మాతభాష, మాతమూర్తి, మాతభూమి ఎన్నటికీ విస్మరించరానివి
ఆచార్యునిగా, కవయిత్రిగా, రచయిత్రిగా, వ్యాఖ్యాన కర్తగా, ప్రవచన కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న ఆచార్య వెలువోలు నాగరాజ్య లక్ష్మితో ఈవారం కరచాలనం.
మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి?
గుంటూరు జిల్లాలోని అమతలూరులో మా స్వగ్రామంలో పుట్టాను. అయితే మాది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోని కొత్తూరుకు వలస వెళ్ళిన కారణంగా నా బాల్యం అక్కడే గడిచింది. నా పాఠశాల విద్యాభ్యాసం మా ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో జరిగింది. రోజూ కాలినడకన వెళ్ళిరావడం చేశాను. అక్కడే ఓరియంటల్ కాలేజీలో భాషాప్రవీణ చదివాను. మా పూర్వీకులు స్వాతంత్య్ర సమర యోధులు కావడంతో నా హైస్కూల్, కాలేజీ చదువులు స్కాలర్షిప్‌తో సాగాయి. ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఎ తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, భాషా ప్రవీణ యూనివర్సిటీ ద్వితీయ ర్యాంకు సాధించాను. మా వూరిలో నేనే మొదటి ఉన్నతవిద్య అభ్యసించిన మహిళను.
మీకు తెలుగు భాషపై ఆసక్తి ఎలా కలిగింది?
మా తండ్రిగారు భాషా ప్రవీణ చదివారు. నాకు కూడా తెలుగంటే మంచి ఆసక్తి ఏర్పడింది. నేను 5వ తరగతిలో ఉండగా ఒకసారి తెలుగు డిక్టేషన్ పోటీలు పెడితే మెట్రిక్ విద్యార్ధులతో పోటీపడి ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నాను. హైస్కూల్ తర్వాత ఉద్యోగావకాశాలు కూడా బాగా ఉండడంతో నేను తెలుగు భాషా ప్రవీణ చదివాను. అప్పటి నుండి తెలుగు, సంస్కతం, సాహిత్య పట్ల అభిరుచి ఎక్కువైంది.
ప్రబంధ యుగంలో వచ్చిన ‘‘ప్రబంధాల్లోని అష్టాదశ వర్ణనలు’’ అనే అంశం పి.హెచ్.డి లో ఎంచుకోవడానికి కారణం?
భాషా ప్రవీణ, ఎం.ఎ తెలుగు చేసినవారికి పద్య సాహిత్యంపై పట్టు ఉండడం సహజమే కదా! అందువల్ల ప్రబంధ సాహిత్యంపై పరిశోధన చెయ్యమని మా పరిశోధక ఆచార్యులు లకంసాని చక్రధరరావు చెప్పడం వల్ల ఆ అంశం ఎంచుకొన్నాను.
వివిధ ప్రభుత్వ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
నా పిహెచ్.డి అయిన తర్వాత ఎ.పి.పి.ఎస్.సీ ద్వారా వ్రాత పరీక్ష ఇంటర్వ్యూలు నెగ్గి తెలుగు అధ్యాపకురాలిగా ప్రారంభించాను. ఎం.ఎ. సంస్కతం దూర విద్య ద్వారా చదివి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. నా విద్యాబోధన ద్వారా రీడర్, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ గా పదోన్నతులు పొందాను. గుంటూరు మహిళా కళాశాలలో సంస్కత శాఖాధిపతిగా ఉంటూ ప్రిన్సిపాల్ అయ్యాను. డిగ్రీ కళాశాలలు న్యాక్ ద్వారా మంచి గుర్తింపు లభించడం, తద్వారా ఆర్ధిక సహాయం యు.జీ.సీ ద్వారా జరుగుతుంది. ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్ విభాగాల ఇన్‌చార్జిగా రెండు సార్లు న్యాక్ పనులు పూర్తిచేసిన అనుభవం నాకున్నది. ప్రిన్సిపాల్ గా ఏమాత్రం వసతులు లేని రెండు కళాశాలలను న్యాక్‌ను ఎదుర్కొని యూ.జీ.సీ ద్వారా నిధులు పొందగలిగానన్న తప్తి నాకుంది. అధ్యాపకురాలిగా 2001లో రాష్ర్ట స్థాయి ఉత్తమ పురస్కారం, 2006లో ప్రతిభా పురస్కారం, 2012లో ఉత్తం సంస్కత అధ్యాపకురాలిగా ప్రభుత్వం వారి గుర్తింపు పొందాను. ఇవన్నీ అద్భుతమైన అనుభవాలే కదా!
అచార్యులుగా మీ క్రింద ఎంతమంది ఎం.ఫిల్., పిహెచ్.డీలు సాధించారు? ఆ వివరాలు?
ఇప్పటివరకూ 6 ఎం.ఫిల్., 4 పిహెచ్.డీలు నా పర్యవేక్షణలో విద్యార్ధులు సాధించారు. ఇంకా ఇద్దరు విద్యార్ధులు తమ పరిశోధనలను సమర్పించవలసి యున్నది. పరిశోధనలన్నీ కథలు, నవలలు, గజల్స్, ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం యిలా అన్ని అంశాల మీదా జరిగాయి.
మీ రచనలు క్లుప్తంగా చెప్పండి?
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉండగానే నా రచనా వ్యాసంగం ప్రారంభమయింది. ఆచార్య లకంసాని చక్రధరరావు గారు సంపాదకత్వం వహిస్తున్న తెలుగు వ్యుత్పత్తికోశం సహ సంపాదకత్వం వహించాను. రచనగా చూస్తే, వివిధ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమైన నా సాహిత్య వ్యాసాలు ‘‘చిగురు పొదలు’’ నా తొలి రచన. వచన కవితా సంపుటాలు-2, యూజీసీ వారి మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులు – 3, పద్యకావ్య వ్యాఖ్యానాలు – 8, ఇంకా కథలు వ్రాశాను, ప్రవచన కర్తగా పనిచేస్తున్నాను.
ఆధ్యాత్మిక రంగంలోకి పదవీ విరమణ తర్వాత ప్రవేశించారా?
తెలుగు సాహిత్యాధ్యనంతో పాటూ ఆధ్యాత్మికత కూడా సమాంతరంగానే సాగిందని చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలుగా వందల సంఖ్యలో నా ప్రవచనాలు సాగాయి.
మీ యూజీసి మైనర్ ప్రాజెక్టులో ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం అన్నారు. అదేమిటో వివరిస్తారా?
వ్యక్తిత్వ వికాసం పేరుతో కొంతమంది గురువులు శిక్షణలివ్వడం ప్రస్తుత కాలంలో జరుగుతున్నది. ఆ నేపధ్యంలో ఆధునిక కాలంలో వ్యక్తులు విజయం సాధించడానికి ఆయా కవులు ఇచ్చిన సందేశాలను విశ్లేషించి చెప్పడం. తుమ్మల మొదలైన కవులు చెప్పిన స్వయం కషి మొదలైన వ్యక్తిత్వ వికాస అంశాలతో కూడిన ప్రక్రియ.
తెలుగుతో బాటూ సంస్కతంలో కూడా సమాంతర కషి చేసినట్లున్నారు?
అవును. భాషా ప్రవీణలో తెలుగు భాషతో పాటూ సంస్కతం కూడ నన్ను ఎక్కువ ఆకర్షించింది. ఇవి రెండూ నాకు మానసికానందాన్ని కలిగించాయి. రఘువంశ కావ్యంపై అనేక ప్రసంగాలు చేశాను. తెలుగు, సంస్కతం అవకాశం ఉన్నంత వరకూ ఇతరులకు బోధిస్తున్నాను. ఆం.ప్ర రాష్ర్ట రచయితల ఉపాధ్యక్షురాలిగా, గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షురాలిగా పలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
ఈనాటి యువ గళాలకు/ కలాలకు మీ సందేశం/సలహాలు ఏమిటి?
ఈనాటి యువగళాలు అధ్యయనంపై అధికంగా ఆసక్తి చూపాలి. ప్రాచీన సాహిత్య పునాదులమీదే ఆధునిక సాహిత్యం వికసించిందని గుర్తెరగాలి. మన సంస్కతికి భాష దర్పణం. భాష నేర్చుకోవడం ముందు చాలా అవసరం. మాత భాష, మాతమూర్తి, మాతభూమి ఇవి ఎన్నటికీ విస్మరించరానివి. ఆ పునాదులే నేటి యువతకు స్ఫూర్తి, దీప్తి నిచ్చేవి.
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య
