ఆంధ్రప్రదేశ్ లో నేడు కుల ప్రాతిపదికగా పావులు కదపడానికి అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులు, బీసీలు ప్రధాన భూమిక పోషించనుండగా, వారు ఎవరికి మొగ్గు చూపితే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గత ప్రభుత్వాలు నిరూపించాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న కాపుల మద్దుతు కూడగడితే ఆయా పార్టీలకు విజయావకాశాలు తప్పవని ఈపాటికే పార్టీలన్నీ అంగీకారానికి వచ్చాయి. అయితే కాపులకు నేతృత్వం వహిస్తూ ఇప్పటికే జనసేన పార్టీ రంగంలో ఉంది. ఆ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ తమకు అన్ని కులాలు సమానమని, అందరి సహకారం అవసరమని పైకి చెబుతున్నప్పకీ, కాపుల సహకారం లేనిదే ఏమీ సాధించలేడన్నది నిర్వివాదాంశం. ఆ కారణంగానే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యారు. ఇప్పుడు వీరి మద్దతు ఎవరికి ఉంటే వారే రాబోయే ఎన్నికల్లో విజయ భావుటా వేయగలరు.
ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాపుల ఓటు బ్యాంకు ఎవరికి ఉపయోగపడుతుందన్నదే అందరి ప్రశ్న. అయితే ఇక్కడ మరో ప్రశ్న రాజకీయ వర్గాల్లో వేధిస్తోంది.. ఒక వేళ కాపులు, తమ వర్గానికి చెందిన వారి పట్ల మొగ్గు చూపుతుంటే , పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారన్న వాదన వినిపిస్తోంది.. పవన్ కు జేజేలు కొట్టి నిండా ముంచేసింది కాపులు కాదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది… పోని జరిగిందేదో జరిగింది ,రాబోయే ఎన్నికల్లోనైనా కాపులు పవన్ కు మద్దతుగా నిలుస్తారా అన్నదే ప్రశ్నగా మిగిలిపోతుంది… అయితే ఏపీలో మూడవ ప్రత్యామ్నాయ పార్టీకి కాపుల సహకారం గాని, ఆ వర్గం మద్దతుగానీ తప్పకుండా ఉపయోగపడుతుందనేది అందరూ అంగీకరించాల్సిన విషయం.
ఈ క్రమంలో ఏపీలో కాపులు ఇపుడు ప్రధాన భూమికను పోషించే స్థితిలో ఉన్నారు. వారి జనాభా ఎంత అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా కాపులు తక్కువలో తక్కువ ఇరవై శాతానికి పైగా ఉంటారని ఓ అంచనా . ఇక, దళితులు పదిహేను శాతం, బీసీలు 50 శాతం ఉన్నారు. వీరందరినీ కలిపి ఒక్కటిగా చేస్తే రాజ్యాధికారం అందుకోగలమని రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లోనే కాపులు, దళితులు, బీసీలను కలుపుకుని ముందుకు నడవాలని కాపు నాయకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ కేవలం కాపులను బీసీల్లో చేర్చమంటూ ఉద్యమం చేసిన ఆయా నాయకులు , రాబోయే ఎన్నికల నేపధ్యంలో కొత్త రూట్లో పయనించడానికి పావులు కదుపుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వ్యతిరేకిస్తామంటున్న బీసీలతో చెలిమి చేయడం ద్వారానే అనుకున్నది నెరవేర్చుకోవచ్చునన్న ఆలొచనలో ఆయా నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు . అయితే ఆ నాయకులు తెర వెనుక చక్కబెడుతున్న ఈ వ్యవహారమంతా జనసేన కోసమేనా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఎందుచేతనంటే ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం రావాలని ఓ వైపు జనసేన చెబుతోంది. పైగా పవన్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారే. ఇంకో వైపు టీడీపీ, వైసీపీలపై కొంత మంది ప్రముఖ కాపు నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అందువల్ల వారు వండుతున్న ఈ సరికొత్త సామాజిక వంటకం జనసేనకు కాపు కాసేందుకేనని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 20 శాతం ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్. 2019 ఎన్నికల్లో కాపు ఓటర్లలో మెజార్టీ శాతం వైసీపీకి అనుకూలంగా వేసారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఈ సారి పవన్ కళ్యాణ్ కేంద్రంగా కాపు సామాజిక వర్గ ఓట్ల పైన చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ స్పష్టం చేసారు.
ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో కాపు వర్గ ప్రాబల్యం బలంగా ఉండటంతో, ఆ రెండు జిల్లాల కేంద్రంగా ఇప్పుడు వైసీపీ – జనసేన- టీడీపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ కీలకంగా ఉన్న బీసీ – ఎస్సీ ఓటు బ్యాంకు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం జగన్ కు కలిసి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, ఇప్పుడు కాపు ఓటింగ్ విషయం పార్టీలకు అంతు చిక్కటం లేదు. దీంతో, కాపు వర్గాన్ని ఓన్ చేసుకొనేందుకు పార్టీలు కొత్త అడుగులు వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పార్టీలు సామాజిక సమీకరణాల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో పవన్ ను , ఆయన బలపరిచిన అభ్యర్ధులను మట్టి కరిపించిన కాపులు, మరి రాబోయే ఎన్నికల్లో పవన్ కు ఏ మేరకు తమ మద్దతు పలుకుతారనేది అంతుపట్టని విషయం. మరో వైపు పవన్ కల్యాణ్ ఒక సారి తెలుగుదేశం పార్టీకి మరో సారి బీజేపీకి మద్దతు పలకడం, కాపులకు రాజ్యాధికారం దక్కాలని కోరుకుంటున్నవారికి మింగుడు పడడం లేదని చెబుతున్నారు. అదే గనుక నిజమైతే పవన్ తన స్టాండ్ ఏమిటో ఇప్పటికైనా ప్రకటించాల్సి ఉంది. ఆయన రెండు పడవల ధోరణిని పక్కన పెట్టి, తన స్టాండ్ ఏమిటో, తానే ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించుకుని, తనకు మద్దతిస్తే, కాపులకు, బీసీలకు చేసే మేలేమిటో కచ్చితంగా చెప్పాల్సి ఉంది. అలాంటి స్టాండ్ పవన్ తీసుకోకుండా గోడ మీద పిల్లి వాటంగా ఉంటే మాత్రం గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలనే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది నిర్వివాదాంశం.
– దాసరి దుర్గా ప్రసాద్