పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరులో భారత్‌ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్లతో తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ సరికొత్త చరిత్రను లిఖించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ విజయానంతరం మాట్లాడిన నజ్ముల్ హుస్సేన్ షాంటో.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ’ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు. తమ ఆటతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మా పేసర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అందుకే ఈ సిరీస్‌లో మేం విజేతగా నిలిచాం. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయం కోసం నిజాయితీగా కష్టపడ్డారు. ఇదే జోరును కొనసాగిస్తారని ఆశిస్తున్నా. గాయంతో జాయ్ దూరమైనా.. షెడ్‌మన్ అద్భుతంగా ఆడాడు. జకీర్ కూడా అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో మాకు ఎన్నో సానుకూలంశాలు లభించాయి. మా తదుపరి సిరీస్ భారత్‌తో ఉంది. ఈ సిరీస్ మాకు ఎంతో ముఖ్యం. పాకిస్థాన్ గడ్డపై సాధించిన ఈ సిరీస్ విజయం ఎంతో ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. మా జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. మెహ్‌దీ హసన్, షకీబ్, ముష్ఫికర్‌లు ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌ను ఓడించడం పెద్ద కష్టం కాదు. జట్టులోనే ఆటగాళ్లు కూడా విజయంలో భాగమయ్యారు.’అని నజ్ముల్ హుస్సేన్ షాంటో చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్(110 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), షాన్ మసూద్(69 బంతుల్లో 2 ఫోర్లతో 57), సల్మాన్ అఘా(95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. మెహ్‌దీ హసన్(5/61) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. లిటన్ దాస్(138) సెంచరీతో.. మెహ్‌దీ హసన్ మీరాజ్(78) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్(6/90) ఆరు వికెట్లు తీయగా.. మిర్ హంజా, సల్మాన్ అఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
