సంఘ సంస్కరణ..మానవ పరిణామ క్రమంలో కులాల విభజన నాటి నుంచి ఏదో రూపంలో వినిపిస్తున్న మాట. ఏదో విధంగా ‘చుండూరు’ లను ప్రదర్శింపజేస్తున్న మాట. ప్రతీ చోట ‘కంచికర్ల కోటేశు’ల త్యాగాలను ప్రశ్నిస్తున్న సందర్భం. స్వర్ణోత్సవ వేదికపైన ఆడంబరంగా ప్రదర్శిస్తున్న ‘అదృశ్యరూప దృశ్యం’. రాజా వారి వస్త్రాలు వంటి మాట.. అయినా నేటికీ సజీవంగా కవులు నిలదీస్తున్నారు. ‘కవులను’ ప్రశ్నించారని జైలులో పెడుతున్నారు. ఇది కూడా సంస్కరణలలో భాగమంటున్నారు. జాతీయోద్యమ సమయంలో కవితా రచన చేసిన ప్రతిభావంతుల్లో మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి ఒకరు. ఆయన రాసిన కవితల్లో ‘అంటరాని వారెవరంటే మా వెంట రాని వారే’ అన్నది ప్రసిద్ది పొందిన కవితా వాక్యం. నిజమే! వారి వెంట వెళ్ళే వారి కన్నా..వారినే లేకుండా చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇది కూడా ఒక సంస్కరణే. ‘ధిక్కారాన్ని’ (ప్రశ్నించడాన్ని) సంహించలేని రాజ్యం నా దృష్టిలో జీవం లేనిది. మనుగడ సాగించలేనిది’ అంటారు మార్క్స్. వర్తమానంలో పరిస్థితి ఇందుకు సోదాహరణ చిత్రం….!?
కవులను సమాజం ప్రేరేపేస్తుంది. పరిస్థితులు ‘వాడి’ అయిన కవిత్వానికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రజాపక్షం వహించిన కవి ‘తన కులం’ చట్రం నుండి విశాల మానవ హితాన్ని ఆశ్రయిస్తాడు. తన వారి కోసం పరితపిస్తాడు. కవిత్వగుణం, లక్షణం ‘సంఘం’ అనుకొనేవారు.. ‘మనుషుల’ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆకాంక్షిస్తారు, ప్రశ్నిస్తారు, కవిత్వ రూపంలో ప్రశ్నల శరపరంపరను సంధిస్తారు. తమ ధిక్కారస్వరాన్ని వినిపిస్తూనే ‘రాజ్యహింస’లో వర్గపోరును సమాజానికి ఎఱుక పరుస్తారు. అటువంటి ఓ ధిక్కారస్వరం కలేకూరి ప్రసాద్ కవిత్వం. 1984 నుండి 2012 మధ్యకాలం వరకు ఆయన కవిత్వం వెలువరించారు. నూకతోటి బాబూరావు, డప్పు ప్రకాష్, చందుశ్రీలు కాలేకూరి రాసిన గేయాలకు తమ గొంతులను వేదికలుగా చేసి ‘వేనోళ్ళ’కు చేరవేసారు.
____________
కుల నిర్మూలన కోసం గొంతెత్తిన కవి కలేకూరి. స్వతంత్ర రచనలకెంత ప్రాధాన్యమిచ్చారో అనుసృజనను సహితం అంతగా అక్కున చేర్చుకున్న కవి. బెంగాలీ, రష్యన్, మరాఠీ దళిత కవితను తెలుగు పాఠకులకు అందించి, ఆలోచించమని అగ్నిని రగిలించారు. ఆయన కవిత్వాన్ని గురించి గద్దర్.. ‘ఒక మనిషిగా గుర్తించబడని మనిషి గురించి రాసిన కవిత్వాన్ని దళిత కవిత్వమని ఎట్లా అంటారు మీరు? అది మహోన్నత కవిత్వమవుతుంది. కలేకూరి దళిత కవి కాదు. మహాకవి” అంటారు. ఇది అక్షర లక్షల విలువ చేసే ఓ అక్షర చిత్రం. కలేకూరి సహితం ‘దళిత సాహిత్యోద్యమంలో ఒకడిగా చేరే అవకాశం తనకు కలిగిందని’ వినయంగా చెప్పుకొన్నారు. ఆయన రచనల్లో సమసమాజం పట్ల అచంచల స్వప్నం, కుల నిర్మూలన పోరాటం కనిపిస్తుంది. బలంగా వినిపిస్తుంది.
____________
తన వెనుక మూడు దశాబ్దాల ఉదాత్తమైన కవితా వ్యాసంగం ఉంది. తన కవితలు గురించి కలేకూరి ‘కాలానికి నిలబడగలిగే శక్తి ఉంటే ఉంటాయి. లేకపోతే లేదు’ అంటారు. కాని,కాలక్రమ ప్రవాహంలో స్థిరంగా నిలిచిన కవిత్వాన్నే ఆయన సృజియించారు. సాహిత్యేతర ప్రయోజనాల కోసం సాహితీసృజన చేసిన కవి కాదు కలేకూరి ప్రసాద్. రోహిత్ వేముల నుండి ప్రణయ్ పెరుమాళ్ల వరకు బలితీసుకున్న ఈ దేశపు వ్యవస్థ నిర్మిత అస్తవ్యస్థల విలువలకు ఆ రచనలు ఓ కత్తి గాటువంటివి. ‘దురా గతమే’ పునరావృతమవుతున్న వర్తమానంలో ఈ కవిత్వపు ప్రాసంగికతను గురించి ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదని’ ప్రసాద్ కవిత్వానికి పుస్తక రూపమిచ్చిన ‘నామాడి శ్రీధర్’ అంటారు.
సమాజం ఓ పద్మవ్యూహమయే వర్తమానంలో కలేకూరిని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవలసి అవసరం ఉంది. కులం, మతం, వర్గం, జాతి ఇలా విభజన కార్యక్రమం ముమ్మరంగా చాప కింద నీరులా నిర్వహిస్తున్న వేళ ‘హింస’ ఓ అంతర్లీన సూత్రంగా జరిగిపోతున్న సందర్భంలో కలేకూరి ప్రసాద్ ఓ కవితలో “మానవీయ సమాజం/కులాలుగా,మతాలుగా,వర్గాలుగా,వ్యక్తులుగా/ ఒంటరులుగా నిర్వీర్యమవుతుంటే… అది హింస/ ఏ బలిపీఠమైనా గొర్రె పిల్లల కోసమే తయారవుతుంది/ఏ బలిపీఠంపైన ఏ గొర్రె పిల్ల బలైనా/అది ‘ఐచ్ఛికా’ర్పణే!’ అంటారు. ప్రతీ చోటా అణగారిన వర్గీయులు బలైనా (ఇది ఏ రూపమైనా) అది ఓ ‘త్యాగంగా’ ‘ఓ ఐచ్చికాంశంగా’ అందరూ (మిగిలిన వారు) అనుకుంటారు. ఇలా జరుగుతున్న ‘హత్యలకు’ కాలం ఓ మౌన సాక్షిగా నిలవటం అనేకానేక శేష ప్రశ్నలను చరిత్రలో వదిలేస్తున్నది. ‘ఈశ్వరి’ స్మృతిలో రాసిన కవితలో ‘నా తల్లీ! / హింసోన్మత్త నిన్ను జీవితం కొనదాకా / తరిమితరిమి హత్య చేసింది / కాలం సాక్షిగా మిగిలిపోయింది! ఇలా నినదిస్తూనే తన అక్షరాల్లో ‘ఆమె’ను ఎత్తుకుంటానంటారు. ‘కళ్ళలో మెరిసే ఎర్రని జీరల్లో నిన్ను నిలుపుకుంటాం’..ఇది కలేకూరి కవితల్లో కనిపించే త్రీవ్రమైన హెచ్చరిక. ప్రపంచం ఓ భ్రమల వ(వి)లయం. ఇక్కడ ‘ప్రతిభ’ సహితం ‘వర్గీకరణ’ల మధ్య ‘వర్ణణాత్మకంగా’ మిగిలిపోతున్నదంటారు. ‘పీఠాథిపతుల ప్రవచనాల ప్రభంజనాలు/లోకాన్ని ముంచెత్తుతున్నట్లు గుండెలు జలదరిస్తున్నవి’ ప్రతిభకున్న వివిధ ‘వేషాల చిత్రాలను దృశ్య రూపం’ చేసిన ధీశాలి కలేకూరి. ‘ఇప్పుడు ప్రతిభంటే/రెక్కలు చాస్తోన్న మూర్తీభవించిన రాజ్యహింస’ అని ఆవేదనగా గర్జన చేస్తారు. కుర్చీల కోసం మారణహోమ సృష్టి ‘రాజ్యానికి’ ఓ క్రీడ. ఇందుకు ఎన్నో మార్గాలున్నాయి. చిన్న, పెద్ద, కుల, వర్గ, మత, వృద్ధ, స్త్రీ అనే తారతమ్యం లేదు. కావలసినదల్లా ‘కుర్చీ’ పదవి. కలేకూరి సహితం ఇది చూసి సహించలేక ‘ఒక కుర్చీని మార్చడం కోసం / వేలాది పసి ప్రాణాలను కాలరాచే / చాకచక్యం తెలియదు నాకు’ అంటారు. నిజమే కదా అనిపిస్తుంది. అక్షరాలను ఆయుధాలుగా మలచి ప్రయోగించిన కలం ‘కలేకూరి’ స్వంతం.
స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు గడిచాయని సంబరాలు జరుపుకుంటున్న వేళ, వెనుకకు ‘తోసేస్తున్న వర్గీయులను ‘ముందుకు’ తీసుకురావటానికి ‘పథకాలున్నాయి’ కాని, నిజమైన అర్హులు వాటిని అందుకుంటున్నారా అని ప్రశ్నించుకుంటే… లేదనే సమాధానం వస్తుంది. సందర్భాల్లో దగ్గర రాజ్యంగనేతలు తమ ‘వ్యక్తిత్వాన్ని’ పరిచేస్తున్న అంశాన్ని కూడా ప్రసాద్ వ్యంగ్యంగానే అయినా ‘18 డిసెంబర్ 1996’ నాటి సంఘటనకు జత చేసిన విధం ఆయనలోని సత్యసంధత చదువరి హృదయంలో కలవరమూ, కలకలమూ కలిగిస్తుంది. కవిత్వ ప్రయోజనమేమిటి అని ప్రశ్నించే వారికి కలేకూరి కవిత్వం నగ్నంగా సత్యాలను చూపిస్తుంది. తట్టుకొనే ధైర్యం, నిజాయితీ చదువరికి అవసరం. సాధించిన స్వాతంత్య్రం తమ వారిని ఇంకా సమాజానికి దూరంగా ఆధునికతను జత చేసి వేరుగా జీవింపజేయటం కూడా అవమానమంటారు. ‘నా సొరాజ్జమా! / నీకు యాభై ఏళ్ళు నిండిన తర్వాత / ఇప్పుడు నువ్వంటే / అమితమైన ప్రేమ పుట్టుకొస్తున్నది / ఒక్కసారి రావే… / మా మాల మాదిగ గూడేల దాకా’ అనే అక్షరక్రమం గుండెలను మండిస్తాయి (1996లో రాసిన కవిత).
జీవితానుభవాలు కళ్ళకు కట్టిన దృశ్యాలు, సామాజిక అసమానతల కొలిమిలో అవమానతల మంటల వేడిమిని భరించలేని వ్యక్తి సమాజంను ప్రశ్నించే తత్త్వం కవిత్వంలో ప్రతిఫలిస్తే అది కలేకూరి ప్రసాద్ అగ్నిధారల కవిత్వ కుంభవృష్టి అవుతుంది. కదిలిస్తుంది. కన్నీరును తెప్పిస్తుంది. కళ్ళంట మంటలను కురిపిస్తుంది.
కవి, అనువాదకుడు, పాత్రికేయుడు, సామాజిక, రాజకీయ కార్యకర్తగా కలేకూరి బహుముఖీయ ప్రజ్ఞ వెనుక చిన్నతనంలో స్వగ్రామలో జరిగిన కంచికర్ల కోటేశు అనే బాలుడి సజీవదహన దృశ్యం అదృశ్యశక్తిగా ఉందనేది విస్మరించరానిది. ఆ సంఘటన ప్రేరణ నుండి అతనొక ‘మహా శక్తిగా’ ఎదిగిన క్రమం గొప్పది. అతని కవిత్వం గాఢత్వంతో నిండి ఉంటుంది. ఆర్ధ్రత, అంతర్ముఖత, స్పష్టత, కోపోద్రిక్తత, అధిక్షేపం, అంబేద్కర్ భావజాలాల సమ్మేళన సమ్మోహన రూపం కలేకూరి కవిత్వం. 2013 మే 17న కలేకూరి కానరానిలోకాలకు తన కలంతో తన వారి కథలను, వ్యధలను ప్రశించడానికి పయనం సాగించాడు.
(అక్టోబర్ 25వ తేదీ కాలేకూరి ప్రసాద్ జయంతి)
-భమిడిపాటి గౌరీ శంకర్
94928 58395