రంగుల రంగవల్లి శతవసంతాల మన ‘కొండపల్లి’

సాహిత్యం

అతడు కుంచె పట్టుకోగానే ఆకాశం వంగి భూమిని ముద్దాడుతుంది. కుంచె కదిలిస్తే చాలు! సప్తవర్ణాల ఇంద్రధనుస్సు కాన్వాసుపై రంగుల రంగవల్లికలు దిద్దుతుంది. అతడు తెలుగు చిత్రకళా ప్రపంచపు వెలుగు రేఖ. తమ విలక్షణ దృష్టితో, వినూత్న సృష్టితో చిత్రకళకు పరిపూర్ణత్వాన్నిచ్చిన చిత్రకళాతపస్వి డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావుగారు. మాట్లాడినట్లుగా చిత్రాలు గీయడం, గీసిన చిత్రాలతో మాట్లాడించడం కొండపల్లి వారి కుంచెకే సాధ్యం. తెలుగునాట సంప్రదాయ చిత్రకళకు విజ్ఞాన సర్వస్వంలా భాసిల్లిన శేషగిరిరావు గారి శతజయంతి సందర్భంగా చిత్రకళాభిమానులంతా ఆ మహనీయ మూర్తిని మనసారా స్మరించుకుంటున్నారు. ఈ నెల మొదటి వారంలో,కుటుంబ సభ్యులు అఖండభక్తి గౌరవాలతో హైదరాబాద్‌ మాదాపూర్‌ లోని ఆర్ట్‌ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి, చూపరులకు కనువిందు చేసారు.

కొండపల్లి వారి రంగుల మేళవింపులో ఓ ప్రత్యేకత వుంది. సంప్రదాయ చిత్రకళకు సరికొత్త నిగారింపును, నిండుదనాన్ని తీసుకొచ్చారు. వారి చిత్రాల్లో ప్రకృతి సౌందర్యోపాసన ప్రాణదీపమై వెలుగుతుంటుంది. ఏ దృశ్యాన్నైనా తమ చూపుల ‘ఫ్రేమ్‌’ లో బంధించి, కళాత్మకతతో కాంతులీనేలా చేయగల నైపుణ్యం కొండపల్లి వారికి కుంచెతో పెట్టిన విద్య. చెట్టు మీద పక్షినో, ఇంటి ముందు కుక్కనో, ఆరుబయట గుర్రాన్నో, పులినో, సింహాన్నో బొమ్మగా గీసి, మనల్ని వాస్తవంగా భ్రమింపజేయగల రేఖామాంత్రికులు శేషగిరి రావు గారు.

శేషగిరిరావు గారు 1924 జనవరి 27న తెలంగాణ రాష్ట్రంలోని పెనుకొండలో జన్మించారు. తాత, తండ్రులెవరూ చిత్రకారులు కారు. చిత్రకళా ప్రావీణ్యం కొండపల్లి వారికి స్వతహాగా అబ్బిన విద్య. నాటి నిజాం ప్రభువు కొలువులో మంత్రి నవాజ్‌ జంగ్‌ ఆత్మీయ ప్రోత్సాహంతో పెనుగొండను వదలి హైదరాబాద్‌ చేరారు. విఖ్యాత కవి రవీంద్రుని శాంతినికేతనంలో ప్రముఖ చిత్రకారులు నందలాల్‌ బోస్‌, దేవీ ప్రసాద్‌ రాయ్‌ చౌదురిల వద్ద చిత్రకళలో మెళకువలు గ్రహించారు. అనంతరం హైదరాబాద్‌ జె.ఎన్‌.టి.యు. ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో అధ్యాపకులుగా చేరి, వందలాది మంది శిష్యుల్ని చిత్రకళా రంగంలో దిద్ది తీర్చారు. వారిలో ప్రఖ్యాత చిత్రకారులు ఉల్చి (కృష్ణమూర్తి) గారొకరు.

_____________

లలిత కళల్లో.. కవిత్వం తర్వాత కదిలించే శక్తి చిత్రకళకే వుంది. ఊహలకు అక్షరాకృతినిస్తే కవిత్వమవుతుంది. నాదాకృతినిస్తే సంగీతమవుతుంది. ఉలితో స్పర్శిస్తే శిల్పమవుతుంది. రేఖాకృతినిస్తే చిత్రలేఖనం అవుతుంది. కవిత్వంలాగే చిత్రలేఖనం కూడ ఓ తపస్సు. నిరంతర సాధన. చిత్రకారుని నిశ్చల దృష్టి నుండి రసమయ చిత్రం ఊపిరి పోసుకుంటుంది. కవి రసానుభూతిలో ఓలలాడి పదసృష్టి చేసినట్లే చిత్రకారుడు తన్మయత్వంతో ఓ కళాకృతిని సృష్టిస్తాడు. కొండపల్లి చిత్రాలన్నీ కాలానుగుణమైన వారి పరిణత దృక్పథానికి సమన్వయాత్మకతకు, సాధు హృదయానికి సంకేతాలు.

__________________

తెలుగు చిత్రకళకు నడకలు నేర్పిన చిత్రకారుల్లో కొండపల్లి వారొకరు. వారు చిత్రకళలో ఎన్నో ప్రయోగాలు చేశారు. సంప్రదాయ తైలవర్ణ చిత్రాలతో పాటు, ఆక్వాటెక్స్‌చర్‌, పెన్సిల్‌ స్కెచ్‌, వాటర్‌ పెయింటింగులు, దక్కన్‌, పాశ్చాత్య చిత్రకళా రీతుల్లో రసమయ చిత్రాలు సృష్టించారు. అజంతా, ఎల్లోరా, రామప్ప, లేపాక్షి వంటి చారిత్రక ప్రదేశాల్లో పర్యటించి, అనేక శిల్ప చిత్రకళాకృతులకు జీవం పోశారు. సజీవ శిల్పకళ ఉట్టిపడే చిత్రాలను కుంచె గీతల్లో సృజించారు. ‘రాణీ రుద్రమ’ చిత్రం.. రాజసంతో మనల్ని పలకరిస్తుంది. ఝాన్సీరాణి వీర రసస్ఫూర్తినిస్తుంది. ‘వరూధినీ – ప్రవరాఖ్యం’ విశేషంగా ఆకర్షిస్తుంది. అందం, భక్తి భావం ప్రశాంతత, తాత్త్వికత ఉట్టిపడే ‘పోతన’ చిత్రం పాఠ్యగ్రంథాల్లో విద్యార్థుల మనసులపై, నివాస గృహాల్లో ‘ఫ్రేమ్‌’ గా మారి గృహస్థుల గుండెల్లో నిలిచిపోయింది.

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి వారు గీసిన ‘తెలుగు తల్లి’ చిత్రం శాశ్వత నమూనాగా భాసిస్తుంది. కొండపల్లి వారి తెలుగు తల్లి చిత్రానికి ప్రతిబింబంగా ముఖ్యమంత్రి యన్.టి.రామారావు తెలుగు తల్లి విగ్రహాన్ని హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రతిష్ఠింపచేశారు. మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ చదివి, తన ఊహల్లోకి తర్జుమా చేసుకుని శాకుంతలాన్ని రంగుల సజీవ చిత్రమాలికగా శేషగిరి రావు గారు సృష్టించిన తీరు నాన్యతో దర్శనీయం.

భారత, భాగవత, రామాయణాలను క్షుణ్ణంగా చదివి, వాటిలోని ప్రధాన ఘట్టాలను అద్భుత చిత్రాలుగా కాన్వాసుపై గీశారు. వాటిలో ‘గుహుడు’ రామలక్ష్మణులను నదిని దాటించే దృశ్యం కమనీయం. రమణీయం కూడ! తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో వున్న కొండలు, గుట్టలు, ప్రకృతి అందాలు శేషగిరిరావు గారి కుంచెలో జీవం పోసుకుని సజీవాకృతులుగా మిలిగి పోయాయి. రంగులే బొమ్మలుగా మారాయో? బొమ్మలే రంగుల్లో కలిసిపోయి పలకరిస్తున్నాయో? అన్నంతగా చిత్రకళలోని బాహ్య, ఆత్మసౌందర్యాన్ని చిత్రకళలో నింపి, “కొండపల్లి శైలి” గా గుర్తింపు పొందిన ‘రంగుల రసతపస్వి’ శేషగిరిరావు గారు. తెలుగు చిత్ర కళను అంతర్జాతీయ వేదికలపై సగౌరవంగా ఆవిష్కరించిన చిత్రకారుల్లో కొండపల్లి వారు ఒకరు కావడం తెలుగు వారికి గర్వకారణం. శేషగిరి రావు గారి చిత్రాలు అమెరికా, లండన్‌, రష్యా, ఇటలీ దేశాల్లో జరిగిన చిత్రకళా ప్రదర్శనల్లో ప్రదర్శింపబడి ప్రశంసలందుకున్నాయి.

సూక్ష్మ చిత్రకళను ఇష్టపడే పాశ్చాత్యులు కొండపల్లి వారి రంగుల ప్రపంచాన్ని చూచి ముగ్ధులయ్యారు. వాషింగ్టన్‌ లోని భారత రాయబారి కార్యాలయంలో, పిట్స్‌బర్గ్‌ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మన కొండపల్లి వారి చిత్రాలు ఒకప్పుడు కొలువు తీరాయి. కుంచెకు కళా సౌరభాన్ని అద్దిన కొండపల్లి శేషగిరిరావు గారి సంతకం చిత్రకళా రంగంలో చిరాయువుతో నిలిచింది.

ఒకానొక రసదృష్టితో యోగిలా, 70 సంత్సరాలకు పైగా జీవితాన్ని చిత్రకళకే అంకితం చేసిన కొండపల్లివారిని ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. సంస్థలు పురస్కారాలతో పూజించాయి. చిత్రకళాభిమానులు గురువుగా సంభావించి గుండెల్లో నిలుపుకున్నారు. 1988లో కేంద్ర మానవవనరుల శాఖ లలితకళల విభాగంలో ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ ఫెలోషిప్‌ తో గౌరవించింది. ఆలిండియా ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ శాశ్వత సభ్యత్వంతో సత్కరించింది. 1994లో అప్పటి ప్రధాని పి.వి. స్వయంగా సత్కరించి, ‘తెలంగాణ గడ్డ ముద్దుబిడ్డ’ గా అభివర్ణించారు. 1996లో తెలుగు యూనివర్సిటీ ‘గౌరవ డాక్టరేట్‌’ తో సన్మానించింది.

మా గురుదేవులు ప్రఖ్యాత కవి డా. నాగభైరవ కోటేశ్వరరావు గారు ‘కొండపల్లి వారిని డాక్టర్‌ కొండపల్లిగా గౌరవించకపోతే లలితకళల వికాసం కోసం ఆవిర్భవించిన తెలుగు విశ్వవిద్యాలయానికి పరువు చేటు’ అని పాలకమండలి మీటింగులో శేషగిరి రావు గారి పేరును ప్రతిపాదించారు. పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

_______________

కొండపల్లి వారు తమ సుదీర్ఘ చిత్రకళా రంగ అనుభవాలను వివిధ పత్రికల్లో వ్యాసాలుగా ప్రచురించారు. ఆంధ్ర ప్రదేశ్‌ చిత్రకళ, తెలంగాణ చిత్రకళా రామణీయకత వంటి విలువైన గ్రంథాలు రాశారు. వారు స్వీయచరిత్ర రాసివుంటే భవిష్యత్‌ చిత్రకారులకు ఓ నిఘంటువులా ఉపయోగపడేది.
_________________

“తెలుగు వారి జీవితం నుండి లాలిత్యం, సౌందర్యదృష్టి అదృశ్యమై పోతుంది”- అని ఓ సందర్భంలో ఆవేదన చెందారు.

“వ్యక్తి హృదయంలో రసానుభూతి మేల్కొనకపోతే, నేత్రాల్లో రసదృష్టి వికసించకపోతే సౌందర్యాస్వాదన కనుమరుగవుతుంది. మానవుడిలో సౌందర్యదృష్టి కొరవడినపుడు ఎంత సంపన్నుడైనా నిరుపేద కిందే లెక్క” – అని ఓ వ్యాసంలో వ్యాఖ్యానించారు.

“మనం శాస్త్ర, వైజ్ఞానిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా, లౌకిక దృష్టి లేనపుడు రసస్పందన లేని శుష్క యంత్రంగా మారిపోతాం” – అని ప్రస్తుత మానవ జీవితంలోని లోపాన్ని ఎత్తి చూపారు.

“హృదయానికీ, బుద్ధికీ, అనుభూతికీ, ఆలోచనలకీ, అనుభవాలకీ ఒక సమన్వయాత్మక దృక్పథాన్ని అలవరుచుకోని మానవ జీవితం వ్యర్థం” అని కొండపల్లి వారు ప్రకాశం జిల్లా చీరాలలోని “ఉల్చి ఆర్ట్‌ గ్యాలరీ” ప్రారంభ సభలో నిష్కర్షగా చెప్పడం వెనుక వారి కళాత్మక దృష్టి వేయిరేకులుగా విప్పారిన పద్మంలా భాసిస్తుంది.

మహాకవి డా.దాశరథి “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటే మన కొండపల్లి వారు “నా కుంచియ రసరేఖల్లో మురిసే రంగుల రాగరాగిణి”- అన్నారు.

“సరస రేఖాచిత్ర సాహిత్యమును గూర్చిన నీదు కుంచియకు అభివాదమయ్యా!” అని దాశరథి గారు ఆత్మీయంగా అక్షర సుమాంజలి సమర్పించారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ, వట్టికోట ఆళ్వారు స్వామి, కమ్యూనిస్టు నేత పెండ్యాల రాఘవరావు వంటి సుప్రసిద్ధుల సాన్నిహిత్యం, సాంగత్యం వారికుంది. గాంధేయవాదిగా, సౌమ్యునిగా, సహృదయ కళాహృదయునిగా జీవితాన్ని పరిపూర్ణంగా పండించుకున్న స్వీయ చిత్రకళా సామ్రాజ్య స్రష్ట శేషగిరిరావు గారు.

చిత్రకళాభిమానుల అభిరుచిని రూపరుచిగా మార్చి వందలాది చిత్రాలతో చిత్రకళా రంగాన్ని సుసంపన్నం చేసిన కొండపల్లి శేషగిరిరావు గారు నిబద్ధత వున్న రసబద్ధ చిత్రకారులు. 2012 జూలై 26న తమ బంగారు కుంచెను, రమణీయ చిత్రాలను తరగని కళాసంపదగా మనకు మిగిల్చి అస్తమించారు ఆ తేజోమూర్తి. జాతీయ చిత్రకారుడిగా గుర్తింపు పొంది, అంతర్జాతీయంగా మన చిత్రకళకు వన్నె, వాసి తెచ్చిన కొండపల్లి వారికి నిండు మనసుతో శతజయంతి నివాళి.

(డా.కొండపల్లి శేషగిరి రావు గారి శతజయంతి పూర్తి వేడుకల సందర్భంగా)

 

 

– డా. బీరం సుందరరావు,

63034 43302