మంత్రులైనా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందే
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ : వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద విూడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. వరదలతో పేదల బాధలు వర్ణణాతీతం. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వచ్చాయి. దీంతో వారందరికీ బాధ, భయం ఉంటుంది. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలి. అందుతున్న సహాయంపై ఐవీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నాం. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా. అధికారులకు రెండు రోజులుగా చెప్పాం.. ఇప్పుడు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. విూనమేషాలు లెక్కించడం సరికాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులూ ఒడ్డి సేవ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలి. ఏవిధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలి. ఆర్థికంగా, నిత్యావసరాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా ఏది వీలైతే అది విూ శక్తిమేర చేయాలి. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం. రెండు రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుంటే, మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు. వీఆర్‌లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించ లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దీనిపైనా విచారణ జరిపిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగింత మంచి ఉద్దేశంతో జరిగిందా? లేక ఓవర్ లుక్‌లో అయిందా? అనేది పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా? అని ప్రశ్నించారు. టోల్ ఫ్రీ నంబర్‌లు పనిచేయట్లేదనే ఫిర్యాదును అంగీకరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థ 5ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ పెట్టి వెంటనే సమస్య పరిష్కరిస్తానన్నారు. బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయని విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం విూడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీ వివరాలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు. 5 హెలీకాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందని సీఎంకు అధికారులు తెలిపారు. హెలికాప్టర్, పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని వివరించారు. 5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ చేశామని చంద్రబాబుకు అధికారులు తెలిపారు.100 శాతం ఆహారం పంపిణీ జరగాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా మూడు పూటలా ఆహారం అందించాలని తెలిపారు. 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. చెత్త రాజకీయాలు వద్దు. ఈ పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా? ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేపడతాం. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి. బాబాయ్‌నే చంపిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా! విపక్ష నేత ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు. ఆయన ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదు. ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు విూరున్నారు కదా.. భయం లేదని చెప్పారు. హుద్‌హుద్ సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు‘ అని చంద్రబాబు అన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు. ఆహారం అందుతుందా..? లేదా..? అని బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.
