ఆదికవి కాలం నుండి నేటివరకు తెలుగు కవిత్వాన్ని పరిపుష్ఠం చేసినవారెందరో. కానీ తొలినాళ్ళలో తెలుగు కవిత్వంలో స్త్రీకి ప్రాతినిధ్యం తక్కువే. ఐతే స్త్రీలో సహజాతంగా ఉండే కోమలత్వం, మృదుత్వం, ఆర్ద్రత గొప్ప కవిత్వాన్ని అందించగలదని నిరూపించిన కవయిత్రులున్నారు. ఆ రకంగా రాశి తక్కువే అయినా వాసి ఎక్కువే. అయితే నేటికాలంలో అన్ని రంగాలతో సమానంగా సాహిత్యంలో, కవిత్వంలో తమదైన ముద్రవేస్తున్న మహిళామణుల సంఖ్య విరివిగా ఉంది. ఇదొక శుభపరిణామం. ఆ కోవలోనే చక్కని, చిక్కని కవిత్వాన్ని సృజిస్తున్నారు శ్రీమతి నాగజ్యోతిశేఖర్. రెండుమూడేళ్ళుగా తను రాస్తున్న కవితలన్నింటిని పుస్తకంగా కుట్టి ‘రెప్పవాల్చని స్వప్నం’గా మనకందిస్తున్నారు.
“నిత్యచైతన్యశీలిగా అక్షరాల అక్షయతోవలో కవనపూజ చేయాలన్నదే నా ఆకాంక్ష. చుట్టూ జరిగే సామాజిక అంశాలే నా కవితా వస్తువులు. మానవసంబంధాలే నా పద బంధాలు” అన్న ఆమె మాటలే నాగజ్యోతి వ్యక్తిత్వాన్ని, కవిగా ఆమె అస్థిత్వాన్ని పట్టిచూపుతున్నాయి.
ఒక పేద వ్యవసాయకూలీ కుటుంబం నుండి వచ్చిన నాగజ్యోతి తన కుటుంబం అనుభవించిన కష్టాలకు, అణచివేతలకు అక్షరమే అండ అనుకుంది. స్వయంకృషితో, పట్టుదలతో ఉపాధ్యాయురాలిగా జీవితంలో కుదురుకుంది. అక్కడా తన చుట్టూ ఉన్న సమాజంలో అసమానతలు, అణచివేతలు అలాగే ఉన్నాయని గమనించింది. సాంత్వన పొందడానికి తిరిగి అక్షరాన్నే ఆసరాగా చేసుకుంది. వేదనాగాయాలకు అక్షరాన్నే మలాముగా రాసుకుంది. అందుకే “నాలోని దుఃఖనదుల్ని ఎత్తి పారబోసిందెవరు?/నా కళలకు ఆకుపచ్చని వర్ణాలద్దిందెవరు?” తన అంతరాంతరాలలో చెలరేగే అనేకానేక ప్రశ్నలకు అక్షరాలే సమాధానం అని తెలుసుకుంది నాగజ్యోతి.
“పదంపదంగా నువ్వు కురుస్తుంటే
ఆ చిత్తడిలో మొలుస్తూ నేను
వాక్యంవాక్యంగా నువ్వు విరుస్తుంటే
ఆ పుప్పొడిలో నా భావసంపర్కం
నువ్వు పేజీపేజీగా తెరుచుకుంటుంటే
ఆ మూలల్లో నా మూలాలు
వెతుక్కుంటూ నేను”.
__________
నాగజ్యోతి కవిత్వంలో అనేక పార్శ్వాలున్నా ముఖ్యంగా స్త్రీ ఒంటరితనం, వేదన ఈ సంపుటినిండా పరుచుకుని ఉంది. పురుషస్వామ్య లోకంలో అనాదిగా మహిళను తక్కువ చేసి చూడడమనే భావన, ఆలుమగల అనుబంధంలో మహిళకి దక్కాల్సిన అనురాగం, ఆత్మీయత, స్వేచ్ఛ కొరవడిన వైనం ఆమె కవిత్వంలో ప్రతిఫలిస్తుంది. ఇకనైనా భార్యాభర్తలు కలిసి కొత్తనడక ప్రారంభించాలనే బలమైన కోరిక కనిపిస్తుంది. ఐతే ఎక్కడా పురుషద్వేషం, పరుష పదజాలం లేకపోవడం గమనించదగ్గ విషయం.
___________
“యుద్ధం నాకేం కొత్త కాదుగానీ
భూమి నీది నాది అయినప్పుడు
నేను మాత్రమే మొలకెత్తేందుకు
పోరాడడమేమిటి?
ఆకాశం నీది నాది అయినప్పుడు
నేను మాత్రమే ఉదయించడానికి
పెనుగులాడడమేమిటి?
ఇన్నాళ్ళు
నీకు నీతి నేర్పితే చాలనుకున్నాను
తప్పదు!
కాలం పుస్తకంలో
కొత్త వాక్యమొకటి
రాసుకోవాలని తెలుసుకున్నా”
ఈ క్రమంలో ‘పుస్తెలతాడు’ చదివి తీరాల్సిన కవిత. పేదరికపు దైన్యాన్ని, వారి జీవితంలోని ప్రతి అంకంలో ఆ గృహిణి పుస్తెలతాడు తాకట్టుకు బలై వాళ్ళని ఆదుకునే తీరుని కరుణరసాత్మకంగా కవిత్వీకరించారు నాగజ్యోతి. కష్టాలకాష్టానికి బలవుతూ పుస్తెలతాడునే ఉరితాడుగా మార్చుకుంటున్న ఆడపడుచుల దుస్థితిని అక్షరీకరించారు. ఇంకా నాగజ్యోతి కవిత్వంలో అస్థిత్వం, ఉనికి తాలూకు ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది.
“రెక్కలు తెగిన కలలేవో
నా కంటిచూరుకు వేళ్ళాడుతూ
నా ప్రతిబింబాన్ని తల్లకిందులుగా
చూపుతున్నవి”
ఏ వస్తువును తీసుకున్నా మానవజీవన స్పర్శను ఆ వస్తువుకు అద్దడం, అందులో తన జీవితాన్ని చూసుకోవడం నాగజ్యోతి కవిత్వంలో ముఖ్యలక్షణం. ఉదాహరణకు చినుకు మీద కవిత రాస్తూ…
“పేదగుడిసె సందుల్లో దుఃఖమొలకబోస్తూ
మెతుకులేని సత్తుగిన్నెల బతుకులపై
తలను బాదుకుంటూ
చినుకు
ఆకలై మాట్లాడుతూనే ఉంటుంది”అనడం. అలాగే ‘పడక్కుర్చీ’ కవిత. రైతుకూలీ బిడ్డగా, ఆ జీవితంలోని సాధకబాధకాలను చూసిన వ్యక్తిగా మట్టి గురించి ‘ఎరుపెక్కిన మట్టి’ అనే కవిత రాసింది. అందులోని కొన్ని పంక్తుల్ని గమనిస్తే కవి ఎంత సహజంగా జీవితాన్ని కవిత్వంలో చూపించగలరో అర్థమవుతుంది. మచ్చుకు కింది కవితాపంక్తులు గమనించండి.
“మట్టి మాట్లాడడం మొదలయ్యింది”
“గొంతెండిన గుండెల్లో నెత్తుటిబావిని తవ్వుతూ పోటెత్తింది”
“నాలుగు చినుకుల్ని విదిలిస్తే
అయిదువేళ్ళను నోటికందించే
మట్టిప్పుడు పిడికిలి బిగించింది”
నాగజ్యోతి కవిత్వశైలిలో ఎక్కువగా పదచిత్రాలు కనిపిస్తాయి. బహుశా ఆమెలో ఉన్న కళాత్మక దృష్టి, చిత్రకారిణి ఆమెను పదచిత్రాల్ని విరివిగా వాడే దిశగా పురికొల్పాయేమో అనిపిస్తుంది. అయితే అవి అత్యంత సహజంగా ఆమె కవిత్వంలో ఒదిగిపోయాయి.
బలమైన భావ వ్యక్తీకరణ, గాఢ సాంద్రత కలిగిన శ్రీమతి నాగజ్యోతిశేఖర్ తన అభిరుచితో, అభివ్యక్తితో తెలుగు కవిత్వయవనికపై చేసిన తొలి సంతకం ‘రెప్పవాల్చని స్వప్నం’.
-రాపోలు సీతారామరాజు
దక్షిణాఫ్రికా,27 72 774 7549