మేడిగడ్డ కుంగింది మీ వల్లే

తెలంగాణ

రీ డిజైనింగ్‌, రీ ఇంజినీరింగ్‌ నిర్వాకం ముమ్మాటికీ కేసీఆర్‌ దే
మెడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది
దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌ : నీటి పారుదల శాఖలో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది ముమ్మాటికీ రీ-డిజైనింగ్‌, రీ-ఇంజినీరింగ్‌తోటేనని, దీనికి మాజీ సిఎం కెసిఆరే బాధ్యుడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన ఘనత పదేళ్ళు అధికారం వెలగ బెట్టిన బిఆర్‌యస్ ప్రభుత్వానికి,మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ కూలిందీ..అంతటి నిర్వాకం జరిగింది కెసిఆర్‌తోటే అయినప్పటికీ ..ఆ వాస్తావాలను వక్రీకరించడం కెసిఆర్‌కు, మాజీ మంత్రి కెటిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. అందులో భాగమే కెటిఆర్‌ వ్యాఖ్యలు అని, ఇప్పటికైనా గోబెల్స్​‍ ప్రచారం ఆపాలని కెటిఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆయన హితవుపలికారు. మేడిగడ్డ బ్యారెజ్‌ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టె ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి సిఎం కెసిఆర్‌ స్వయంగా డిజైన్‌ చేసింది అంటూ గులాబీ దండు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ గుర్తుచేశారు.
మేడిగడ్డకు ఎందుకు నీళ్లు పంపింగ్‌ చెయ్యడం లేదంటూ మాజీ మంత్రి కెటిఆర్‌ మీడియాతో మాట్లాడిన అంశంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం నాడిక్కడ స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో ఉన్నది మీరే అయినప్పుడు ఆ నెపం మరొకరి మీదకు నెట్టడం సరికాదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిన 47 రోజల తర్వాత తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ గుర్తు చేశారు. కూలిన తర్వాత ఆ 47 రోజులు అధికారంలో ఉన్న మీరు ఏమీ చేశారని ఉత్తమ్‌ సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం కు మేడిగడ్డ గుండె కాయ అని ప్రగల్బాలు పలికింది మీరే అని అటువంటి మేడిగడ్డ కుంగినప్పుడు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మేడిగడ్డలో సుమారు 94 వేల కోట్లు ప్రజాధనాన్ని వినియోగించి 93 వేల ఎకరాలను కుడా సేద్యం లోకి తీసుకు రాకపోవడం మీరు చెప్పిన రీ-డిజైనింగ్‌, రీ-ఇంజినీరింగ్‌ గొప్పతనమా అని ఆయన ఎత్తి పొడిచారు. బ్యారేజ్‌ల నిర్మాణం సమయంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యూసి ) అనుమతి ఎందుకు తీసుకోలేదో బిఆర్‌ఎస్ నేతలు వివరించాలన్నారు.
జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ (ఎన్‌డిఎస్ఏ) దేశంలోనే అత్యున్నత సభ అయిన పార్లమెంట్‌లో తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏర్పడిందన్నారు. దేశంలోని డ్యామ్‌ లను బ్యారేజ్‌ ల నైపుణ్యాలను ఈ సంస్థ లోని నిపుణులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. యావత్‌ భారత దేశంలోనే పేరొందిన నిపుణులు అందులో ప్రతినిధులుగా ఉంటారని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. అటువంటి నిపుణులు సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలో గేట్లు తెరచి పెట్టడం జరిగిందన్నారు. అటువంటి నిపుణులతో రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఎన్‌డిఎస్ఎ ను కెటిఆర్‌ అవమానకరంగా మాట్లాడం ఆయనకే చెల్లిందన్నారు. తాము అధికారంలోకి రాక ముందే కుంగుబాటుకు పూర్‌ డిజైనింగ్‌, పూర్‌ కన్‌స్ట్ట్రక్షన్‌ ,పూర్‌ ఆపరేషన్‌ మెయింటేనెన్స్​‍ అంటూ ఎన్‌డిఎస్ఎ ఇచ్చిన నివేదికను మరచి పోయారా? అంటూ ఆయన నిలదీశారు. మెడిగడ్డ కు నీళ్లు పంపింగ్‌ చేసిన పక్షంలో జరగ బోయే ప్రమాదం తలుచుకుంటేనే ఓళ్లు గగుర్పాటుకు గురి చేస్తుందన్నారు. జరగ బోయే ఆస్తి నష్టం,ప్రాణ నష్టం అంతా ఇంతా అని చెప్పలేమన్నారు. నిజంగా ఎన్‌డిఎస్ఎ సూచనలను కాదని రీ-డిజైనింగ్‌, రీ-ఇంజినీరింగ్‌ సృష్టికర్తలు చెప్పినట్లు చేస్తే ఇప్పటికే పూర్తి అయిన సమ్మక్క-సారక్క
ప్రాంతం కొట్టుకు పోవడం తో పాటు సీతారామ ప్రాజెక్ట్‍ డ్యామేజ్‌ అవుతుందన్నారు. అంతటితో ఆగకుండా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలం పట్టణంతో పాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు.ఈ ప్రభుత్వానికి ఎటువంటి దురాలోచాన లేదని ఉన్నదల్లా దూరాలోచననే ఆయన పేర్కొన్నారు. ఉంటే గింటే ఆ దురుద్ధేశాలు ఏఓ మీకు ఉన్నందునే నిపుణులు చెప్పిన విషయాన్ని తోసిరాజాని పంపింగ్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు స్పష్టం అవుతుందని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళలను ఏ విదంగా వినియోగం లోకి తేవాలి అన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్‌ సంకల్పం అన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణా ప్రజల సొత్తు అని ఆ ప్రజలను తాకట్టు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్ట్‍ లని కాపాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నాన్‌ బ్యాంకింగ్‌ కార్పోరేషన్‌ల నుండి అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపిన చరిత్ర మీదన్నారు. పూర్తి స్థాయి లో ప్రాజెక్ట్‍ నిర్మాణం పూర్తి అయితే అసలు వడ్డీ కలిపి చెల్లించాల్సింది రూ. 25,000 వేల కోట్లు కాగా ఇప్పటికే రూ. 15,000 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కుడా ఇంతటి అధిక వడ్డీలకు అప్పులు చేసిన సందర్భం లేదన్నారు. ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. మీ లాగా అబద్దాలు ఆడడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించడం మాకు చేత కాదని ఆయన కెటిఆర్‌ను ఎత్తి పొడిచారు. అటువంటి అబద్దాలతోటే కదా రూ. 38,000 కోట్లతో పూర్తి అయ్యే డాక్టర్‌ బి ఆర్‌ అంబెడ్కర్‌ ప్రాణహిత – చేవెళ్ల ను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. అదే పూర్తి అయి ఉండి ఉంటే ఇప్పటికే 16.4 లక్షల ఎకరాల నుండి 18.25 లక్షల ఎకరాల వరకు సేద్యం లోకి వచ్చి ఉండేదన్నారు విద్యుత్‌ బిల్లుల కోసం పెండింగ్‌ నిలుపుదల అంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు .మీరు చేసిన రీ-డిజైనింగ్‌, రీ-ఇంజినీరింగ్‌ తోటి పదివేల కోట్ల విద్యుత్‌ బిల్లులు అదనపు భారంగా పరణమించాయి అని మాత్రమే తాము చెప్పిందన్నారు.అదే చేవెళ్ల-ప్రాణహిత పూర్తి అయి ఉంటే కేవలం 1000 కోట్ల విద్యుత్‌ ఖర్చుతో బయట పడే వాళ్లం కదా అని ఆయన పేర్కొన్నారు. తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్‌ నిర్మాణం వద్దు అని సిడబ్ల్యూ సి చెప్పునట్లు బిఆర్‌యస్ చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు.