పద్యాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి

కవితో కరచాలనం

గొప్ప కావ్యాలు సృజించబడుతాయా ? అన్నది చర్చనీయాంశం.

తెలుగులో గజళ్ళు అని నేడు చెలామణి అయ్యేవి నిజముగా పారసీక ఉర్దూ ఛందస్సులను అనుసరించలేదు.

జెజ్జాల కృష్ణమోహన్‌ రావు ఆంధ్రుడు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు. విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రజ్ఞుడైనా తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం వంటి భాషల ఛందస్సులలో నిష్ణాతుడు. ఛందస్సుపై అనేక వేల వ్యాసాలను వ్రాసిన భాషావేత్త. ఈవారం జె.కె.మోహనరావుతో కరచాలనం.
మీ బాల్యం, విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి.
నేను నెల్లూరులో అమెరికన్‌ ఆస్పత్రిలో పుట్టాను. మానాన్నగారు శ్రీనరసింగరావు కోర్టులో పని చేసేవారు. మేము అప్పుడు బృందావనములో ఉండే వాళ్లము. మా నాన్నగారి పదవీవిరమణము పిదప మేము మద్రాసులో స్థిరపడినాము. నేను శ్రీకన్యకాపరమేశ్వరీ దేవస్థానము బాలకోన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి., చదివాను. నాకు వయస్సు తక్కువైనందువలన మదరాసు వదలి తిరుపతిలో ఎం.ఎస్సీ., వఱకు చదివినాను. ఒక మూడు సంవత్సరాలు కోయంబత్తూరులో ఉద్యోగంచేసి మళ్లీ ఐ.ఐ.ఎస్‌.సీ., బెంగుళూరులో పిహెచ్‌.డీ పట్టా పొంది, మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయములో తొమ్మిది ఏండ్లు పనిచేసి, 1980 లో అమెరికాకు చేరి ఇక్కడే స్థిరపడ్డాము. ఇక్కడ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రజ్ఞుడిగా పనిచేశాను.
శాస్త్రజ్ఞుడిగా వున్న మీకు ఛందస్సు పై ఆసక్తి ఎలా కలిగింది? తెలుగులోనే కాకుండా ఛందస్సు విషయంలో వివిధ భాషల్లో ప్రావీణ్యం ఎలా సాధించారు?
నేను పాఠశాలలో చదివేటప్పుడు మాకు తెలుగు గురువులు సర్వశ్రీ వేదం వేంకటకృష్ణశర్మ, కాలకంధరం సంజీవరాయశర్మ, కోట సత్యరంగయ్యశాస్త్రి గార్ల చలువవలన నాకు తెలుగులో ఆసక్తి కలిగినది. తిరుపతిలో శ్రీ మొఱ్ఱం చంద్రశేఖరరెడ్డి, శ్రీ సాధన వీరాస్వామినాయుడు మాకు ఇంటర్మీడియేట్‌ (ఎఫ్‌.ఏ.,) లో తెలుగు బోధించారు. పాఠశాలలో ఉన్నప్పుడే లక్షణగ్రంథము సులక్షణసారము కొని చదివాను. కళాశాలలో పద్యరచన పోటీలలో బహుమతులు వచ్చినవి. తర్వాతి కాలంలో ఆంగ్లములో కూడ పద్యాలు వ్రాసేవాణ్ణి. కోయంబత్తూరులో ఉన్నప్పుడు మలయాళము నేర్చుకొన్నాను. మాతృభాష కన్నడము బాగుగ తెలుసు. హిందీ చిత్రాలు చూచి పాటలు విని హిందీ నేర్చుకొన్నాను. అమెరికాలో ‘‘తెలుగు సాహిత్యము’’ అని ఒక కూటమి అంతర్జాలములో గత శతాబ్ది 90వ దశకంలో ఉండేది. చాల గొప్ప కవులు పండితులు (సర్వశ్రీ వేల్చేరు నారాయణరావు, వేలూరి వెంకటేశ్వరరావు, మున్నగువారు) అందులోని చర్చలలో పాల్గొనేవారు. కవిత్వములో చాల విషయాలు అక్కడ తెలిసినవి. ఇదే సమయములో ‘మిలియన్‌ బుక్‌ ప్రాజెక్ట్‌’ అనే ఒక ఉద్యమము 2000 కాలములో వచ్చినది. ఇందులో భారతదేశములో డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా కూడ ఒక భాగస్వామి. పుస్తకాలను స్క్యాన్‌ చేసి అందఱికి అందుబాటులో పెట్టడమే దీని ముఖ్యోద్దేశము. ఎన్నియో ఛందోగ్రంథములు అక్కడినుండి దిగుమతి చేసికొని చదివాను. తెలుగు కన్నడ భాషల ఛందస్సుకు ఎన్నియో పోలికలు ఉన్నాయి. అప్పుడే ఛందోంబుధివంటి పుస్తకాల ద్వారా వాటిని తెలిసికొన్నాను. ఇప్పుడు నాదగ్గర ఉన్నన్ని ఛందస్సు పుస్తకాలు చాల గ్రంథాలయాలలో కూడ ఉండవు.

గడచిన పాతికేండ్లలో సంస్కృత, ప్రాకృత, హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, పారసీక, ఉర్దూ భాషల ఛందస్సును అభ్యసించినాను. అంతే కాక ఛందస్సులోని గణితశాస్త్రపు అంశములు శాస్త్రజ్ఞునిగా నన్ను ఆకర్షించినవి. దీని ఫలితమే ఉపగణముల గణితాంశములను, వాటి మేరు నిర్మాణపు కిటుకులను కనుగొన్నాను. తమిళ ఛందస్సులోని గణములకన్నిటికి గురులఘువుల స్వరూపము, ద్రావిడ భాష ఛందస్సులలోని భిన్నత్వములో ఏకత్వము, మున్నగు ఎన్నియో విషయములపై ‘‘ఈమాట’’ అంతర్జాల పత్రికలో వ్యాసములను వ్రాసినాను. అట్టి వ్యాసములు సుమారు వందకుపైగా ఉన్నాయి.
అంతేకాక మరో ముఖ్య విషయం ఏమిటంటే… తెలుగులో ‘‘గజల్‌’’ అని నేడు చెలామణి అయ్యేవి నిజముగా పారసీక ఉర్దూ ఛందస్సులను అనుసరించ లేదు. మాత్రాఛందస్సు ఎప్పుడు ‘‘గజల్‌’’ కానేరదు. 60 సంవత్సరాలుగా ఈప్రక్రియ తెలుగులో పెడదారిలో నడుస్తుందని నాఉద్దేశము.
ఇప్పుడొస్తున్న ఆధునిక కవిత్వమంతా ఏదో ఒక ఛందస్సుకు లోబడే ఉందన్న అభిప్రాయంతో ఏకీభవిస్తారా?
ప్రస్తుతము వచన కవిత్వమునకు ప్రాధాన్యత ఎక్కువ తెలుగులో. అవి కాక మాత్రాఛందస్సుపైన ఆధారపడిన గేయములను కూడ వ్రాస్తున్నారు కొందఱు కవులు. అంతమాత్రాన పురాతన ఛందస్సుపైన ఆధారపడిన పద్యాలు లేవని చెప్పలేము. ముఖపుస్తకములో ‘‘ఛందస్సు కూటమి’’లో పదివేలకు పైన సభ్యులు ఉన్నారు. ప్రతిరోజు అందులో వృత్తములలో, జాత్యుపజాతులలో పద్యములను వ్రాస్తున్నారు.
మళ్ళీ పద్యానికి మంచి కాలం వచ్చినట్టుంది?
నా ఉద్దేశములో పద్యములను చదివేవారు తక్కువే. దీనికి కారణము పద్యములను సరిగా వ్రాయాలంటే ఛందస్సు, వ్యాకరణము, అలంకారము, ఇత్యాదులలో కొద్దిగానైన నైపుణ్యమును సాధించాలి. దానికి పఠనము, అభ్యాసము అవసరము. అట్టి సమయము చాల తక్కువ జనులకు. వారి సమయము ఉద్యోగములకు, సంసార బాధ్యతలకు సరిపోతుంది. మిగిలినది తక్కువే కదా ఇట్టి పనులకు?
అవధానులు చెప్పే పద్యాలు గణాలకు సరిపోవచ్చేమో గానీ నాణ్యమైన పద్యాలు అవధానాల్లో రావని కొంత మంది అనడం సబబేనా?
అవధానము నాఉద్దేశములో ఒక వినోడక్రీడ (ఎంటర్‌టైన్‌మెంట్‌) లాంటిది. కొన్ని మంచి పద్యములు అందులో కూడ ఉన్నాయి. ఈ విషయంలో అవధాని ధారణాశక్తిని మెచ్చుకోవాలి. కాని అవధానము కావ్యములకు దారి తీయదు. అది ఒక సైడ్‌ ట్రాక్‌ మాత్రమే.
పద్యం విషయంలో మీరు ఇంకా చేయాలనుకున్నదేమైనా మిగిలి ఉందంటారా?
నేను సుమారు 1000 పైన ఛందములలో పద్యములను వ్రాసియున్నాను. ఎన్నియో క్రొత్త ఛందములను కల్పించినాను. సార్థకనామ గణాక్షర వృత్తములు కూడ అందులో గలవు. గతి గర్భ కవిత్వము నేను కల్పించిన ఒక నూతన ప్రక్రియ. ఇందులో ఒకే గురు లఘువుల అమరికలో భిన్నమైన గతులను చూపునట్లు పద్యములను వ్రాయుట. అనగా తాళము మారుతుంది. పద్యములు రెండు విధములు. ఒకటి చదువుకొనుటకు, అనగా భారతము, రామాయణము, ప్రబంధములు, ఇత్యాదులు. మఱియొకటి పాడుకొనుటకు. ఏపద్యమునైనను ఏరాగములోనైనను పాడుకొనవచ్చును. కాని అవి అన్నియు తాళబద్ధముగా నుండవు. నేను ఇక్కడ చెప్పేదీ తాళబద్ధముగా పాడుకొనుటకు వ్రాయబడిన పద్యములు, ఛందములు. సంగీతము ఉన్నందువలన ఇవి నాలుగు కాలాల పాటు ఉంటాయని నానమ్మకము. తమిళములోని తేవారం, తిరుప్పుగఱ్‌ ఇట్టివే. తిరుప్పుగఱ్‌ లోని, అట్టివే మఱికొన్ని వర్ణచ్ఛందములను సుమారు వంద వరకూ నేను వ్రాశాను. పద్యము, వాటి లయ, వాటి గతి ఇవి నాకు గొప్ప ఆకర్షణ. ఇట్టివి కొన్ని ఇతర భాషలలో కూడ ఉన్నాయి. వాటిని ఎన్నియో తెలుగులో నేను ప్రవేశము పెట్టినాను. దీనికి ఆది ఉన్నది కాని అంతము లేదు. నిరంతర పరిశ్రమ మాత్రమే! నేను గత పాతిక సంవత్సరాలుగా ఎంతయో కృషి చేసినాను. కాని నేను ఎక్కువగా ప్రచురించలేదు, వ్యాసములు తప్ప. నాదగ్గర ఉండే విషయములతో పది పుస్తకాలైనా ప్రచురించ వీలగును. కాని నాకు వయస్సు మళ్ళినది. ఇది ఒక్కడే చేసే పని కాదు. నామాతృభాష కన్నడము. ఎవరో ఒకరిద్దరు తప్ప తెలుగులో మాట్లాడేవారు కూడ లేరు నాకు! చూద్దాము భగవదేచ్ఛ ఎలాగుంటుందో!
పద్యం భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
పద్యాలు ఉంటాయి. కాని గొప్ప కావ్యాలు సృజించబడుతాయా? అన్నది చర్చనీయము. నాఉద్దేశములో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వము ఇందులో పాల్గొనాలి. ముందు ధృవ పత్రమును ధ్రువ పత్రముగా మార్చాలి! తెలుగు భాష సంపద యక్షగానములు. కాని వాగ్దానం, మల్లీశ్వరి చిత్రాలలోని యక్షగానాలు తప్ప మిగిలినవి ఎందఱికి ఎఱుక? తేవారము తిరుప్పుగఱ్‌ లోని అన్ని పాటలకు ధ్వని ముద్రికలు అక్కడే లభ్యము. తెలుగు కీర్తనలకు ఉన్నాయా? ఇది ఆలోచించవలసిన విషయం. ఇలాంటి ఉద్యమాలు కొనసాగాలంటే అంకితులైన వ్యక్తులు కావాలి. విశ్వవిద్యాలయాలలో ‘‘వేసవి శిబిరాలు’’ ప్రారంభించి నవయువకులను, యువతులను సాహిత్యములో పద్యరచనలో ప్రోత్సాహపఱచవచ్చును. – డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)