మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
యథాతథంగా గ్రూప్ పరీక్షల నిర్వహణ
న్యూఢిల్లీ : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా.. రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా.. హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మరికొద్ది గంటల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుత దశలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల వాయిదాకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించడంతో దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. 2011 తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ప్రతి షిప్ట్‌లో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించారు.