మహిళల టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్‌పై భారత్ విజయం

క్రీడలు

దుబాయి: యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్..

ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (32; 35 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (29* రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించారు. పాక్‌ బౌలర్లలో ఫాతిమా రెండు, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భారత్‌ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్‌ 9న) శ్రీలంకతో తలపడనుంది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. సాదియా వేసిన ఐదో ఓవర్‌లో స్మృతి మంధాన (7) వెనుదిరిగింది. అప్పటికి భారత్ స్కోరు 18. తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నిలకడగా ఆడుతున్న షెఫాలీని ఒమైమా వెనక్కి పంపింది. అనంతరం హర్మన్‌ప్రీత్, జెమీమా సింగిల్స్‌ రాబడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో 15 ఓవర్లకు జట్టు 79/2 స్కోరుతో నిలిచింది. అయితే, తర్వాతి ఓవర్‌లో జెమీమా, రిచా ఘోష్ (0)ను ఫాతిమా వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ, హర్మన్‌, దీప్తి శర్మ (7) ఒత్తిడికి గురికాకుండా నిలకడగా ఆడి 18 ఓవర్లకు స్కోరు 100 దాటించారు. 19 ఓవర్‌లో నాలుగో బంతికి షాట్ ఆడే క్రమంలో హర్మన్‌ప్రీత్‌ మెడ పట్టేసింది. దీంతో ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. తర్వాత వచ్చిన సంజనా (4) ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత బౌలర్లు స్కోరుకే కట్టడి చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిదా దర్‌ (28) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్ మునీబా అలీ (17), ఫాతిమా సనా (13), తొమ్మిదో స్థానంలో వచ్చిన అరూబ్ షా (14*) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి గుల్‌ ఫెరోజా డకౌట్‌గా వెనుదిరగ్గా.. సిద్రా అమీన్‌ (8), ఒమైమా (3), ఆలియా (4)ను సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయంకా పాటిల్ (2/6), అరుంధతి రెడ్డి (3/19) అదరగొట్టారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్ పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *