ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు
కూకట్‌పల్లి, అమీన్‌పూర్, పటేల్‌గూడలలో కట్టడాలు నేలమట్టం
8 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో హెచ్‌ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నీటి వనరుల పునరుద్దరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా 12 రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ మహానగరంలో పంజా విసిరింది. అందులో భాగంగానే ఆదివారం మూడు చోట్ల బుల్డోజర్‌లతో విరుచుకుపడింది. కూల్చివేతలపై హైడ్రా అధికారులు వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి, అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు చెప్పారు. కూకట్‌పల్లి, అమీన్‌పూర్, పటేల్‌గూడలలో ప్రాంతాల్లో ఆదివారం పలు కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతల సందర్భంగా సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాలు, కిష్టారెడ్డిపేటలో ఒక ఎకరా, పటేల్ గూడాలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. హైడ్రా, ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. కూకట్‌పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించామని, వాటిని కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా అధికారులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించారన్నారు. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామన్నారు. అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పటేల్‌గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు వివరించారు. రెవెన్యూ, నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సంయుక్తంగా మూడు చోట్ల ఆపరేషన్ చేపట్టామన్నారు. నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడటమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు 26 చోట్ల 306 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసింది. 119 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి విడిపించింది.
