సీతారాం కవిత్వాన్ని ఇష్టంగా చదువుకునేవాళ్లలో నేనొకరిని. 1985లో ముగ్గురిలో ఒకడిగా వేసిన రక్తస్పర్శ నుండి 2008లో ప్రచురించిన కుప్పం కవితలు దాకా సీతారాం కవిత్వాన్ని చదువుకున్నాను. కుప్పం కవితలు తరువాత తానిక కవిత్వం రాయకుండా పూర్తికాలం సామాజిక కార్యకర్తగా మారిపోతాడేమో అనుకున్నాను. “For poetry makes nothing happen: it survives” అన్న W.H. Auden మాట తనకు అర్ధం అయివుంటుంది అనుకున్నాను. Plato లాగా irrational, emotional imitation of reality వద్దు అనుకున్నాడేమో అనుకున్నాను. కానీ “survives” is also a form of expression అని ఆడెన్ లాగే నిర్ధారించుకుని అప్పుడప్పుడు ఒకటి అరా కవితలు ప్రచురించడం చూశాక సీతారాం తన బాధ్యత నుండి పక్కకు తొలగలేదు, తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసే పనినుండి వెనుకకు మరలి ఏ కార్పొరేట్ కవిత్వ మధుశాల కిందా తనను తాను పోగొట్టుకోలేదు అని నిర్ధారించుకున్నాను.
__________________
దాదాపు పదిహేడేళ్ల తరువాత వచ్చిన ‘కనుక’ చదివాక సీతారాం ఏమీ మారలేదు. అదే సమయంలో చాలా మారాడు అని అర్ధం అయింది. తన కవిత్వానికి లోతైన గాఢతను ఇచ్చే వయక్తిక అంతర్ముఖత్వం, మార్మికత, అధివాస్తవికతతోపాటు సామాజిక, పర్యావరణ స్పృహను కూడా తోడుగా తీసుకుని ‘కనుక’ ను తీసుకుని వచ్చాడు.
__________________
కుప్పం కవితలు వచ్చినప్పటి సమాజం ఇప్పుడు లేదు. ‘కుప్పంలో కోతులు’ రాసిన సీతారాం కూడా ఇప్పుడు లేడు. పదిహేడేళ్ల క్రితం ఒక భారతీయ సమాజం ఉండేది. ఇప్పుడది భారతీయ మత సమాజంగా మారిపోయింది. “భారతీయులు”లో పదిహేడేళ్ల క్రితం భారతీయులు ఉండేవారు. ఇప్పుడు హిందువులు, ముస్లిములు, క్రిస్టియనులు అనే విభజన దాకా సమాజం ఎదిగింది.
కనుక సీతారాం లాంటి సున్నితమైన కవి 1947 నాటి చరిత్ర గది తలుపు తెరచి మంటో సకీనా పేరు ఇప్పుడు అసిఫా అని ఎలుగెత్తి మాట బయటకు వినపడకుండా, గుడి గోపురాన్ని ఎక్కి అరచిన రామానుజాచార్యుడిలాగా అరుస్తాడు. తన గొంతు బయటకు వినపడదు, బయటి గొంతు తనకూ వినపడదు కనుక నన్నేదో మ్యూట్ చేసింది. సకల సవ్వడులూ అంతరించాయి, నాలాగే ఈ లోకానికి మౌనం చేసింది అంటారు. మాట రాని మౌనం వేరు. మాటలు కోల్పోయిన మౌనం వేరు. ఈ తేడాలు ఎవరికీ కావాలి కనుక పసిపిల్లకు జబ్బుచేసినట్టు ఈ లోకానికి మౌనం చేసింది అంటారు.
మాట కూడా మాట్లాడలేనంతగా లోకానికి మౌనం ఎందుకుచేసింది? అంటే సీతారాం Language is political అని చెపుతున్నాడు. భాషకూడా రాజకీయం అయిన చోట భాష వెలువరించే భావాలు కూడా ఏదో ఒక వైపు వాలిపోక తప్పదు. అది హింసా, నెత్తురులు పొర్లే భాషగానో, బాంబర్లు బాంబులు విసిరే భాషగానో లేక లేతలేత చేతులతో పిల్లలు చెప్పే బై బై భాషగానో ఎటో ఒక వైపు తన ఉనికిని చాటుకోకుండా మానదు. నువ్వెవరో నేను అడగను అని సీతారాం కవిత్వంలో హామీ ఇస్తున్నాడు కానీ “నువ్వెవరో” సనాతన, అతి సనాతన, పురాతన ధర్మాల సాక్షిగా నిర్వచించుకోకపోతే, మూలాల్ని నిరూపించుకోకపోతే నీకు మాట్లాడటానికి రాజ్యం సమయం ఇవ్వదు. ఆస్కారం కూడా ఇవ్వదు. నీ ఇంట్లో ఒక గదికి నిప్పంటుకున్నా నువ్వు సనాతన ధర్మానువర్తివి అయితే పక్క గదిలో పట్టు పరుపుల మీద పడుకోబెట్టగలదు.
అందుకనే నువ్వెవరో నీకు నువ్వే నిరూపించుకోవడం, సమస్త ఆధారాలు సమర్పించుకోవడం ఇప్పటి అవసరం. ఈ అవసరాన్ని దాటి భాషను ముందుకు దూకించాలని, భాషలో కొంత కరుణ ఉన్నదని మనుషులు తెలుసుకోవాలని సీతారాం ఆశపడతాడు, ఆవేశపడతాడు, ఆందోళనపడతాడు. మొత్తంగా తనను తాను దహించుకుని కొత్త తానుగా నిలబెట్టుకోవాలని తాపత్రయ పడతాడు.
కానీ జరుగుతున్నదేమిటి? పెను రాజకీయ స్థలాలనే తను మోయవలసి వస్తుంది. మోయం అని ఎంత బలంగా, ఎంత గట్టిగా భీష్మించుకు కూర్చున్నా తన ప్రమేయం ఏమీ లేకుండానే ఓట్లాడే సమయం వచ్చేస్తుంది. ప్రజాస్వామ్యం నీళ్ళాడేస్తుంది. దోచుకు తినేవాడో, దాచుకునే వాడో ఎవడో ఒకడు, ఒకడి వెనుకాల ఒకడు, ఒకడి తరువాత ఒకడు పెను రాజకీయ స్థలాలలోకి ఎవరి ప్రమేయం లేకుండానే సకల జనుల పూజాఫలంగా చే చే లు కొట్టుకుంటూ వస్తాడు.
సీతారాం మాత్రం తనకందని బుద్ధుడు, పాపకందిన బుద్ధుడు ఎంత కురచో అంటూ కవిత్వానికి వ్యాసమూ, చుట్టుకొలత కొలుస్తూ వారానికి ఒకసారి కళాశాల దర్శించవలెను, వచ్చిన రోజే రానన్ని రోజుల సంతకాలు పెట్టవలెను అంటూ కవిత్వం రాసుకుంటూ ఉంటాడు.
_________________
భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక ఒక నియోరిచ్ వర్గం హఠాత్తుగా తెరమీదకు వచ్చేసింది. పెట్టుబడి పెట్టకుండా పెట్టుబడితో ఆటలాడటం ఎంత సులువో తెలిసిన ఆ వర్గం సునామీని మించిన వేగంతో ఈ దేశాన్ని చుట్టుముట్టింది. మనుషులను మనుషులుగా కాక బ్రాండెడ్ వస్తువులుగా ఎలా చూడాలో ఆ నియోరిచ్ వర్గం సాధారణ ప్రజానీకానికి ఉదాహరణలతో సహా చూపించింది.
___________________
అప్పటినుండీ మనుషులు బ్రాండెడ్ వస్తువులుగా మారిపోయారు. ఉత్పత్తి వెనుకబడిపోయి, సేవ ముందుకు రావడంతో కొత్త మిలీనియం లేదా జెన్ జడ్ తరానికి.. భూమితోనూ, ప్రకృతితోనూ ఉండవలసిన పేగు బంధం ఏదో తెగిపోయింది.
ఇది ఆకస్మికమేమీ కాదు
కాస్మిక పరిణామాలు ఇలాగే
ఇంతే మహా కథనాలుగా అవతరిస్తాయి
శూత శౌనకాది మహామునులు
ఏ నైమిశారణ్య తరుచ్ఛాయా
ఏ భాగంలోనూ కనిపించదు
అని అడవి, కొరివి కవితలో అంటూనే మార్కెట్ ఒక బిగ్ బ్యాంగ్ అంటున్నాడు. ఆ విస్ఫోటనం దేశానికి ఒక కొత్త భాషను అందించింది. అడవి అంటే అడవి కాదు. అది ఖనిజాల గని అని అర్ధం. గ్రోత్ లేదా అభివృద్ధి అంటే అభివృద్ధి చెందే వేగంలో అభివృద్ధి అని అర్ధం. హ్యూమన్ ఇండెక్స్ కి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు. సెన్సెక్స్ కి తప్ప. అందుకే సగటు సామాన్య మానవుడు కూడా నేనీ హై నేల మీద 150 KMPH తొక్కేస్తాను అంటున్నాడు. కొంచెం పెద్ద మొత్తంలో పెట్టు గురూ! విపరీత అధికారిక లాభంగా వికసించి చూపుతాను. ఈ చిన్న చిన్న వెరీ లిటిల్ లిటిల్ స్మాల్ స్మాల్ ఫుట్ పాత్ వ్యాపారం చేయను గాక చేయను అంటున్నాడు.
చాలా చిన్న చిన్న వాక్యాల్లోనే ఈ దేశపు ప్రకృతి, మానవ ప్రకృతి రెండూ ఎలా పరాధీనం అవుతున్నాయో సీతారాం దృశ్యమానం చేస్తున్నాడు. సీతారాం గత కవిత్వ సంపుటాలకు, ఈ సంపుటానికి నడుమ ఉన్న గుణాత్మకమైన తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ తేడాలేమిటో ఒక పట్టాన పాఠకుడికి అర్ధం కావు. సీతారాం ఆలోచనలు లాగే అవి కూడా ఒకదానిని మరొకటి ఆక్రమించి ఒక కలేజ్ లాగా ఒకదాని మీద ఒకటి అల్లుకుని పాఠకుడిని కన్ఫ్యూజ్ చేస్తాయి.
కుక్క నెపంగా సీతారాం రాసిన బ్లాక్ డాగ్ పద్యాలలో ఈ కన్ఫ్యూజన్ పాఠకుడికి ఎక్కువగా కలుగుతుంది. జంతువులను ప్రతీకలుగా తీసుకుని కవిత్వం రాయడం కొత్తేమీ కాదు. ప్రసాదమూర్తి గోల్డీ శతకం రాసాడు. ఇంకా చాలామంది రాశారు, కానీ అవన్నీ వాళ్ళ వాళ్ళ వయక్తిక అనుబంధాలను, జంతు ప్రేమను తెలియచేసేవి. సీతారాం బ్లాక్ డాగ్ పద్యాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. నల్లకుక్క పిల్లనే ఎందుకు ఎంచుకున్నాడు సీతారాం? ఎర్ర కుక్క పిల్లనో, గోధుమరంగు కుక్క పిల్లనో, లేదా పాల నురుగులా మెరిసిపోయే తెల్ల కుక్క పిల్లనో ఎందుకు ఎంచుకున్నాడు? వీధి కుక్కపిల్లనే ఎందుకు ఎందుకున్నాడు? ఏ పెడ్రోనో,డాబర్ నో,గోల్డెన్ రెట్రీవర్ నో , సైబీరియన్ హస్కీని ఎందుకు ఎంచుకోలేదు? ఈ ప్రశ్నలు నన్ను ఆ బ్లాక్ డాగ్ పద్యాలు చదువుతున్నప్పుడు వేధించాయి.
నిజానికి సీతారాం చెప్పదలుచుకున్నది కుక్కపిల్ల గురించి కాదు. కుక్క పిల్ల నెపంగా ఈ దేశ ముఖచిత్రాన్ని వివరించదలుచుకున్నాడు. నలుపు ఎలా వివక్షకు గురిఅవుతున్నదో చెప్తున్నాడు. రాజకీయ, సామాజిక సందర్భాలలో ఎలా వెలివేయబడుతున్నదో చెపుతున్నాడు. ఒక్కొక్కసారి ఎలా అవిధేయంగా ఉండవచ్చో, ఒక్కొక్కసారి ఎలా పరమ విధేయంగా ఉండవచ్చో చెపుతున్నాడు. ఆ కుక్క పిల్లకి తల్లి తెలీదని చెపుతూ ఈ నూటనలభై కోట్ల జనాభాకి కూడా తల్లి లేదని చెపుతున్నాడు.
కుక్క కనిపించిన ప్రతి మనిషినీ నా తండ్రెవరు తండ్రీ అని అడుగుతున్నాను అని చెప్పడం ద్వారా ప్రతి ఐదేళ్లకు ఈ దేశం తన తండ్రిని కనుగొనడానికి ప్రయాసపడుతున్నది అని చెపుతున్నాడు. దేశంలోని జనం మీద, జనంలో ఇన్ బిల్ట్ గా పాతుకుని పోయిన అవలక్షణాల మీద వ్యంగ్యాన్ని చెర్నాకోలలా విసురుతున్నాడు.
___________________
బ్లాక్ డాగ్ పద్యాలకు భిన్నంగా సీతారాం పాపికొండల ప్రయాణం మీద రాసిన పద్యాలు భలే బావున్నాయి. బ్లాక్ డాగ్ పద్యాలు schizophrenic poems అయితే ఈ పాపికొండల పద్యాలూ Poems of Serenity. చదవడానికి ఎంత ఆహ్లాదంగా వున్నాయి అంటే చెప్పలేనంత.
___________________
“గోదావరి వొడ్డున/కపిల గోవులు/నెమరు వేతల తీపి కబురు/ప్రకృతి ఋణం తీర్చుకుంటూ/ పాలను నదిలోకి చెపుతున్నాయి/లాంచీ మీద క్రూర మానవులు/ పాపికొండల దగ్గర/మెత్తటి ఇసుక మేడలని /తరలించటమెట్లా?” అనే మాటలు ఇలాంటి పద్యానికి వ్యాఖ్యానమెందుకు? హృదయం లోపలకి నేరుగా చొచ్చుకుని పోతుంటే.
ఈ వ్యాసం రాయడానికి ముందు సీతారాం కవిత్వం గురించి వివరించు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘గ్రోక్’ కి ఒక ప్రశ్న ఇస్తే అది జవాబు ఇస్తూ.. “మోహన ప్రసాద్ ప్రభావం సీతారాం కవిత్వం మీద వున్నది” అని జవాబిచ్చింది. నేను గ్రోక్ ను కాదు కనుక సీతారాం గత లేదా అంతకు ముందు, ముందు జన్మలలో ఏ కణ్వమహర్షి గానో, లేదా ఆశ్రమంలోనో పుట్టి ఉంటాడు అనుకుంటాను. లేకపోతే తనచుట్టూ ఉన్న ప్రపంచం మీద ఇంత కరుణ ఎందుకు? ఇంత ప్రేమ ఎందుకు? ఇంత వాత్సల్యం ఎందుకు? ఇంత కరుణ, ఇంత ప్రేమ, ఇంత వాత్సల్యం లేకపోతే పుట్ల కొద్దీ పండిన ధాన్యపు కుప్పలను, వెన్నెల్లో బంగారు రాశులుగా పోసినప్పుడు ఆ రైతు గింజల మీద ఎందరి పేరులో రాయడం..ఈ కనులతోనే కొలిచాను అనటం సాధ్యపడుతుందా? బిలాల్ సార్ ను చరిత్ర రాజనీతి గొంతు విప్పమని అడగగలడా? అడుగొక కులమానం అనగలడా ?
ఇదుగో ఈ కరుణే సీతారాంని తన తరం కవులనుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నది.
‘మో’యం లాగా సీతారాం రాయని పోయెమ్ సీయం వుండకూడదు అనుకున్నాడేమో ఈ ‘కనుక’ ని నూటా యాభయ్ పద్యాలతో నింపేసాడు. అవటానికి అవి నూటా యాభయ్ పద్యాలే కానీ, కేవల మాత్రపు పద్యాలు కావు. మానవ అస్తిత్వంలోని సంవేదనలను, సంక్లిష్టతలను ఆవిష్కరించడానికి పడే పురిటి నొప్పులు.
-మేఘన అధరాపురపు
