కన్నుల పండువగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

తెలంగాణ

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సృజన క్రాంతి/హైదరాబాద్‌ : చారిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారు జాము నుంచే మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి జాతరకు ప్రజలు తరలివచ్చారు. దేవాలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు.

సిఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. సిఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, సిఎం సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపి అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేశ్‌ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రార్థించారు.

తొలిబోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు..
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమయ్యే సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే మహా మంగళ హారతి ఇచ్చారు. అమ్మవారిని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు. దేవాలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 వరుసలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పొటెత్తుతున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. సాయంత్రం ఫలహారబండ్ల ఊరేగింపు అట్టహాసంగా ఊరేగింపులు జరిపారు. ఆలయ పరిసరాల్లో నగర పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారిని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి. పద్మా రావులు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మ వారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అలరించేందుకు ప్రత్యేక వేదికల ద్వారా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులతో కార్యక్రమాలతో ఉర్రతలూగించారు. జాతరలో సుమారు 2,500. మంచి పోలీసులు బందోబస్తు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, షీ టీమ్స్‌, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా 200 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాలలో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. జిహెచ్‌ఎంసి అధికారులు 24 గంటలు పారిశుద్ధ్య నిర్వహించారు. మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. జలమండలి ద్వారా మంచినీటి శిబిరాలు ఏర్పాటు చేసి, వాటర్‌బాటిళ్లు, మంచినీటి ప్యాకెట్లు అందచేశారు. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో డిఎం అండ్‌ హెచ్‌ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా శిబిరంలో వైద్యులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లను సిద్ధంగా పెట్టారు.