మాయమౌతున్న విలువలు..

ఎడిటోరియల్

పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాలు, సామాజిక స్పృహ..
ప్రపంచీకరణమాయలో ధనమే ప్రధానంగా మారిన తీరు..
విచక్షణ గల మనుషిలో స్వార్థం, రాక్షసత్వం పెరిగిపోతుంది..
శాస్త్రీయ స్ఫూర్తిని వీడి మూఢనమ్మకాలు,అందవిశ్వాసాల్లో పాకులాడుతున్న పాలకులు, పాలితులు..

మనిషి కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని చేదిస్తూ విజ్ఞాన ప్రపంచంలో అభివృద్ధి పేరిట విహరిస్తున్నాడు. కానీ పాత రాతి యుగపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత విచారకరం. నేడు మనిషి వెనక్కి నడుస్తున్నాడా!.. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవత్వపు విలువలు, సామాజిక స్పృహ, మానవ సంబంధాలు చూస్తుంటే?బాధ్యత, భద్రత లేని ఈ ఆధునిక కాలంలో మనిషి ప్రవర్తన గమనిస్తే!. జ్ఞానం వెనువెంటే అజ్ఞానం, తెలివి వెన్నంటే అమాయకత్వం, ధైర్యం వెనకే భయం మనిషిని పట్టి పీడిస్తున్నాయి. విచక్షణ గల మనుషుల్లో అమూల్యమైన మానవత్వపు విలువల జాడలు ఎంత వెతికినా కానరావడం లేదు. ఒకవైపు మనిషి గ్రహాల స్థితిగతులు లెక్కిస్తూ, కృత్రిమ గ్రహాలను సృష్టిస్తున్నాడు. కానీ భవిష్యత్తు ఫలితాల కోసం అదృష్టం, అంధ విశ్వాసాలు, ఛాందస ఆలోచనలు, అర్థ సత్యాలు, అసత్యాల భ్రమలో పడకుండా సత్యాన్ని నమ్మాలి. సమాజ హితం కోరి మార్పు కోసం అభ్యుదయ, హేతువాద, వైజ్ఞానిక దృష్టితో ప్రవర్తించాలి. మృగ్యమవుతున్న మానవత్వ విలువలను నెలకొల్పుతూ, సంస్కారవంతమైన సమాజ నిర్మాణం కోసం రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలనేది విస్మరించరాదు. కార్పొరేట్, వ్యాపార ప్రపంచంలో పడిన మనిషికి ధన(ఆర్థిక)మే ప్రధానంగా మారిపోయింది. కుటుంబ బంధాలను, ప్రాణాలను లెక్కచేయకుండా, విచక్షణను, చదివిన చదువులను, విజ్ఞానాన్ని మరిచి అమానవీయంగా, విలువలు మరిచి ప్రవర్తిస్తున్నాడు. మనిషిలో స్వార్థం, ఆర్థిక, అధికార ఆధిపత్య భావజాలం పెరిగిపోతున్నాయి. ఆస్తి కోసమో, ప్రేమ కోసమో, ధనం కోసమో బంధాల మధ్య అనుమానాలు, అపోహల పొరలు కమ్ముకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సందర్భంగా జరుగుచున్న సంఘటనలు చూస్తుంటే?ఆస్తులు, ప్రేమ, అవసరాల కోసం అయిన వారినే విచక్షణ కోల్పోయి చంపుకుంటున్నారు. ఇలా మానసిక భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనలు కన్న, విన్న మనసున్న మనుషుల హృదయాన్ని కలచి వేస్తున్నాయి. ఈ ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని ఈ సమాజం నుంచి, మానవుల మనసుల్లోంచి శాశ్వతంగా నిర్మూలించలేమా!. అభివృద్ధి, విజ్ఞానం వీటికి పరిష్కారం చూపలేదా? మనమందరం నేడు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం తీవ్రమైన విషయం ఇదే. ఇలా నేరాలకు పాల్పడే ముందు, దాని తర్వాత జరగబోవు పరిణామాలను ఆలోచన చేసుకోలేక పోవడమే జరుగుతున్న ఘోరాలకు కారణం. ఒక మనిషి ఇంకో మనిషిపై, ఒక మానవ సమూహం ఇంకో సమూహం పై హింసకు పూనుకోవడం ముమ్మాటికి రాక్షసత్వ, అనైతిక చర్యగా భావించాల్సిందే. ఈ విపరీత ధోరణులకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తు అంధకారమే. విజ్ఞాన దివిటీని చేబూని తప్పుడు ప్రవర్తనను సరి చేసుకోవాలి. శాస్త్రీయ స్ఫూర్తిని నింపుకొని, మానవతా వాదాన్ని జత చేసుకుని తమను తాము సంసిద్ధులు కావాల్సి ఉంది. మనిషి రుజువర్తనతో నడు(నడిపి)స్తూ విలువలు నెలకొల్పాలి. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలి. తదేకమైన దృష్టితో ముందుకు నడిస్తే వేగం పెరిగి ఎంచుకున్న గమ్యం చేరుకోగలం. అలా కాదని కావాలని వెనక్కి నడిస్తే గతి తప్పి చతికిల పడతం సుమా. ప్రపంచీకరణ వలలో పడిన మనిషి మానవత్వం మరిచిపోతున్నాడు. ధనమే ప్రధానంగా భావిస్తూ విలువలకు, ప్రేమానురాగాలకు బంధాలకు తిలోదకాలిస్తున్నారు. ఈ విధానంలో మార్పుతేవడంలో ప్రధాన పాత్ర పోషించాల్సింది ప్రభుత్వాలు, సమాజం. ఈ సంక్షేమ, శ్రేయో సమాజంలో ప్రజలపై మోయలేని భారాలను తగ్గించాలి. మానసిక ఒత్తిడి కొంత మేరకు ఈ ఘటనలకు కారణమౌతాయని మానసిక నిపుణుల అభిప్రాయం. ఒకవైపు ప్రభుత్వాలు పాలనలో మానవీయత చాటాల్సిన చోట ఒత్తిడిని పెంచుతూ మరో వైపు కార్పొరేట్ల, ధనవంతుల సేవలో మునిగి తేలుతున్నారు. లాభాలే ధ్యేయంగా మార్కెట్ కోసమే మనుషులన్నట్లుగా మార్చేస్తున్నారు. మానవ విలువలు మృగ్యమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో చీడపీడల్లా సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను నివారించేందుకు అందరం నడుం బిగించాలి. విలువలు, మానవత్వం, సామాజిక స్పృహ సమాజంలో నెలకొల్పేలా విస్తృత అవగాహన కల్పించాలి. జన జీవన ప్రమాణాలు మెరుగు పరచాలి. అసమానతలు లేని శాంతి సామరస్య సమాజం ఏర్పాటుకు ప్రభుత్వాలు, పౌర సమాజం చిత్తశుద్ధితో పూనుకోవాలి.

 

మేకిరి దామోదర్,

సామాజిక విశ్లేషకులు, జిల్లా:వరంగల్, ఫోన్:9573666650.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *