మనం ఏ పని చేయటానికికైనా స్ఫూర్తి అవసరం.స్ఫూర్తి అంటే ఒక ఉత్సాహం.ఒక ఆవేశం. ఓ ఊహ. ఒక చోదకశక్తి.ఇది మనలో ఉత్తేజాన్ని నింపి ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టేటట్టు చేస్తుంది. సాహితీ సృజనకూ స్ఫూర్తి అవసరం. ఆ ఆలోచన రాగానే
అది ఎక్కడ నుండి వస్తుంది,ఏ రూపంలో ఉంటుంది అన్న ప్రశ్నలు లేదా అనుమానాలు మన మనసులో ఉదయిస్తాయి.అది ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుందని కచ్చితంగా చెప్పటం అసాధ్యం.ఏదైనా ఒకనిర్వచనంలో పొదగటమూసాధ్యంకాదు.ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైనా,ఎవరైనా కూడారచయితలకుస్ఫూర్తి
కావచ్చు.ఈ అవని మీద ఉండే చరాచారాలు,ఆకాశం
సూర్య చంద్రాదులు, నక్షత్రాలు.వీటిని చూసినపుడు కవులలో ఏదో తెలియని భావేశం కలుగుతుంది.అది చక్కని ఊహకు, సాహిత్యసృష్టికి దారి తీస్తుంది.
ప్రకృతిలోని సుందర, మనోహర దృశ్యాలు ఎంతగా ప్రేరణ నిస్తాయో,అంతే విధంగా భయానక, బీభత్స
దృశ్యాలూ..అవి మనలో అనుభూతులుగా
మిగిలిపోతాయి.అవి ఆలోచనలై, భావాకృతిని తీసుకుంటాయి.ఆ భావాలు భాషను వెతుక్కుని, అవి
అక్షరరూపం దాల్చినపుడు వచ్చే సాహిత్యంలో ఎంతో బేధం ఉంటుంది. వైవిధ్యం ఉంటుంది.అనుభూతులు
సాహిత్య సృష్టికి దారి తీస్తాయి.అయితే అనుభూతి పొందిన వారందరూ సృజన శీలురవుతారా? కారు, కాలేరు? ఎందుకని?
ఒక సెలయేరు ముందు కొందరు నించున్నారనుకోండి.
అనేక జతల కళ్ళు చూస్తున్న దృశ్యం ఒకటే…సెలయేరే.
అయినా అది ఎన్నెన్నో రకరకాల అనుభూతులు
వీక్షకుల మదిలో కలగచేస్తుంది.అది కొందరికి ఉత్త
నీటి ప్రవాహమే.కాని మరికొందరికి అది ప్రవహిస్తూ చేసే గలగలలు, దానితోపాటు లాక్కు వెళ్లే గులకరాళ్ళ శబ్దాలు,ఆ ప్రవహించే నీటి మీద పడే సూర్యకిరణాలకు ఏర్పడే తళతళలు అద్భుతంగా తోస్తాయి.అలా ఆ
దృశ్యం ఒక వింత అనుభూతిని కలుగచేస్తుంది.ఈ అనుభూతిని చాలామంది పొందినా, కొందరు మాత్రమే దానికి అక్షర రూపమివ్వగలరు.అదే సృజనాత్మక శక్తి. వారే తమ అనుభూతులకు మాటల ఉడుపులనిచ్చి
ఒక పాటగానో,పద్యంగానో, కావ్యంగానో, కథ గానో చెప్పగలరు.ఈ శక్తి అందరికీ ఉండదు. అది కొందరికి పుట్టుకతో వస్తే, కొందరు మనసుపెట్టి కృషితో,
పట్టుదలతో ఆ రచనాశ క్తిని పొందుతారు .ఇలా రెండు
విధాలుగా కవులై ఎన్నో శ్రేష్ఠమైన కావ్యాలను అందించి విఖ్యాతులైన వారు అనేకమంది.
వర్డ్స్ వర్త్ అనే గొప్ప ఆంగ్ల భావకవి, ప్రకృతి ఆరాధకుడు కవిని, ఎలా నిర్వచించాడో చూడండి.
“”The poet’s role, according to Wordsworth, is to be a “man speaking to men” and to connect with the common experiences and emotions shared by all humanity. “
అందుకే ఆ సృజనశీలురలకు, వారి అద్భుత సృష్టికి
మహారాజులు,చక్రవర్తులు సైతం అంతటి హోదాని, గౌరవాన్నిచ్చింది. సిరి, సంపదలనిచ్చి తమ అస్థానాలలో కవులను పోషించారు.వారి కవితా ధారకు తన్మయులయ్యేవారు కవితా గోష్టులులో పాల్గొనటం తమ భాగ్యంగా
భావించేవారు.అందుకు కదా ఘనసన్మానాలు,
గండపెండేరాలు.ప్రజలు వారిని ఆరాధించింది ఆ కవితా గానానికి, అ అద్భుత సృజనాత్మక శక్తికే కదూ!
తన అసాధారణ ప్రతిభావ్యుత్పత్తులతో, భాషా సాధికారతతో గొప్ప కవిగా భాసిల్లిన కవిభాస్కరుడు
శ్రీ శ్రీ కవిత ‘ ఋక్కులు ‘ఈ వ్యాసానికి అద్భుత ముక్తాయింపు అన్న భావనతో దాన్ని ఉదహరిస్తున్నాను.
కుక్కపిల్లా ,
ఆగ్గిపుల్లా,
సబ్బుబిళ్లా —
హీనంగా చుడకుదేన్ని:
కవితామయమేనోయ్ అన్నీ :
రొట్టెముక్కా ,
ఆరటితొక్కా ,
బల్లచెక్కా —
నీ వైపే చూస్తూ ఉంటాయ్:
తమ లోతు కనుక్కోమంటాయ్:
తలుపుగొళ్లెం,
హారతి పళ్లెం ,
గుర్రపు కళ్లెం…
కాదేది కవిత కనర్హం:
ఔనౌను శిల్ప మనర్ఘం :
ఉండాలోయ్ కవితావేశం:
కానీవోయ్ రస నిర్ధేశం :
దొరకదటోయ్ శోభాలేశం:
కళ్ళంటూ ఉంటే చూసి ,
వాక్కుంటే వ్రాసి :ప్రపంచమొక పద్మవ్యుహం:
కవిత్వ మొక తీరని దాహం:
– బొడ్డపాటి చంద్రశేఖర్
అంగ్లోపన్యాసకులు