ఆధునికానంతర అనుభూతి కవిత్వం ‘అనుమంద్రం’

సాహిత్యం

‘అనుమంద్రం’ కవితా సంపుటిని చదివిన తరువాత నాలుగు మాటలు రాయాలనుకోవటం.. ఎలా రాయాలో, అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని కృత్యాద్యవస్థ. ‘అనుమంద్రం’ అనే పదం చూడగానే నాకున్న చిరు సంగీత పరిజ్ఞానానికి మంద్ర, మధ్యమ, తారాస్థాయిలు సంగీతంలో మూడు స్థాయిలుగా ఉంటాయని మాత్రమే తెలుసు. మంద్ర స్థాయి అంటేనే లోగొంతుక. అనుమంద్రం అంటే ఇంకా కిందిస్థాయి. సంగీతంలో అనుమంద్రం, మంద్రం, మధ్యమ, తార, అతి తారా స్థాయులనే పంచస్థాయుల ప్రస్తావన కూడా ఉంది.

మంద్రానికి హృదయ స్థానంలో వెలువడే స్వరం అని కూడా అర్థం ఉంది. మరో మాట కూడా చెప్పాలి. సాధారణంగా జపం అనుమంద్ర స్వరంలో చేస్తారు. అటు మనసులో అనుకోవడం కాక, ఇటు బయటికి ప్రస్ఫుటంగా వినిపించే విధంగా కాకుండా మంత్రోచ్ఛాటన చేయటం వల్ల ఏర్పడే ప్రకంపనల శక్తి లక్ష్య సిద్ధికి ఉపకరిస్తుంది. కాని ఇందులో మంద్ర శబ్దానికి గల హృదయజాత స్వరం లేక ఎదలో కలిగే అలజడి మానవ సంబంధాల్లో ఉన్న అవకతవకలకు కవయిత్రి పడే అంతర్మథనం దృష్టితో ఈ శీర్షిక తన కవిత్వ సంపుటికి మకుటంగా ఎంచుకోవడంలోనే కవయిత్రి ప్రతిభ ఉన్నది. అత్యాధునిక చిత్రకళా రీతిలో స్త్రీపురుషుల లేదా మానవ సంబంధాల సంకేతంతో ముఖచిత్రం అలరించింది.

‘కప్పి చెబితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ’ అని సినారె అన్నా, ‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అని శ్రీశ్రీ ఉగ్గడించినా, ‘తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం’ అని చలంగారు అన్నా , ‘పూతమెరుంగులున్ పసరుపూప బెడంగులు చూపునట్టివా కైతలు’ అని కవిత్వం ఎలా ఉండాలో దీర్ఘోత్పల మాలికలో ఆంధ్రగీర్వాణాల్లో అల్లసాని అరచినా, ఇంకా అనేక మంది ప్రాచ్య పాశ్చాత్య కవిపండితవరేణ్యులు ఇప్పటికీ కవిత్వానికి నిర్వచనాలు వెలువరిస్తూనే ఉన్నా అది ఒక అనిర్వచనీయ అనుభూతి కలుగజేసేదే కాని నిర్వచనాలకు లొంగేది కాదు. ప్రతిభా వ్యుత్పత్తులు ప్రజ్ఞా పాటవాలు కలిగిన కవి గాని కవయిత్రి గాని కవిత్వానికి కొత్త రూపాలను సంతరిస్తూనే ఉన్నారు.

నిన్న మొన్ననే విశ్వసాహిత్య వివేచనాదక్షులైన పండిత కవి వీరభద్రుడు గారు చిత్రలేఖనానికి సంబంధించిన ఒక ఉల్లేఖనంలో “చూసింది చూసినట్టుగా చిత్రించేదాన్ని perceptual art అనీ, కళ్లతో చూసింది కాక, అంతర్నేత్రంతో సంభావించేదాన్ని చిత్రించడం conceptual art అని అంటారనీ తెలిసిందే” అంటారు.

ఇప్పుడు శశిశ్రీ గారి కవిత్వంలో ఒక సన్నివేశాన్ని చూసి స్పందించిన విధానం చూస్తే ఈ Conceptual art లా అనిపిస్తుంది. తనలో తాను గొణుక్కుంటున్నట్టుగా అనుమంద్ర స్వరంలో వినిపించీ వినిపించని పదాలను కవిత్వంగా ఉచ్ఛరిస్తుంది. ఒక కవికి గాని, రచయితకు గాని ఎన్ని కళల మీద పట్టు ఉంటే కవిత్వం అంత ఆరితేరుతుంది, శశిశ్రీ గారిలో కళాభినివేశం కనిపిస్తుంది.

శశిశ్రీ గారికి సంగీతం మీద మంచి పట్టు ఉన్నట్లుంది.అనేక సంగీత సంబంధిత పదాలు ఈ కవయిత్రి కవిత్వంలో కనిపిస్తాయి. అలాగే సైన్సులో స్నాతకోత్తర దశను దాటడం వల్ల కవిత్వంలో విజ్ఞాన శాస్త్ర విషయాలు అలవోకగా దూరిపోయాయి. వీటికి తోడు సంస్కృతి సంప్రదాయాల పైన మంచి అవగాహన ఉండటం వల్ల వాటిలోని ఔన్నత్యాలను, లొసుగులను తన కవిత్వంలో నేర్పుగా చొప్పించటం జరిగింది. ఆనువంశిక పాండిత్య ప్రభావం ఆమె భాషా పటిమను తెలుపుతుంది. ఔద్యోగిక కారణంతో మన భాష జాడలు కనపడని ప్రదేశంలో ఉండటం వల్ల మాతృ భాషమీది మమకారం కవిత్వంలో సాకారమౌతుంది.

పుష్కరకాలంలో పుస్తకానికెక్కించిన 76 కవితల వైపు తొంగి చూస్తే,తొలి కవిత ‘సరిహద్దులు’లో..‘ఖండాలుదాటి దేశాలుగా విభజించి/దేహం చుట్టూ సరిహద్దులు/ ఉనికొక ఉపోద్ఘాతం’ అంటారు. కవయిత్రి అంతర్నేత్రం అంతరిక్షానికి తేరి అవనివైపు తొంగి చూసింది. మామూలు కన్నులకు కనిపించే అఖండ భూభాగం ఆమె కలంకన్నుకు సరిహద్దులు కలిగిన ఖండాలూ, దేశాలతో పాటు మానవ దేహానికి కూడా సరిహద్దుల ఉనికి ఉన్నట్టు అనిపించింది.ఆ అనిపించిన భావం అక్షరాలుగా మారి గొప్ప భావచిత్రంగా మారింది.

శాస్త్రవిజ్ఞానాన్ని కవితలో జొనిపిన తీరు ఆశ్చర్య పరుస్తుంది. ‘పరిధులన్నీ చెల్లా చెదురై కొత్త జ్యామితి రూపాలు’, ‘సమాంతరాన్ని వెతుక్కోవాలి సాగిన వెన్ చిత్రాలలో’ వంటి వాక్యాలు పరిశీలిస్తే గణిత శాస్త్రానికి చెందిన జ్యామితిలో, పరిధి, సమాంతర రేఖ, వెన్ చిత్రం(Venn Diagram)వంటి పదాలను నేర్పుగా కవితలో పొదిగారు. ఇది నిన్నటి కవి చేయలేని పని. అహాలను కాపుకాచే ఆలోచనలు ఈ సరిహద్దులు. ఇది కులం కావచ్చు మతం కావచ్చు మరేదైనా కావచ్చు. వాటన్నిటికీ అతీతమైన శూన్యంలోకి ఎగబాకాలంటే ఈ భూమినుండి విడివడ్డాకే అని, అవి ఎంత బలవత్తరమైనవో చెప్పక చెబుతారు ఈ కవితలో.

రెండో కవిత ‘ఊరు ముసలిదైంది’ లో,ఊరును మానవీకరించటంలో, ‘ఆప్యాయంగా పొదివి పట్టుకుని కబుర్లు విప్పుతున్నట్లు’ అనటంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రతివారికీ జననీ జన్మ భూమిశ్చ గుర్తుకు వస్తుంది. ‘నుదుటి ముడతల్లోకి కుంకిన సూరీడు’ అనటంలో కవయిత్రి గరిమ తెలుస్తుంది. ‘ఎవరికీ ఏమీ కాని చోట/ఆపేక్షగా ఆంక్షలు/మిథ్యా ప్రపంచాన/ ప్రేమించటం ప్రేమించబడటం/ లయ తప్పిన మిశ్రచాపుతాళం’ అంటూ.. సంగీతోపమలో వ్యక్తీకరిస్తారు. ‘దుఃఖనది’ అనే శీర్షికతో రాసిన పంక్తులు ఇవి.ఇందులోనే ‘కోరికలు ఊరుతున్నప్పుడు దుఃఖనది ఎండిపోని అంతర్వాహిని’ అనటంలో ఒక బరువైన భావాన్ని మన గుండెలపై మోపుతారు. తీరని కోరికలే నీలో దుఃఖహేతువన్న సామాన్య విషయాన్ని కొత్తగా చెప్పటం. ఎందుకంటే కవిత్వం గురించి ‘అయితే కొత్తదైనా చెప్పు లేదా కొత్తగానైనా చెప్పు’ అని అనడం తెలిసిన విషయమే.‘నిద్రపోయిన కల’ వంటి శీర్షికలు పెట్టడం కూడా కవిత్వంలో ఒక భాగమే. ‘మూసుకున్న కళ్లు తెరవబడి/ఓ స్వప్నం మాత్రం నిద్రపోపోతోంది’ అని అనడంలో ‘తెరవబడి’ అనే పదం ఆలోచనాత్మకం. ఇందులోనే విజ్ఞాన శాస్త్రం ఎలా ఒదిగి కూచుందో చూడండి.

‘ఆస్ఫరాగస్ అందమూ కాదు/కుదురుగా ఒదిగిన/ కార్నేషన్ మిస్ట్ అలంకారమూ కాదు/గుచ్ఛమై జీవితానికి/బహూకరించిన విధం బాగుంది’

దాహార్తి అనే కవితలో .. ‘మనం విస్మరించిన విషయాలలో/ మనుషుల్ని కూడా ఒకటేమో’అంటూ అయినవారితోనే అపరిచితులుగా ఉండే దుస్థితిని దుయ్యబడతారు.

6’ x 8’ బాల్కనీని వర్ణిస్తూ.. “ఒక తులసిమొక్కా/ మరో అలోవెరా కుండీ తప్ప/అంతా ఖాళీనే ..చూసే కళ్లకు/ జీవచైతన్యాన్ని నింపే/ ఉత్ప్రేరకం కనిపించకుండా” అంటూ.. మళ్లీ మళ్లీ ఊపిరి పోసుకుని/ పునరుజ్జీవనం పొందేది మాత్రం/ ఆ బాల్కనీలోనే’ అని తనను ఊరడించే బాల్కనీని కవిత్వానికెక్కిస్తారు. ఇక్కడే శ్రీ శ్రీ ‘కుక్కపిల్లా/అగ్గిపుల్లా? కాదేదీ కవితకనర్హం’ గుర్తుకు వస్తుంది. అనుభూతిని అందించి ప్రకటింపజేయించే ఏ విషయమైనా కవిత్వానికి అర్హమైనదే .

Eternal play అనే కవితలో.. ‘ఆటను మొదలుపెట్టే నిమిత్తము ఎవరిదీ కాదు/ ముగింపు ఏ ఒక్కరి/చేతులోనూ ఉండదు’- అని మొదలైన కవిత ‘పావుల ముట్టడిలో ఉనికి ఊపిరి పోరాటంలో/పాచిక విసిరి అంతులేని ఆట నడుస్తూనే ఉంటుంది’- అని ముగిస్తారు. కాలిక స్పృహతో అనివార్య జీవనఖేలనం కవిత్వీకరణ ఇది.మర్మాల సొరంగాలలోకి ప్రవేశించలేం.గెలుపు ఓటమి లెవ్వరివో ఎప్పటికీ నిర్ధారణ కాదు. ఇలా ప్రతీ వాక్యం వెనుక అనంతార్థం చొప్పించగలగటమే కవిత్వం .

కన్నతండ్రి గురించి రాసిన ఎలిజీ.. ‘ఇక ఈ జన్మకు/ …../హఠాత్తుగా అదృశ్యమైన మనిషిని/జ్ఞాపకాల మూలల్లో వెతుక్కుంటూ/ జీర్ణించుకోలేని నిజం/ఆపుకోలేని కన్నీళ్ల రూపంలో’ అంటూ హృదయాన్ని ద్రవీకరింపజేస్తారు. ‘వెలితి వెంటాడుతూనే ఉంది/మనసంతా సంద్రమైపోతూ ‘అంటూ భారంగా కవితను ముగిస్తారు .

ప్రతి కవితలో సామాజికాంశంతో పాటు ఒక వైజ్ఞానిక విషయం పొదగటం చదివిన చదువులను సార్థకం చేయడమే. ఇందులో చర్యా ప్రతిచర్యల పరంపరలో పరమాణు సంలీన విచ్ఛిత్తి విస్ఫోటనాలు అలాంటిదే.

నిజానికి శశిశ్రీ గారి ప్రతి కవితా ఇంత ఆలోచనాత్మకంగా వింగడించదగ్గదే.కవయిత్రి ఆలోచనా పరిధి విస్తృతం. సామాన్య పాఠకుడికి అది ఎవరెస్ట్ కావచ్చు. కానీ ఆశిఖరారోహణం చెయ్యాలనే కాంక్ష కలిగించడం కూడా కవిత్వ లక్ష్యమే. ఇందులోని దాదాపు అన్ని కవితలు ఒకదానితో ఒకటి పోటీపడి సమీక్షకుడికి సందిగ్ధాన్ని కలిగిస్తాయి.

వచనకవిత్వంలో ఆధునికానంతర ధోరణి కవిత్వానికి ఇది ఒక మచ్చుగా చెప్పవచ్చు. గుండెలోని మాటకు బయటి నాటకానికి సంయమనంలేని సంకట స్థితిని అనుభూతిపరంగా అందించటం ‘అనుమంద్రం’ లోని కవిత్వ సారాంశం.

పెదవి విప్పితే బయట కల్లోలం, విప్పకపోతే లోపల బీభత్సం. రెంటి నడుమ ఊగిసలాటల ఊర్పుల ఊర్జ స్వరం ‘అనుమంద్రం’. ఈ కవయిత్రి ఇలాంటి మంచి కవితల సంపుటులు మరెన్నో తేవాలని మనసారా కోరుకుంటున్నాను.

 

 

– ‘వాధూలస’

9701522234