ఏ గొప్ప సాహిత్యానికైనా జీవితమే ముడి సరుకు

సాహిత్యం హోమ్

యువతరం పాఠకుల్ని, రచయితల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రెండు కార్యక్రమాలు చేపట్టింది. మొదటిది ఈతరం కోసం కథాస్రవంతి. కథాసాహిత్యంలో పేరెన్నికగన్న కథకుల సంపుటాలు ప్రచురించడం. రెండవది యువ రచయితలను ప్రోత్సహించేలా కథల పోటీ నిర్వహించడం. పది, పన్నెండు కథలకు పరిమితంజేసి నేటికి నలభై మూడు కథాసంపుటాలు అరసం ప్రచురించింది. ‘అరసం యువ కథాపురస్కారం’ 2021, 2022 సంవత్సరాలలో పోటీలు పెట్టి పదిమంది కథకులకు బహుమతులిచ్చి, ఆయా కథలను ప్రచురింపజేసింది. ‘2022 అరసం యువ కథాపురస్కారం’ పోటీలో ప్రోత్సాహక బహుమతి అందుకున్న రచయిత దొండపాటి కృష్ణ. యాభైపైగా కథలు రాసి, అందులో పదహారు కథలతో సంపుటిని వెలువరించడం అభినందనీయం.

కథ సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్న నమ్మకంతో కథారచన చేస్తున్నట్టు తనకు తానే చెప్పుకున్నాడు కృష్ణ. అలానే ఏ రకమైన కథలు రాయడం ఇష్టమో కూడా తనే చెప్పుకున్నాడు. అంటే రచయితగా తానో దృష్టి కోణాన్ని కలిగి ఉన్నట్లే అనుకోవాలి.

కొత్తగా రచనలు చేస్తున్న ఏ రచయితయినా ఏది రాయనక్కరలేదో తెలుసుకోగలిగితే మంచి కథ రాయగలిగే ఆలోచన చేయగలుగుతాడు అనుకుంటాను. ఏ గొప్ప సాహిత్యానికైనా జీవితమే ముడి సరుకు.

‘కథకోసం కథ రాయడం కాదు. కథ ద్వారా ఒక పాయింట్ ను పాఠకుడికి అందించాలన్న దృష్టి కూడా కథకుడికి ఉండటం చాలా అవసరం’ అంటారు కథారచయిత సింగమనేని నారాయణ.

మంచి కథలు రాయడానికి రచయితకు అధ్యయనం, సాధన చాలా అవసరం. ఈ రెండూ లేనిదే మంచి రచయితగా గుర్తింపు పొందలేరు. కథకు వస్తువు, శైలి, శిల్పం అత్యంత ప్రధాన విషయాలుగా యువ రచయితలు గుర్తించాలి.

‘మొట్టమొదటిగా నవల వ్రాసి విశేషమైన ఖ్యాతి గడించిన వాళ్ళు ఉన్నారుగానీ మొట్టమొదటిగా కథ వ్రాసి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు బహు కొద్దిమంది’ అంటారు మధురాంతకం రాజారాం. ప్రతి చిన్న కథలోనూ కథావస్తువూ, పాత్రలు, వాతావరణ సృష్టి, క్లైమాక్స్, కొసమెరుపు ఉండాలంటారు రాజారాం.

‘జీవితంలో జరిగిన చిన్న సంఘటన తీసుకుని ఎవరైనా కథ రాయవచ్చు. అయితే తీసుకున్న దాన్ని కొత్త కోణంలోంచి చూడాలి. లేదా కొత్తరకంగా చెప్పాలి’ అంటారు కవి, సాహిత్యపు చరిత్ర పరిశోధకుడు ఆరుద్ర.

జీవితంలోని ఒక అంశాన్ని వివరించడానికి కథ సాధనం. ఒక అవస్థని గానీ, ఒక అనుభవాన్ని గానీ, ఒక వైచిత్యాన్ని గానీ, ఒక మనస్తత్వాన్ని గానీ చిత్రించేది కథ’ అంటారు కథకుడు హితశ్రీ.

‘ఏ ఒక్క పరిస్థితినైనా రచయిత తన మానసిక వాతావరణంలోకి తెచ్చుకుని తన ప్రత్యేక దృష్టితో ఆ అవస్థను చూచి, విమర్శించి, అనుభవించి, చదువరికి అందజెయ్యడం అతని కర్తవ్యం’ అంటారు కథారచయిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కృష్ణ రచయితగా తనని తాను ఉన్నతీకరించుకోవాలి. ఈ సంపుటిలో కొన్ని రాయాల్సిన కథలూ ఉన్నాయి, రాయాల్సిన అవసరం లేని కథలూ ఉన్నాయి.

మూఢనమ్మకాలకు చెంపపెట్టుగా రాసిన కథ ‘దిష్టి’. భర్త ఆధిపత్యాన్ని మౌనంగా భరించిన ఆమె, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి మౌనాన్ని వీడి ధైర్యంగా నిలబడటం ‘ఉరేసుకున్న మౌనం’ కథలో చూస్తాం. బీమామిత్ర ఏజెంటుగా పనిచేస్తూ, బాధితులకొచ్చే సొమ్ములో వాటా దండుకుంటూ, అమానుషంగా వ్యవహరించే మనిషి, ఒక హిజ్రా మరణంతో పరివర్తన చెందటం ‘రాతిగుండెలో నీళ్ళు’ కథలో చూపారు. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ లో ఉన్న భర్తకు, కాన్పుకు ఆసుపత్రిలో ఉన్న భార్యకు మధ్య జరిగిన మానసిక సంఘర్షణకు అద్దం పట్టిన కథ ‘కొత్త స్వరం’.

ఈ సంపుటిలో ఉన్న కొన్ని కథలను మాత్రమే మచ్చుకి ప్రస్తావించాను. క్లుప్తత పాటించడం, కథలకు శీర్షిక పెట్టడంలో, వస్తువు ఎన్నుకోవడంలో, భాష, శైలి, నిర్మాణం విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.

‘రచనలో ముఖ్యమైన మూడు విషయాలు – వస్తువు, శైలి, శిల్పం. వస్తువు సార్వజనీనమైనది. శైలీ శిల్పాలు వ్యక్తిగతమైనవి. ఒక రచయిత నుంచి మరో రచయితను విడదీసి చూపేవి ఈ రెండే’ అంటారు చిత్రకారులు, కవి, కథకుడు శీలా వీర్రాజు.

కథను చదివి ముగించిన తర్వాత పాఠకునిపైన ఏ ప్రభావాన్ని చూపలేకపోతే ఆ కథ తన ప్రయోజనాన్ని తాను సాధించుకోలేకపోయిందన్న మాట. సామాజిక ప్రయోజనాన్ని ఆశించే కృష్ణలాంటి యువరచయితలు ఈ విషయాన్ని గుర్తెరిగి కథలు రాయాలి.

రచయిత జీవితాన్ని పలు కోణాల్లో చూడటం నేర్చుకుని, ఆయా విషయాలను తన వ్యక్తిగత జల్లెడలో వడబోసి, శిల్ప చాతుర్యంతో కథారచన చేయడంలో తన మార్గాన్ని తనే స్వేచ్ఛగా ఎన్నుకోవాలంటాను. సమాజం, మూఢ విశ్వాసాలు, రాజకీయాలు, ఆర్థిక అసమానత్వం, కులమతాలు, అవినీతి, జీవన పరిస్థితులు మొదలైన వాటిపట్ల నిక్కచ్చి అభిప్రాయాలుండటం తప్పనిసరిగా భావిస్తాను.

నిశిత పరిశీలన, అధ్యయనం, సాధనలతో రచయితగా కృష్ణ మరిన్ని మంచి కథలు రాయాలని, సామాజిక స్పృహతో, లక్ష్యసిద్ధితో అభ్యుదయ దృక్పథంగల రచయితగా గుర్తింపబడాలని ఆశిస్తూ, అభినందిస్తున్నాను.

-వల్లూరు శివ ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *