మనిషికి కొన్నిసార్లు ఉన్నట్టుండి భలే సంతోషంగా అనిపిస్తుంది.అంటే అది తనకి ఇష్టమైన పని ఏదో చేసినప్పుడో, ఇష్టమైన పుస్తకమేదో చదివినప్పుడో కలిగే అలౌకిక ఆనందమది. అలాంటి అలౌకిక ఆనందం నాకు గూండ్ల వెంకటనారాయణ కవితా సంపుటి “ఇయ్యాల ఊళ్ళో” చదివాక అవగతమైంది.
_________
కొన్ని విషయాలు చెబుతూ, కొన్నిటి అర్థాలు తెలియజేస్తూ, కొన్ని భావాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ చాలామంది కవితలు రాస్తారు. కానీ కవి గూండ్లవెంకట నారాయణ కవితా సంపుటి ‘ఇయ్యాల ఊళ్ళో’ చదివినప్పుడు వర్తమాన కవితా రూపానికి ఇది ఆధారభూతంగా తోస్తుంది.ఈ కవితావాక్యాల నిండా పల్లెతనాల ఘుమఘుమలు, స్వచ్ఛమైన మట్టివాసనలు సుతిమెత్తగా తాకి మనసుని తడిపేస్తాయి.ఈ కవితా సంపుటిలోని కవి స్వంతం చేసుకున్న పల్లెవాడల్లోని వాడుక పదాలు.. పాఠకులను కదిలించి,ఏదో ఒక సందర్భం, గత జీవిత అనుభవం గుర్తొచ్చి, పెదాలపై చిన్ని చిరునవ్వు మెదిలి, కళ్ళల్లో తెలియని ఆశృజల నెమ్మదిగా చెంపలపై జారుతుంది..!
__________
‘ఇయ్యాల ఊళ్ళో’ (పే.13) అంటూ ఈ సంపుటిలోని మొదటి కవితలో: “గుడిసె చూరులకి వేలాడుతున్న ఎండ”… అంటూ సూర్యుణ్ణి తన గుడిసెకి వేలాడదీశాడు. నిజంగా ఇది ఓ కొత్త ప్రయోగం.ఇలాంటివి ఈ సంపుటిలోని ప్రతి కవితలో కనిపిస్తాయి. ప్రతి కవితలో ఇలాంటి విసువలైజ్డ్ వాక్యాలు తటస్థపడతాయి.ఇదే కవితలో “గాలిని మేస్తూ మబ్బుల పరుగు/రెక్కలతో ఎండని విసురుతూ/ పచ్చుల పయనం” అంటూ ఒక దృశ్యావిష్కరణ చేస్తాడు కవి. మరోచోట “పగలంతా గోళీలాటలో కాలానికి దుమ్ము పూసి, మట్టి పులుముకొని వెళ్లి ఇంటిముందు వాలగానే అమ్మ చివాట్లు” అంటాడు. ‘చివరికి మిగిలేది’ నవలలో బుచ్చిబాబు సూర్యుడిని వర్ణించినట్లుగా ఈ కవి కూడా సూర్యుడిని వర్ణించిన తీరు అబ్బురమనిపించింది.”నెత్తిన సూర్యుడు కుంకుమ చల్లుకున్న పుల్లెద్దులాగా గుడిసెనకమాల కొట్టంలోకి చొరబడుతూ కనిపిస్తాడు” అంటాడు. చంద్రుడు వాళ్ళ ఊరి కొండైన “ఎడ్డకొండ ఎనకమాల తొంగిచూస్తున్న పున్నమినాటి జీరంగిగుడ్డు” ఇతనికి. “ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల గచ్చకాయలా ఉంది” అని ‘ఇయ్యాల ఊళ్ళో’ కవితను ముగిస్తాడు కవి. ఇది అసలైన పల్లె కవిత్వంగా ఇక్కడే మనకి తెలిసిపోతుంది. ఈ కాలం వాళ్ళకి జీరంగి అంటే తెలీదు. గచ్చకాయ అంటే అసలే తెలీదు. పల్లెల్లోని చిన్నచిన్న వాడుక పదాలను కూడా వదలకుండా కవితా వాక్యాలుగా మలిచి,ఆ పల్లె పదాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడా ఈ కవి అని అనిపించక మానదు. మళ్ళీ ఆనాటి జీరంగి గుడ్లు, అగ్గిపెట్టె అనుభవాలను, గచ్చకాయలను గుర్తు చేస్తాడు.
మనం దేనినైనా నీళ్లలో ముంచడం చూశాం లేదా నూనెలో, రంగుల్లో, రసాయనంలో ముంచడం చూసుంటాము. కానీ ఈ కవి కోణం మాత్రం పూర్తిగా భిన్నమైనది. ‘అమ్మింకా ఇంటికి రాలేదు’ (పే.17) కవితలో ఏమంటాడో చూడండి. “ఒకసారి నల్లపిల్లిని సూసా, అచ్చం సీకట్లో ముంచి తీసినట్టే ఉంది” అంటాడు. చీకటిని ఈ కోణంలో వర్ణించిన వ్యక్తులు అరుదు. ఈ సంపుటిలో చీకటి గురించిన వర్ణన,పోలిక అనేకసార్లు వస్తుంది. అయితే ఇవి ఒక్కోసారి ఒక్కోరకంగా అభివ్యక్తం చేయడం అబ్బురపరుస్తాయి. ఇదే కవితలో “ఒక్కనాడన్నా ఇంటికాడ ఉండదెందుకో మమ్మ?/ ఎప్పుడన్నా పండగైతేనే ఉంటది/ అమ్మింట్లో ఉంటే ఎందుకో ఇళ్లంతా పచ్చగుంటది” అన్నప్పుడు చిన్నప్పుడు మనకు కూడా అమ్మ ఇంట్లో ఉండటం అంటేనే ఇష్టమని గుర్తుకు వస్తుంది. పనికి ఎందుకు పోతుందో కూడా తెలియని బేల బాల్యమది.
‘చేల బాట’ (పే.26)కవితలో : “కంపకాయల చెవి కమ్మలతో కొంచెం వయ్యారంగా/ ముందుకు వాలి, నిల్చున్న ముళ్ళ చెట్టు కనిపిస్తుంది/ దాన్ని తాకుతూ వెళ్తున్న బాటే మా చేలకెళ్లే బాట/ ఎక్కడన్నా ఏదన్నా ఎండిపోయిన ముళ్ళు కసుక్కున/ నీటిలోకి రాయి మునిగినంత తేలిగ్గా/ అరికాల్లోకి దిగబడవచ్చు” అంటాడు. మనిషి బ్రతుకు బాట గురించి ఎగుడు దిగుడుల సామాన్యుని జీవన విధానం గురించి తెలిపే కవిత ఇది.
ఇదే కవితలో “పొలం కాపలా కాస్తున్న ఉత్తితీతి పిట్ట/ మిమ్మల్ని దొంగలా అంచనా కట్టి గోలగోల చేసి/ చేలనిండా చాటింపు వేస్తుంది./ దానిక్కాస్త నోరు పెద్ద అంతే” నిజంగా ఎపుడు కూడా ఇలా భిన్నదృష్టితో కవి ఆలోచించాలేమో. కవి ఒక్కో కవితలో ఒక్కోలా తన దృక్కులను సారించడం స్పష్టంగా తెలుస్తుంది. పొలమే మనుషుల కోసం కాపలా కాస్తున్నట్లు వర్ణించడం చూస్తే ఈ కవి మాటల యంత్రంలా కనిపిస్తాడు.
పల్లెలో వాన.. ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆనందం. వర్షం వచ్చి నేలను ముద్దాడిన తరువాత వచ్చే మట్టివాసన ఏ సుగంధ ద్రవ్యాలు కూడా దాని ముందు దిగదుడుపే అనిపిస్తుంది.ఆ పల్లె వాన వాసన ఎలా ఉంటుందో ‘పల్లెవాన’ కవిత(పే.29)లో ఈ కవి ఎలా వర్ణిస్తాడో చూడండి:”వాన కురవగానే మా ఊరంతా ముత్యం పువ్వులా విచ్చుకుంటుంది/ పిల్లలు నీటి బొట్లయ్యి బుడుక్కుబుడుక్కున మడుగుల్లో మునకలేస్తారు/ ఎర్రల్ని పట్టి అరచేతుల్లో పెట్టుకొని గోరింటాకులు దిద్దుకుంటారు/చెట్లు వాన చుక్కల్ని విరిసి దారుల్లో వెదజల్లుతాయి/అత్తరు పూసుకొని మట్టి పడుచుపిల్ల హొయలు పోతుంది/ గొడ్లు.. కొట్టాల్లో చలికి తలలు కడుపులో పెట్టుకొని పడుకుంటాయి” అంటాడు. నిజంగా ఎంత సహజమైన వర్ణనో అనిపిస్తుంది. వర్షం వచ్చి వెళ్ళిపోయాక వీచేగాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అతని ప్రతి కవిత కూడా అలాగే ఉంటుంది.
ఈ కవితలో చాలామంది పాఠకులకు నచ్చే మరో వాక్యం “బాటలన్నీ పారేనీళ్ళ పాదాల్ని నాటిన పాదులవుతాయి”. నిజంగా ఈ వాక్యం ప్రతి పాఠకుణ్ణి ఆకట్టుకుంటుంది. వానలోకి మనసు లాగుతుంది. గంతులు వేస్తుంది.స్వచ్ఛమైన చినుకులను హత్తుకునేలా చేస్తుంది.
ఇందులోని మరో అద్భుతమైన కవిత
‘గుడిసెతల్లి'(పే.32) ఈ కవిత గురించి వ్యాఖ్యానించని వారు ఉండక పోవచ్చు. పల్లెంత అందంగా అల్లిన కవిత ఇది. పల్లె మకరందంలా మలిచిన ఓ గొప్ప కవిత ఇది. “పంగలి గుంజల నడుముపై/ అడ్డబడితెల్ని బబ్బోపెట్టి/ దూలానికి వాసాలు బేర్చి/ జమ్ముతోనో/ మిరపకట్టెతోనో కప్పిన/ మా పూరిల్లు/ అచ్చం కొత్త పెళ్లి కూతురులా ఉండేది/ బందెడాకు తెచ్చి ఇంటి చుట్టూ దడికడితే/ గుడిసెకి లేతపచ్చ చీర కట్టినట్టే ఉండేది/ మా అమ్మ దోకుడు పారతో బొచ్చె నిండా మట్టిదెచ్చి/ కాత్త బర్రె పేడ కలిపి ఇంటికి అలుకుతుంటే/ పీటల మీద కూర్చున్న పడుచుకి పసుపు రాస్తున్నట్టే ఉండేది/ ఎర్రమట్టి పిసికి గడపకి పూస్తుంటే/ పాదాలకి పారాణి అద్దినట్టు/ కళ్ళాపు జల్లి ముగ్గులు పెడితే/ కాళ్ళకి పట్టీలు తొడిగినట్లు/ పొయ్యిగడ్డ పెట్టి పొంగుబాలు జేత్తే/ నుదుటికి బొట్టు పెట్టినట్టు/వాకిలికి తోరణాలు కడితే/ మెళ్ళో నల్లపూసల దండ వేసినట్టు/ నిట్టాడి గుంజకు/ పసుపు కుంకుమ అలమి/ మర్రి రావాకుల జడకట్టి/ పోలేరమ్మకు మొక్కోని/ కోడిని కోస్తే/ ఇంటిబిడ్డకు/ రవిక గుడ్డ పెట్టినట్టు/ మా ఇంటి బతుకు ముత్తయిదువులా ఉండేది/సపారం కింద నులక మంచం వేసుకొని పడుకుంటే/ మట్టిశాత్రాలు చెప్పే మా గుడిసె/ గంపెడు పిల్లల తల్లిలా ఉండేది” అన్నప్పుడు పల్లె గుడిసె చిత్రం కళ్ళనిండా గుడి కడుతుంది.
_________
కవి నిజంగా మళ్ళీ బాల్యప్రాయానికి ప్రయాణం చేసినట్లున్నాడు. అందుకే అవన్నీ అచ్చు గుద్దినట్టుగా ప్రతి వాక్యంలో కవితాత్మక పదాలను అందంగా పొదిగాడు. చారిత్రక వస్తువులను మ్యూజియంలో భద్రపరిచినట్టు ఇతను తన బాల్యపు సంఘటనలనన్నీ తన బుర్ర అనే మ్యూజియంలో భద్రంగా పదిల పరుచుకున్నాడు. ప్రతి కవితాపాదం మన కళ్ళకు ఊహలనిచ్చెనలో తన లోకానికి తీసుకెళ్ళి తనబాల్యపు అడుగులలో మన అడుగులను వేయిస్తూ తనతోపాటు తన జ్ఞాపకాల గురుతులను మనకు చూపిస్తూ మన బాల్యపు అనుభవాలను గుర్తు చేస్తాడు..!
_________
పదేపదే చదవాలనిపించే కవితలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. పుస్తకం తెరవగానే పల్లెమట్టి వాసనతో పలకరింపులు, వర్షపు చినుకుల జలధారలు పారి వాగువంకలతో నిండి సముద్ర అలలు స్వేచ్ఛగా నవ్వుతున్నట్టూ, కవిత్వ వంటకాలతో నోరు తీపిని చేసి, కడుపు నింపేస్తాడు కవి. ఇందులో ప్రతి కవితా చదవదగినది.ప్రతి కవిత చెట్ల వేర్లలా ఒకదానికొకటి అంతర్గతమై అల్లుకొని మన ముందు మహావృక్షం బహిర్గతమయ్యేలా చేస్తుంది. ఏదో ప్రకృతి గాలి తనతో మాట్లాడుతున్నట్లు సులువుగా వాటి భావాలను చాలా కవితల్లో పలికించాడు వెంకట నారాయణ. ప్రతి సామాన్యునికి అర్థమయ్యే అచ్చమైన పల్లె యాస ఇది.
-చేగువేరా హరి
99513 10711