హంసవాహనంపై వీణాపాణిగా శ్రీవారి దర్శనం
ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శనలు
తిరుమల : శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శనివారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణిjైు హంస వాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడని భక్తుల విశ్వాసం. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం రాత్రి హంస వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఐదు రాష్టాల్రకు చెందిన కళాకారులు 18 కళాబృందాలు 511 మంది కళాకారులు ప్రదర్శన లిచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, మహారాష్ట్ర కు చెందిన గీతా బృందం కథక్ నృత్యం ప్రదర్శించారు. కర్నాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ రాష్టాన్రికి చెందిన అజయ్ బృందం తప్ప నృత్యంతోను, బెంగళూరుకు చెందిన సుజేంద్ర బాబు బృందం దశావతారం రూపకంతోను అలరించారు. మహారాష్ట్రకు చెందిన నరేంద్ర బృందం బంగ్రా నృత్యంతోను, హైదరాబాద్ కు చెందిన అర్చన బృందం పద్మావతీ పరిణయంతోను, బెంగళూరు చెందిన అనన్య బృందం కాళింగమర్ధనం రూపకంతోను, బెంగళూరుకు చెందిన తరుణారెడ్డి బృందం మయూర నృత్యంతోను, కర్నాటకకు చెందిన విజయలక్ష్మి బృందం కురవంజి నృత్యం తోను, కర్నాటకకు చెందిన మహేష్ కూమార్ డొల్లుకునిత కళా విన్యాసంతోను, రాజస్థాన్ కు చెందిన రామ్ బృందం నౌవ్ట కళా విన్యాసంతోను, తమిళనాడుకు చెందిన ధరణి కశ్యప్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతోను, తిరుపతి పట్టణానికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం మోహినియాట్టంతోను, తూర్పు గోదావరి, హైదరాబాద్, తిరుపతికి చెందిన వీరవేణి, శివలక్ష్మీ, తులసీపద్మ, బృందాలు కోలాటాలతో అలరించారు.
