దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమవుతోంది. పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉంది… అందుకే రైతులు భయపడుతున్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారు.
– రాహుల్ గాంధీ
భయం గుప్పిట్లో అన్ని రంగాల ప్రజలు
అగ్నివీర్‌లను మోసం చేస్తోన్న ప్రభుత్వం
ఓ ఇద్దరి ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోదీ
బడ్జెట్ ప్రసంగంలో రాహుల్ ఘాటు విమర్శలు
తిప్పికొట్టిన ఎంపీలు, మంత్రులు
న్యూఢల్లీ : లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతు న్నాయి.బడ్జెట్ పై ప్రసంగం వేళ విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రి స్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించడం ఇందుకు కారణమయ్యింది. వ్యాపారవేత్తల పేర్లను ప్రస్తావించడంపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల వాదనలతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజిజు.. రాహుల్‌కు సభానియమాలు తెలియ వంటూ విమర్శించారు. అందుకు బదులిచ్చిన రాహుల్.. అధికార పక్ష నేతల వ్యవహారశైలికి అనుగుణంగా స్పందిస్తామ న్నారు. గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. చక్రవ్యూహం ద్వారా ఈ భయం వ్యాపిస్తోందన్న రాహుల్.. భాజపా ఎంపీలతో సహా రైతులు, కార్మికులు, ప్రతి ఒక్కరూ అందులో చిక్కుకుంటున్నారని అన్నారు. అగ్నివీర్‌లను కేంద్రం మోసం చేస్తోందన్న రాహుల్.. వీరి పింఛను కోసం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేసినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హావిూ లభించలేదన్నారు. వేల సంవత్సరాల క్రితం హరియాణాలోని కురుక్షేత్రలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించి హత మార్చారు. చక్రవ్యూహంలో హింస, భయం ఉంటాయి. అభిమన్యుడు అందులో చిక్కుకొని బలైపోయాడు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే.. కుల గణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 బడ్జెట్ మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతికి ద్రోహం చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించి, మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఆధునిక చక్రవ్యూహాన్ని నిర్మించిందని.. అందులో రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి వారు, సమాజంలోని ఇతర వర్గాలు చిక్కుకొని ఉన్నారన్నారు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధించడంతో.. మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వర్గాలను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రులతో పాటు నేతలు సైతం భయపెడుతున్నారని.. దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమవుతోందని అన్నారు. పలు రకాల ట్యాక్సుల పేర్లతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుందని.. బీజేపీ గుర్తుని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు. పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, అందుకే రైతులు భయపడుతున్నారని అన్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రంలోని ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే ఉందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఒకవైపు పేపర్ లీక్, మరోవైపు నిరుద్యోగ చక్రబంధంలో దేశం ఉందని.. ఇంటర్న్‌షిప్ వల్ల యువతకు ఒరిగేదేవిూ లేదని పేర్కొన్నారు. కాళ్లు విరగ్గొట్టి.. విూద బ్లాంకెట్ వేసినట్లు ఉందంటూ తూర్పారపట్టారు. అగ్నివీర్‌ల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, మధ్యతరగతిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతులు చాలాకాలం నుంచి అడుగుతున్నారని.. కానీ బ్జడెట్‌లో దాని ప్రస్తావనే లేదని నిప్పులు చెరిగారు. ఇదిలావుండగా.. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు స్పీకర్ ఓంబిర్లా కలగజేసుకొని అభ్యంతరం తెలిపారు. ఒకరు ప్రసంగిస్తున్నప్పుడు ఇలా అడ్డుతగలడం సబబు కాదని.. సభా మర్యాదలను పాటించాలని కోరారు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ’అగ్నిపథ్’ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాట్టు తెలిపారు. మరోవైపు బ్జడెట్‌పైనా విపక్ష నేత అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇస్తారని అన్నారు. ‘దేశ సరిహద్దు రక్షణలో జవాన్లు నిమగ్నమై ఉంటారు. జాతీయ భద్రతకు సంబంధించి సున్నితమైన అంశమిది. అగ్నివీర్ సమస్యపై దేశాన్ని తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ అవకాశం ఇచ్చినప్పుడు ఓ ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నా‘ అని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంశాన్ని రాహుల్ గాంధీ మరోసారి లేవనెత్తారు. అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని రక్షణశాఖ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. అయితే, ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని, అది కేవలం ఇన్సూరెన్స్ మాత్రమేనని స్పష్టం చేశారు.