కవితో కరచాలనం
భారత అత్యున్నత న్యాయస్థానంలో గెజిటెడ్ అధికారిగా పదవీ విరమణ పొంది అనువాదకులుగా ప్రసిద్ధి చెందిన ఆర్ ఎస్ వేంకటేశ్వరన్ తో ఈ వారం కరచాలనం..
మీ జీవన రేఖలు వివరించండి?
మాతృభాష తమిళమై కేరళలో పుట్టినా, బాల్యం నుంచి పదవతరగతి వరకు బరంపురంలో (ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లా) తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను.
తరువాత బి.ఎ (ఆనర్స్) కాలేజీలో ఆంగ్ల మాధ్యమంలో చదివినా, తెలుగు ఒక సబ్జెక్టుగా చదివాను. తరువాత ఢిల్లీలో 1984 నుంచి 2021 (అక్టోబరు) వరకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఉద్యోగం చేసి గెజిటెడ్ ఆఫీసరుగా పదవీ విరమణ పొందాను. ప్రస్తుత నివాసం బెంగుళూరు.
సాహిత్యం పట్ల అభిరుచి, ప్రవేశంకు ప్రేరణ ఎవరు?
చేతికి దొరికిన పత్రిక, పుస్తకం చదువుతున్న రోజులలో సాహిత్యం అంటే ఏమిటి? ఏం చదవాలి? ఎందుకు చదవాలి అని నా చదివే అభిరుచిని మంచి సాహిత్యం వైపు మళ్ళించినది బరంపురంలో సాహిత్య సాంస్కృతిక సంస్థ అయిన ‘వికాసం’. నా అదృష్టం కొద్దీ నాకు వుప్పల లక్ష్మణరావు వంటి సాహితీ మేరువు, గురువుగా దొరికారు.
ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది?
ఏ భాషలోనూ ప్రావీణ్యం ఉందని చెప్పలేను ఎందుకంటే ఏ భాషైనా మహాసముద్రం వంటిిది. కానీ తెలుగు, హిందీ భాషలు వచ్చు. ఆంగ్లం సరేసరి. కానీ పుస్తకాలు మూడు భాషలలోనూ చదువుతాను. అయిదారు భాషలు అనర్గళంగా మాట్లాడగలను.
పుస్తకాలు విస్తృతంగా చదవడం ఏం నేర్పింది?
దేశంలో వివిధ భాషలు , జాతులు, సంస్కృతులు ఉన్నాయని అవగాహన కల్పించింది. మానవత్వ ఆలోచనా ధోరణి పెంపొందించింది. సహేతుకమైన ఆలోచనా విధానం నేర్పింది . సమాజం పట్ల వ్యక్తిగా బాధ్యతలను సదా గుర్తు చేసింది.
మీకు ఇష్టమైన రచనలు
వుప్పల లక్ష్మణరావు గారి నవల అతడు-ఆమె. ఆయన రష్యన్ భాష నుంచి అనువదించిన చింగిజ్ ఐతమాతోవ్ నవలలు జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు అత్యంత ఇష్టమైనవి.
స్వీయ రచనలు ఎన్ని చేసారు?
ఏనాడూ లెక్కపెట్టి పదిలపరుచుకోలేదు కానీ బహుశా ఓ పాతికకు పైగా స్వీయ కవితలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
అనువాద రచనలు ఎన్ని చేసారు? పుస్తకాలు ప్రచురించారా?
గుల్జార్ చిట్టి కవితలు, ఇతర హిందీ/ఉర్దూ కవుల కవితల అనువాదాలు అన్నీ కలిపి 1500 దాటి ఉంటాయి. నిజానికి ఇవి కూడా లెక్కపెట్టలేదు. గత మూడేళ్ళకు పైగా నా ఫేస్బుక్ గోడపై ప్రతీ రోజూ రెండు అనువాద కవితలు మీరు చూడగలరు.
పుస్తకాలుగా ఏవీ ప్రచురించలేదు. ప్రచురిద్దామన్న కోరిక కూడా గాఢంగా ఇంతవరకు కలుగలేదు.
యువతకు సాహిత్య మమకారం పెరగాలంటే ఏం చేయాలి?
మొక్కై వంగనిది మానై వంగునా అని కదా సామెత. పిల్లలు స్కూలు వదలగానే ఈనాడు టీవీ, మొబైల్ వంటి లోకంలో పడిపోతున్నారు. అందువలన స్కూలు దశలోనే లైబ్రరీ పిరియడ్ ఉండాలి. అందులో పిల్లలు ఏం చదివారో ఉపాధ్యాయులు ప్రశ్నించాలి. క్లుప్తంగానైనా ఒక పుస్తకం చదివి ఏం తెలుసుకున్నావని అడగాలి. సాహిత్యాభిరుచి పెంచే పోటీలు నిర్వహించాలి.
మీరు పాల్గొన్న గొప్ప సాహిత్య సంబరం గురించి చెప్పండి?
మీరు ఒకటి అడిగారు కానీ రెండు సంబరాల గురించి చెబుతాను. మొదటిది మా బరంపురంలో 1979లో జరిగిన అఖిల భారత తెలుగు రచయితల మహాసభలైతే మరొకటి ఈ సంవత్సరమే (2024) ఆగస్టు నెలలో బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్.
కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం?
కవిత్వమంటే కొద్ది సేపైనా మనసును కదిలించేది.
ఇంటర్వ్యూ
డాక్టర్ పెరుగు రామకృష్ణ
9849230443