చెబుతా వినుకో మల్లన్న

ఎడిటోరియల్ హోమ్

మానవజాతి చరిత్ర సమస్తం పరస్పర హననమే
విశ్వం ఆవిర్భావం నుంచి ఆధిపత్యపోరాటాలే
తమ నాశనం తామే లిఖించుకుంటున్న మానవులు

“ఏ దేశ చరిత్ర చూసినా….ఏమున్ననది గర్వకారణం…నరజాతి చరిత్ర సమస్తం..పరపీడన పరాయణత్వం” అని మహాకవి శ్రీశ్రీ కవితలు అక్షరసత్యం,వాస్తవం. ఏ దేశ చరిత్ర తిరగేసినా పరస్పర హననం,హింస,బానిసత్వం,పరపీడన,యుద్ధం,కీర్తి దాహంతో నిండి ఉంది. యథా రాజా తథా రాజా అన్నట్లు ప్రజలు కూడా పాలకుల పంథాలో నడిచారు. ఈ భూమండలం ఈ ఆధునిక యుగంలోనూ పరస్పర శత్రుత్వాలతో అణుబాంబుల రూపంలో తమ నాశనం తామే సృష్టించుకుంటున్నాయి. ప్రకృతి ధ్వంసంతో అది తెచ్చే వైపరీత్యాల రూపంలో మానవుడే తన నాశనానాన్ని తానే లిఖించుకుంటున్నాడు.

ఈ విశ్వంలో మానవ మనుగడ మాతృసామ్యంతో ప్రారంభమైంది.వేట వారి ప్రధాన వృత్తి. ఆధిపత్యం కోసం తెగల మధ్య వైరం చిన్నపాటి యుద్ధాలు,చంపుకోవడాలు జరిగేవి. ఆహారం కోసం పోరాటంలో పురుషులతో పాటు మహిళలు కూడా సమాన ప్రతిభ చూపించేవారు. క్రమానుగతంగా వీరు గుంపులుగా ఏర్పడి పెద్ద సమాజంగా ఏర్పడ్డారు. అడవులను దునిమి పోడు వ్యవసాయం ప్రారంభించారు.పురుషుడు నెమ్మదిగా స్త్రీ నుంచి అధికారాన్ని కుటుంబ పెద్దగా అవతరించాడు.అప్పటి నుంచి పురుషుల మధ్య ఆహారం,సంపద, స్త్రీ ల కోసం యుద్ధాలు జరిగేవి.ఆ యుద్ధాలను తట్టుకునేందుకు కోటలు నిర్మించుకున్నారు.కోటలతో పాటు చిన్నపాటి రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు.దాంతో రాజ్యాలు మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగేవి.ఓడిపోయిన రాజ్యం గెలిచిన రాజ్యంలో విలీనం చేసుకుని స్త్రీ లను,ప్రజలను బానిసలుగా చేసుకునేవారు.రోమన్ మహా సామ్రాజ్యం లో యుద్ధఖైదీల మధ్య పోరాటం పెట్టిన వారి శరీరాలు రక్తమోడుతూ,ఒకరినొకరు చంపు కుంటుంటే రాజులు,ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టి రాక్షసానందం పొందేవారు. ఈ రాక్షస ఆట కోసం ప్రత్యేకంగా ఎరీనా ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో 18 అక్షౌహిణి సేనలు నెలకొరిగాయి. అశోకుడు ఉత్తర హిందూ స్థానం నుంచి వచ్చి కళింగ యుద్ధంలో లక్షలాది మందిని ఊచకోత కోసాడు.సాక్షంగా శాసనాలు దర్శనమిస్తున్నాయి.ఐరోపా దేశాలలో అనేక యుద్ధాలలో వేలాదిమంది కడతేరిపోయారు.అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో కూడా వేలాదిమంది చనిపోయారు.

మానవుల మధ్య కీచులాటలకు స్వార్ధం ప్రధాన కారణం. ఎదుటివాని వద్ద ఉన్నది తన వద్ద లేదనే ఈర్ష్య,తన వద్ద ఉన్నది ఎదుటి వాడు లాక్కుంటాడనే భయం వల్ల గొడవలు,యుద్ధాలు జరిగేవి.
మనుషుల మధ్య ప్రశాంత చిత్తం,అహింసా తత్వం,పరస్పర సహవాసం,శాంతి జీవనం పెంపోందించేందుకు మతాలు పుట్టాయి.మతమంటే ఉన్న భక్తి,భయాలతో మానవుడు పాపాలు,దుర్మార్గాలు మానతాడని ఆశించారు.మతాలు మంచిమాటలు చెప్పినా మానవుల మధ్య ఈ ద్వేషభావం మాత్రం తగ్గలేదు.కొత్తగా మతాల మధ్య వైషమ్యాలు పెరిగి పరస్పర హననానికి దిగుతున్నారు.ఎంతో మంది సాధువులు,రుషులు,ముల్లాలు,ఫాస్టర్ లు మానవత్వానికి మించిన మతం లేదని పరస్పరం శాంతియుతంగా జీవించాలని ప్రభోధించినా ఫలితం రాలేదు. “మంచివిషయం వ్యాప్తి కావాలంటే సమయం పడుతుంది,అదే చెడువిషయం క్షణాల్లో వ్యాపిస్తుందనే” నానుడి నిజం చేస్తున్నారు ఈ తరం మానవులు.
మధ్యయుగంలో మనదేశం పైకి తురుష్కలు ఆఫ్ఘన్ ప్రాంతం నుంచి వచ్చి దాడులు ప్రారంభించారు.స్థానిక రాజుల అనైక్యతతో భారత్ లో వారు అడుగిడి తమ రాజ్యాలు స్థాపించారు.అప్పుడు జరిగిన యుద్ధాలలో ఊచకోతలు,మతమార్పిడిలు జరిగాయి.ఆ తరువాత భారత్ లో అడుగిడిన పోర్చుగీసు,ఫ్రెంచి, ఇంగ్లీష్ వారు తమ ఆధిపత్యం కోసం ఆనేక యుద్ధాలు చేసారు.స్థానిక రాజులు తమ అస్థిత్వం నిలుపుకునేందుకు చేసిన యుద్ధాలలో జననష్టం జరిగింది.1857 సిపాయిల తిరుగుబాటులో వేలాదిమంది భారతీయులు బ్రిటీష్ వారి దౌష్ట్యానికి నెలకొరిగారు.20 వ శతాబ్దం ప్రారంభంలో రష్యాలో లెనిన్ అధికారంలోకి రావడానికి జరిగిన తిరుగుబాటులో ఎంతోమంది చనిపోయారు.ఆ తరువాత స్ఠాలిన్ అధికారికంగా వేలాది మందిని కాంస్రంటేషన్ క్యాంపులకు తరలించి యమపురికి పంపారు.మొదటి ప్రపంచ యుద్ధంలో కోటిమంది పైగా బలయ్యారు.రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందే లక్షలాది యూదులను హిట్లర్ యమపురికి పంపాడు.యుద్ధం మొదలైన తరువాత ,జపాన్ పై అమెరికా అణుబాంబు వేసినప్పుడు కోటికి పైగా మృత్యువాత పడ్డారు.భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు మత ఘర్షణలు చెలరేగి లక్షలాది మంది ఊచకోత జరిగింది.కంబోడియా,వియత్నాం యుద్ధాలు, ఇరాన్,ఇరాక్ యుద్ధాలు,ఉత్తరకొరియా,దక్షిణకోరియా యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే దేశాల మధ్య ఎన్నో ఘర్ణణలు,హననాలు జరిగాయి.ఇజ్రాయెల్,పాలస్తీనా యుద్ధం దశాబ్దాలుగా నడుస్తున్నది.1992 వరకూ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ప్రాంతాలు అనంతరం విడిపోయి ఒకరిపై మరొకరు యుద్ధాలు చేసుకుంటూ పరస్పర హననం చేసుకుంటున్నాయి.మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వం ఆవిర్భావం నుంచి అనేక ఘర్షణలు,యుద్ధాలు జరిగాయి.వాటికి తోడు మహమ్మారులు మసూచి,ప్లేగు వంటివి వ్యాపించి లక్షలాదిమంది అసువులు బాసారు.వీటికి తోడు ప్రకృతి ప్రకోపానికి దేశాలు తుడిచిపెట్టుకుని పోయాయి. మానవుని స్వార్ధమే ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నది.ఆశ,బంధుప్రీతి,ఆధిపత్యం,స్వార్ధాలతో వినాశనానికి పాల్పడుతున్నాడు. శ్రీరాముడు ప్రజలను కన్న బిడ్డలు వలె పాలించాడని పుస్తకాలలో చదువుకున్నాం.కాని అంతకు ముందు లంకలో వేలాదిరాక్షసులను సంహరించాడు. అలా ఏ చరిత్ర చదివినా ఇదే పునరావృత్తం.కలియుగం చివరిదశలో ఉన్నామని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయినా మానవుడి బుద్ధిలో మార్పులేదు. కొత్తగా 80వ దశకం నుంచి ఉగ్రవాదం తల ఎత్తింది.ఫలితంగా అమాయకపు ప్రజలు బలవుతున్నారు.అంతర్జాతీయంగా ఉగ్రవాదం ఎన్నో అనర్ధాలు తెస్తున్నది.పాకిస్థాన్ వంటి దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చరిత్రలో ఎంతో మంది మహానుభావులు ప్రేమ,శాంతి,అహింసలతో సౌఖ్యం మానవ జీవితాల్లో వస్తాయని చెప్పారు. కాని మానవునికి ఈ బోధలు ఎక్కడంలేదు. బుద్దుని ,మహావీరుని, శంకరాచార్య బోధనలు,కన్ఫూషియస్,ఏసు,మహమ్మద్ ప్రబోధాలు మానవుని మార్చ లేకపోయాయి. అతని బుద్దిలో మార్పు వస్తేనే మానవవికాశం వస్తుంది.అప్పుడే సర్వేజనా సుఖినోభవంతు గా భూమండలం స్వర్గాన్ని తలపిస్తుంది.మరి ఆరోజు వస్తుందని ఆశించడం ఆశాభంగమేనా?

యం.వి.రామారావు,8074129668