చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

క్రీడలు

36 ఏళ్ల తర్వాత టీమిండియాపై విజయం!
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్‌ టెస్ట్‌ విజయాన్నందుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన న్యూజిలా్‌ండ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్‌ యంగ్‌(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్‌) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలా్‌ండ విజయంలో కీలక పాత్ర పోషించారు.
బుమ్రా ఒక్కడే..
భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు. ఈ ఓటమితో సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌ పంత్‌ పోరాటం వృథా అయ్యింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలా్‌ండ ఆధిక్యంలో నిలిచింది. అక్టోబర్‌ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్‌ 402 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. రచిన్‌ రవీంద్ర(134) సెంచరీతో సత్తా చాటగా.. డెవాన్‌ కాన్వే(91), టీమ్‌ సౌథీ(65) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్‌ దక్కింది.
సర్ఫరాజ్‌, పంత్‌ పోరాటం వృథా..
356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 462 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌(150) సెంచరీతో చెలరేగగా.. రిషభ్‌ పంత్‌(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. విరాట్‌ కోహ్లీ(70), రోహిత్‌ శర్మ(52) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. న్యూజిలా్‌ండ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, విలియమ్‌ ఓ రూర్కీ మూడేసి వికెట్లు తీయగా.. ఆజాజ్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటవ్వడం.. రెండో ఇన్నింగ్స్‌లో లోయరార్డర్‌ బ్యాటర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచాయి.