బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకుల భోగట్టా.మూడోసారి ఎన్డీఏ(ప్రధానంగా బీజేపీ+టీడీపీ+జేడీయూ) అధికారంలోకి వచ్చింది.అప్పటి నుంచి తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని ఖరాఖండిగా చెబుతున్నది.అందులో భాగంగానే రాజ్యసభలో మేజార్టీ సాధించింది. ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీఎన్నికల అంశాన్ని ఎన్నికల ముందే బీజేపీ తెరముందుకు తీసుకువచ్చింది. పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీ నియమించింది. దాంతో ఆ కమిటీ ఇటీవల పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇచ్చింది.ఆ నివేదిక లో ఏమి ఉందో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఊహించవచ్చు.జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం. ఇలా జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి.ఐదు ఆర్టికల్స్ 83,85,172,174,356 సవరణ చేయాలి. అలాగే లోక్ సభ,రాజ్యసభ లలో 67 శాతం సభ్యులు మద్దతు పలకాల్సిఉంది. అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలో మద్దతు తీర్మానాలు చేయాలి. అప్పుడు జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి.మాటలమాంత్రికుడు మోదీ తప్పక ఈ టాస్క్ లో విజయం తప్పక సాధిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.పార్లమెంట్ లో జమిలీ బిల్లు ఆమోదం పొందితే 2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది.సాధారణంగా ఎన్నికలు విడిగా జరిగితే ప్రజలు లోక్సభకు జాతీయపార్టీలవైపు మొగ్గుతారు. అదే రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయపార్టీలవైపు చూస్తారు.స్థానిక ప్రభుత్వాలయితే ఎక్కువ ప్రయోజనం పాటు స్థానిక నాయకత్వం పెరుగుతుందని ప్రజలు ఆలోచిస్తారు. కాని బీజేపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి.ఒకేసారి ఎన్నికలు జరిగితే తమవైపు ప్రజలు చూస్తారని ఆశ.ప్రాంతీయ పార్టీలంటే బీజేపీకి గిట్టదు.అవి జాతీయ ప్రయోజనాలకు ఆటంకమని
భావిస్తుంది.వాటిని బలహీనపరచాలని చూస్తుంది.అందులోనూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 300 మార్క్ దాటలేకపోగా 242 దగ్గరే ఆగిపోయింది. టీడీపీ,జేడీయూ మద్దతు అవసరమైంది.ఈ సారి జమిలీ జరిగితే సొంతంగా మేజార్టీ సాధించాలని ఆ పార్టీ ప్రణాళిక.అప్పుడే తన ఎజెండా అమలుకు తిరుగు ఉండదు.ఇప్పటికే కాంగ్రెస్ బూజుపట్టిన విధానాలతో ప్రజల అభిమానం కోల్పోతున్నది. వారసత్వరాజకీయాలే ఆ పార్టీ ఊపిరిగా సాగుతున్నాయి. దానినుంచి బయటపడలేకపోతున్నది. ఈ పరిస్థితుల్లో జమిలీ జరిగితే తమకే అనుకూలమని బీజేపీ భావిస్తున్నది.
జమిలీ ఎన్నికల అనంతరం వందరోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని బీజేపీ వర్గాలు చెఫుతున్నాయి.జమిలీ తరువాత పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని రిపేరు చేసే పని చేపడుతుందని కొన్ని వర్గాలు ఊహిస్తున్నాయి.కాదు యాకంగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపుతున్నదని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఎంతో ధనం సేవ్ అవుతుందని బీజేపీ నమ్మబలుకుతున్నది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పటిష్టమవుతుందని చెబుతున్నది. ఏదిఏమైనా జమిలీ వస్తే ప్రాంతీయ పార్టీలకు గండమే. ఫెడరల్ వ్యవస్థగా ఉన్న పార్లమెంటరీ విధానం నెమ్మదిగా యూనిటరీ విధానంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.యూనిటరీ విధానంతో అధికారం కేంద్రీకృతం అయ్యి నిరంకుశంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే ఇండియా కూటమి బలంగా రూపుదిద్దుకోవాలి.ప్రాంతీయపార్టీలు సంయుక్తంగా ఎదుర్కొవాలి.విభేధాలు మరచి ఒకే మాట మీద నడవాలి.అందుకు కాంగ్రెసు త్యాగాలు చేయాలి.అవసరమైతే నాయకత్వం వదులుకోవాలి.లేదా మరోసారి జనతా తరహాలో సారూప్యవిధానాలున్న ప్రాంతీయ పార్టీలు విలీనం కావాలి.అదీ దేశవ్యాప్తంగా బలమైన పార్టీలు కలవాలి.కాంగ్రెస్ విధానాలు మార్చుకోవాలి. ఆ కూటమిలో కాంగ్రెస్ కూడా విలీనం కావాలి. అప్పుడే బీజేపీకి ఎదురునిలిచి పోరాడే స్థైర్యం వస్తుంది.ప్రజలంతా ఆదరించే అవకాశం ఉంటుంది.ప్రజాస్వామ్యం పదికాలాల పాటు నిలిచేలా బీజేపీ కూడా విధానాలు మార్చుకోవాలి.జమిలీ వస్తుందో,రాదో తెలియదుగానీ రాజకీయ ఎమర్జెన్సీ మాత్రం రాబోయే రోజుల్లో వస్తుందనేది వాస్తవం.
(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)