ద విశ్వద్యాలయాలు చేయాల్సిన పనిని కష్ణాజిల్లా రచయితల సంఘం చేయటం ప్రశంసించదగ్గ విషయంగా భావిస్తున్నారు.
కష్ణాజిల్లా రచయితల సంఘమే ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని వ్యవస్థాపించింది. తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. భాషా సంస్కతుల పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేయటానికి కషి చేస్తోంది.
ఈ సభలు ఘనవిజయం సాధించి, తెలుగు వారి భాషాభిమానం మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.
నమస్కారం.
– సజనక్రాంతి పత్రిక తరఫున ప్రత్యేక ముఖా-ముఖి – డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య