నిర్ధిష్టమైన ఆలోచనలకు మహత్తరమైన నైతిక విలువలతో కూడిన ఆశయాలను జోడించి వాడుక భాషా పదాలతో అద్వితీయమైన ప్రతిజ్ఞ రచించి భారతదేశ వారసత్వ సంపదగా తరతరాలకు వరంలా ప్రసాదించిన ఘనత ‘పైడిమర్రి వెంకట సుబ్బారావు’ కు చెందుతుంది.
నల్గొండకు చెందిన ప్రముఖ రచయిత పరిశోధకుడు ఎలికట్టె శంకరరావు నల్గొండ జిల్లా కథలు పుస్తకం రాస్తున్నప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు మొదటిసారిగా వెలుగులోకి తెచ్చారు. శంకరరావే కనుక పైడిమర్రి పేరును వెలుగులోకి తీసుకురాకపోయి ఉన్నట్లయితే ఈనాటి వరకు ‘ప్రతిజ్ఞ’ ఎవరు రాశారో ప్రపంచానికి తెలిసేది కాదు. నిజానికి ఎలికట్టె శంకరరావు భారతీయులందరికీ ప్రాతఃస్మరణీయుడు అనటంలో అతిశయోక్తి లేదు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు ఎక్కడివాడు, ఎవరతను..అనే సందేహం ఇప్పటికే మన మెదళ్ళను తొలిచేస్తుంది కదూ! నిత్యం కోట్లాదిమంది విద్యార్థుల గొంతులలో ప్రతిధ్వనించే “భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు” అంటూ జాతీయ ప్రతిజ్ఞను రచించింది ఈయనే. నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. ప్రతి మనిషి జీవితంలో ఒక సంఘటన అతని గమనాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
_______________
ధృఢత్వం మనిషి సంకల్ప బద్ధుడవటానికి కర్మశీలుడు అవటాన్ని నేర్పుతుంది. ఏ పని చేసేటప్పుడైనా ధృఢ సంకల్పంతో చేస్తే మనిషి ప్రపంచంలో గౌరవాన్ని పొందుతాడు. కష్టాలను అధిగమించి తన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగల్గుతాడు. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఆశయాలు అనంతమైనవి. పని ఎంత మంచిదైతే అంత కష్టం ఉంటుంది. కావున సాధ్యమైన మంచి పనులన్నీ ధృఢ, స్థిర మనస్సే చేయగలదు. అటువంటి దృఢ నిర్ణయాలు స్థిరమైన మనస్సు కలవారు కాబట్టే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ‘ప్రతిజ్ఞ’ రాయగలిగారు. ఇది రాయడానికి 1962లో జరిగిన చైనా యుద్ధం ప్రేరణ.
_________________
1960వ దశకం మొదట్లోనే మనం చైనాతో యుద్ధం చేయాల్సివచ్చింది. ఆ యుద్ధం దేశంపై పెను ప్రభావాన్నే చూపింది. పంచశీల సూత్రాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనాతో ‘హిందూ చీనీ భాయి భాయి’ అంటూ స్నేహ హస్తం చాచినా అది చేసిన నమ్మక ద్రోహం భారతీయులను కలచివేసింది. చైనా దురాక్రమణ పైడిమర్రిని కూడా కుంగదీసింది. టిబెట్ ప్రాంతం, ఆక్సాయ్ చిన్ ప్రాంత వివాదం వల్ల రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం సన్నగిల్లింది. ఓ వైపు చైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తున్నా.. వాటిని భారతీయ పరిపాలకులు గుర్తించలేకపోయారు. 20-10-1962న ప్రారంభమైన చైనా యుద్ధం 21-11-1962 వరకు కొనసాగింది. యుద్ధం ముందు మరియు తర్వాత పరిస్థితులను పైడిమర్రి లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిణామాలు పైడిమర్రి లాంటి దేశభక్తులను ఆలోచింపజేశాయి. భారతీయులలో ఆత్మస్థైర్యం నింపడానికి తన వంతుగా ఏదో చేయాలన్న తపన పైడిమర్రిని కార్యోన్ముఖుడిని చేసింది.
యుద్ధానంతరం చైనా ప్రభుత్వం తమ దేశ పాఠశాలల్లోని విద్యార్థులకు దేశభక్తి భావనను పెంచి సైన్యంలోకి చేరే విధంగా కొన్ని దేశభక్తి గేయాలను ప్రాథమిక స్థాయి నుంచే నేర్పించసాగింది. అప్పటికే పలు భాషలలో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం భారతదేశంలో కూడ ఉన్నత ఆశయాలతో భారతజాతి గొప్పదనాన్ని శాశ్వతంగా ఉండే సూచనలతో భావిభారత పౌరులకు మార్గ నిర్దేశం చేసే విధంగా దేశ భక్తిని పెంపొందించే గేయాలుంటే బాగుంటుందని తద్వారా విద్యార్థులలో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించవచ్చని భావించారు. అప్పటికే పలు రచనలు చేసిన అనుభవంతో తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటం ప్రారంభించారు పైడిమర్రి.
అలా వారి ఆలోచనల అక్షర రూపమే ‘ప్రతిజ్ఞ’. ఒక గౌరవం, బాధ్యత, సోదరభావం, దేశభక్తి, వారసత్వం,వినయం, ప్రజాక్షేమం, సేవానిరతి, సామాజిక శ్రేయస్సు వంటి నవరత్నాల్లాంటి భావాలతో దేశభక్తి కాంక్షను రగిలించే తొమ్మిది వాక్యాల ప్రతిజ్ఞ విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి వేదిక అయ్యింది.
దేశం పట్ల పౌరుల విధులను, ఉన్నత ఆశయాలను ఎంతో ముందు చూపుతో భావి తరాల వారికి వారసత్వ సంపదగా ఈ ‘ప్రతిజ్ఞ’ను రచించారు పైడిమర్రి. దేశభక్తిని ప్రతి ఒక్కరిలో చాటే ఈ ప్రతిజ్ఞలో నిర్దిష్టమైన భావపరంపర ప్రతి భారతీయునిలో జాతీయ సమైక్యతను, సమగ్రతను పెంపొందించేటట్లు రూపొందించబడింది. భారతీయతను ఎల్లడెలా చాటుతుంది. ప్రతిజ్ఞలోని పదాలు విద్యార్థులు ఉచ్చరించేటప్పుడు క్రమశిక్షణతో గుండెల నిండా దేశభక్తి భావాలు నింపుకొని దేశమాత సేవలో నేను కూడా అంటూ హుందాగా ముందుకు సాగుతున్నట్లుగా ఉంటుంది.
తన హితం కంటే సాంఘిక హితమును ఎక్కువగా తలంచుటయే పౌరధర్మము. పౌర జీవితమునకు వ్యక్తిత్వము మూలాధారము. సామాజిక జీవనానికి, సంస్కృతికి కూడా వ్యక్తిత్వము కేంద్రం వంటిది. అట్టి వ్యక్తిత్వాన్ని బాల్యం నుంచి మంచి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేదే ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ పఠనం మీదే మానవుల ఉన్నతి, విశిష్ఠత ఆధారపడి ఉంది. నెల్లూరు, నిజామాబాద్ ప్రాంతాలకు బదిలీ అయినపుడు ఆయా ప్రాంతాలలోని విద్యార్ధులతో ప్రతిజ్ఞను ఆలపింపజేసేవారు పైడిమర్రి.
1962వ సంవత్సరంలో ప్రతిజ్ఞ రచించగా పాఠ్యపుస్తకాల్లో 1963 నుంచి ప్రచురిస్తున్నప్పటికీ రచయిత పేరు మాత్రం ఉండటం లేదు. 2015 వరకు ఈ పరిస్థితి నెలకొంది. అనేక మంది అభ్యుదయ వాదులు, స్వచ్ఛంద సంస్థలు, రచయితలు పైడిమర్రి పేరును వెలుగులోకి తెచ్చిన ఎలికట్టె శంకరరావు తీవ్ర కృషి ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ‘ప్రతిజ్ఞ’ వద్ద రచయిత పేరు ముద్రించడం ప్రారంభం అయింది. దీంతో అప్పటి వరకు మనకు తెలియని ఒక మహా పురుషుని గురించి తెలియడం మొదలయ్యింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పైడిమర్రి గురించి ఒక పేజీ కేటాయించి రచయితకు ప్రాముఖ్యత ఇచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ తిరువూరు విచ్చేసిన సందర్భంగా ఈ వ్యాస రచయిత రఘునందన్.. ఆయనను కలిసి తెలంగాణ రాష్ట్ర పాఠ్య పుస్తకంలో లాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం గురించి వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు 2020-21 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ‘మన మహనీయులు’ పేరిట పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ స్ఫూర్తితో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పైడిమర్రి వెంకట సుబ్బారావు విగ్రహాన్ని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లేల గ్రామంలో పైడిమర్రి కుటుంబ సభ్యులతో ఆవిష్కరించడం జరిగింది.
ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భారతీయ తంతి తపాలా శాఖ విజయవాడ రీజియన్ వారిని సంప్రదించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పైడిమర్రి ముఖచిత్రంతో ప్రత్యేక కవరును 2022 అక్టోబర్ నెలలో విడుదల చేయించడం జరిగింది. పైడిమర్రి వెంకట సుబ్బారావు అనేక కథలు, వ్యాసాలు, అనువాదాలు, నాటికలు, నవలలు రాశారు. ఆనాటి ప్రముఖ పత్రికలైన పల్లెటూరు, ప్రకృతి, ఆంధ్ర పత్రిక, ఆనందవాణి, భారతి, సుజాత వంటి వాటిల్లో అవి ప్రచురించబడ్డాయి.
__________________
వారి రచనలన్నీ ఒక ఎత్తయితే మన దేశ ప్రాభవాన్ని నలుచెరగులా నింపి, దేశం గర్వించేలా “భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు” అంటూ వారు రచించిన జాతీయ ‘ప్రతిజ్ఞ’ దేశ చరిత్రలో అగ్రస్థానంలో నిలుస్తుంది.
___________________
ముందు తెలుగులో రాయబడి అటుపిమ్మట అన్ని భారతీయ భాషలలోకి తర్జుమా చేయబడి ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాల్లో ప్రచురింపబడుతూ ఉండడం తెలుగు వారిగా మనకందరికీ గర్వకారణం. ప్రతిజ్ఞ రూపకర్తగా నిత్యం కోట్లాదిమంది భారతీయుల హృదయాలలో ఆచంద్రతారార్కం నిలిచిపోయిన పైడిమర్రి వెంకట సుబ్బారావు అనారోగ్య కారణంగా 1988 ఆగస్టు 13న మరణించారు.
( జూన్ 10, ‘ప్రతిజ్ఞ’ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు 110వ జయంతి సందర్భంగా)

-రేపాక రఘునందన్
94408 48924
