భారతీయ సంస్కృతి,సాహిత్యంలో బాహ్య శరీరానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. మనదంతా అంతర్లోక ఆలోచనే. మహాకవి అందుకనే “శరీర పరీవృతుడా” అన్నాడు. పోతన “పెంజీకటి కావల ఏమున్నదో తెలుసుకోవాలి’ అనుకున్నాడు. శరీరం నిమిత్త మాత్రం అనుకున్నారు. కానీ శరీరమే ప్రధానం,ఏ భావోద్వేగాల భారాలు లేని వొట్టి శరీరమే ప్రధానం అనుకుని శరీరం నేపథ్యంగా పురుషత్వాన్ని, “పురుష శరీరంలో నివసించడం అంటే ఎలా ఉంటుందో – లేదా నిజంగా పురుష శరీరంగా ఉండటం అంటే ఏమిటో” (“unflinching but also basically sympathetic, of what it’s like to inhabit a male body—or indeed to actually be a male body”) తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఫ్లెష్.
బాహ్యత్వ తాత్వికతను నిర్వచించడానికి చేసిన ప్రయత్నం ఫ్లెష్. 2025వ సంవత్సరానికి బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. హంగేరియన్ రచయిత డేవిడ్ సజాలే (David Szalay) ఫ్లెష్ ను అద్భుతంగా పాఠకుడికి అక్షరాలలో అందించారు.
________________
హంగేరియన్ సంతతికి చెందిన డేవిడ్ సజాలే ఆధునిక యూరోపియన్ సాహిత్యంలో ఒక ప్రముఖ రచయిత. 1974లో కెనడాలోని మాంట్రియల్‌లో జన్మించినప్పటికీ, ఆయన విద్యాభ్యాసం, వృత్తి జీవితం ఎక్కువగా లండన్‌లోనే కొనసాగింది. ప్రస్తుతం ఆయన బుడాపెస్ట్‌లో నివసిస్తున్నారు. సజాలే రచనలు సామాన్య మానవుడి జీవితంలోని ఒంటరితనం, పురుషత్వపు సంక్లిష్టతలు, ఆర్థిక అసమానతలు, భౌతిక అనుభవాలపై లోతైన దృష్టి సారిస్తాయి. ఆయన శైలి సూటిగా, స్పష్టంగా ఉండి, పాఠకులను పాత్రల అంతర్లోకంలోకి తీసుకువెళుతుంది.
________________
ఆయన అంతర్జాతీయంగా ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ (All That Man Is – 2016లో మ్యాన్ బుకర్ ప్రైజ్ ఫైనలిస్ట్) నవల ద్వారా గుర్తింపు పొందారు. తాజాగా, ‘ఫ్లెష్’ నవల ద్వారా 2025 బుకర్ ప్రైజ్ గెలుచుకుని, ప్రపంచ సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
‘ఫ్లెష్’ నవలలో కథానాయకుడు ఇస్త్వాన్. అతడి వయసు 15 సంవత్సరాలు. తన తల్లితో కలిసి ఒక చిన్న హంగేరియన్ పట్టణంలోని కౌన్సిల్ ఎస్టేట్‌లో నివసిస్తూ వుంటాడు.మిత భాషి. ఎంత మితంగా మాట్లాడతాడు అంటే కేవలం ‘అవును’, ‘కాదు’, ‘సరే’ లాంటి పదాలతోనే అతడి జీవితంలోని సగభాగం గడచి పోయింది అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ ఉండదు. అతని పొరుగున ఉన్న 40 ఏళ్ల ఒంటరి వివాహిత ఐస్త్వాన్ పైన కోరికతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఈ బంధంతో ఇస్త్వాన్ జీవితం గందరగోళానికి గురి అవుతుంది.
ఇస్త్వాన్ పద్దెనిమిదేళ్ల వయసులో లండన్ కి వలస వెళ్తాడు. అక్కడ డిష్ వాషర్, నైట్ క్లబ్ బౌన్సర్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాడు. రష్యన్ డాన్సర్ నటాలియాతో పరిచయం అవుతుంది. ఆమె ఒక వేశ్య. ఒక సందర్భంలో కస్టమర్ ని కొట్టి ఆరునెలల జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలులో ఇస్త్వాన్ మీద అత్యాచారం జరుగుతుంది. జైలు నుండి విడుదల అయ్యాక ఒక ధనవంతురాలు క్లైర్ ఇంట్లో పనికి కుదురుతాడు. ఆ తరువాత క్లైర్ ను వివాహం చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు పుడతారు. కొడుకు లూకా, కూతురు ఇసాబెల్లా. ఒక బిజినెస్ ఎంపైర్ నిర్మిస్తాడు. లండన్ లో ప్రముఖ సర్కిళ్లలో అతడొక ప్రధాన ఆకర్షణ అవుతాడు. పార్టీలు, డ్రగ్స్, సెక్స్ ఒకటేమిటి అన్నీ! కానీ అతడు ఒంటరి. క్లైర్ తో ప్రేమేలేదు. జీవితం ఆమెతో ఒక లావాదేవీ.
ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినప్పడు క్లైర్ విడాకులు కోరుకుంటుంది, మరొక ప్రియుడిని తన జీవితంలోకి ఆహ్వానించి. పిల్లలు తల్లిదగ్గరకు వెళ్ళిపోతే ఇస్త్వాన్ ఒంటరి వాడవుతాడు. కరోనా సమయం. ఒక చిన్న గదిలో ఒంటరిగా, యాభయి ఏళ్ళ వయస్సులో గతాన్ని తలచుకుంటూ తండ్రిలేని బాల్యం,పక్కింటి స్త్రీతో సంబంధం, నటాలియా ఆకర్షణ, జైలు జీవితం, క్లైర్ పరిచయం, నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం, విడాకులు, మిగిలిందేమిటి శూన్యం?
ఒకరోజు మాస్క్ లేకుండా బయటకు వెళతాడు. పోలీసులు పట్టుకుని జరిమానా వేస్తారు. ఇంటికొచ్చి లూకాకి ఒక వుత్తరం రాస్తాడు. తరువాత ఒక కత్తి తీసుకుంటాడు. తన గొంతు కోసుకుంటాడు. రక్తం పేజీమీద పడుతుంది. ఖాళీ స్థలం. ఆ తరువాత…?
ఫ్లెష్ అంటే శరీరం. అది పుడుతుంది. పెరుగుతుంది. కోరుకుంటుంది. కోల్పోతుంది. చనిపోతుంది. అంతకు మించి ఆ శరీరానికి పెద్ద ప్రాధాన్యత లేదు. నిజానికి శరీరం అంటే ఒక ఇల్లు కదా. ఇస్త్వాన్ కి ఇల్లెక్కడా లేదు. హంగేరీ, లండన్, సెడ్యూస్ చేసిన ఆంటీ, నటాలియా, క్లైర్ ఎక్కడా ఇల్లు లేదు. డబ్బులో లేదు. పేరులో లేదు. సెక్స్ లో లేదు. డ్రగ్స్ లో లేదు. ఎక్కడా ఒక భావోద్వేగం లేదు. చివరలో లూకాకి రాసిన వుత్తరంలో ‘I was never your father.’ అంటాడు. అతడు తండ్రికాదు. భర్త కాదు. ప్రియుడు కాదు. మరెవరు? చివరి మాట ‘I was flesh. Nothing more’ ఇస్త్వాన్ జీవితంలో ఒక సగటు మనిషి జీవితంలో ఏమేమి జరుగుతాయో, అన్నీ జరుగుతాయి. కానీ వాటిని వేటినీ అతడు కోరుకోలేదు. Make it happen కాదు. అతడు Let it happenగా చూశాడు. అతడొక యాంత్రికతలో కూరుకునిపోయాడు, అతి స్వల్పమైన భాష అతడిది. కమ్యూనికేషన్ అతడికి తెలియదు. కమ్యూనికేషన్ లేకపోవడం మనిషి ఎవరికి వారే ఒక రహస్య ద్వీపం లాగా మారడానికి సూచన.
_________________
రచయిత ఆధునిక జీవితం గురించి చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలు కోరిక, డబ్బు, సెక్స్, ప్రేమ, పని చుట్టూ తిరుగుతాయి. మనుగడ చుట్టూ తిరుగుతాయి. యూరప్‌లోని ధనిక, పేదల మధ్య అగాధం చుట్టూ. ప్రశ్నలు లేవనెత్తడంలో నైపుణ్యం ఉన్నప్పటికీ, రచయిత సమాధానాలను ఇవ్వడానికి ఇష్టపడక దూరంగా వుండిపోయాడు. లేదా పాఠకులకు వదిలివేయడానికి ఇష్టపడ్డాడు అనుకోవాలి. పాఠకుడు ఎవరిని రిజెక్ట్ చేయాలో, ఎవరిని యాక్సెప్ట్ చేయాలో తనకు తాను నిర్ణయించుకోవడానికి కావలసినంత ఖాళీ ఇస్తాడు రచయిత.
_________________
ఇస్త్వాన్ తల్లి నిరంతరం అతడి జీవితంలో ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యా ఒక ఉద్వేగ బంధం ఏదీ లేదు.వాళ్ళిద్దరి మధ్యా ఎంత యాంత్రిక బంధం వున్నదో ఈ చిన్న సంభాషణ ద్వారా అర్ధం అవుతుంది.
“పాఠశాల ఎలా ఉంది?”
“బాగుంది,”
“నీకు మార్కులు కొంచెం తగ్గాయి.”
“అవును?”
“నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను,”
…. …. …….
“ఎవరైనా స్నేహితులు అయ్యారా??”
“ఊ.”
అతను ఆమె వైపు చూడకుండా తల ఊపాడు.
“ఓ. కే,” అని ఆమె అంటుంది. ఆమె తనను నమ్ముతుందో లేదో అతనికి ఖచ్చితంగా తెలియదు.
‘His body is the conduit through which he responds to the world. Rooted in his flesh, he is perplexed by the distance between his physicality and his feelings; between his desires and his decisions. István may be a singular character, but he is also part of a specific tribe of men.’ అంటుంది అవుట్ లుక్ లో Vineetha Mokki.
నవలలో చాలాచోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. నిజానికి ఆ ఖాళీ స్థలం కూడా సంభాషణలో భాగమే. అక్కడొక నిమిషం పాటు ఆగి పాఠకుడు తన మనసుకో, మేధకో పనిపెట్టకపోతే ఈ నవల తన సంపూర్ణత్వంతో అర్ధం కాదు.
“And all that burgeoning physicality is held within yourself as a sort of secret, even as it is also the actual surface that you present to the world, so that you’re left absurdly exposed, unsure whether the world knows everything about you or nothing, because you have no way of knowing whether these experiences that you’re having an universal or entirely specific”
“పెరుగుతున్న భౌతికత అంతా మీలోనే ఒక రహస్యంగా ఉంటుంది.నిజానికి అది మీరు ప్రపంచానికి ప్రదర్శించే వాస్తవ ఉపరితలం కూడా, అలా ప్రదర్శించడం ద్వారా మీరు అసంబద్ధంగా బహిర్గతమవుతున్నారు. ప్రపంచానికి మీ గురించి ప్రతిదీ తెలుసో లేదో అని మీరు సందేహపడతారు. ఎందుకంటే మీరు అనుభవిస్తున్న ఈ అనుభవాలు సార్వత్రికమైనవో లేక పూర్తిగా నిర్దిష్టమైనవో తెలుసుకోవడానికి మీకే మార్గం లేదు”. జీవించి ఉండటం అనే కళ అందరికీ పట్టుబడదు. ఆ కళ పట్టుబడకపోతే ఇదుగో ఈ నవలలో ఇస్త్వాన్ చివరికి “I was flesh.Nothing more” అని అనుకోవాల్సి ఉంటుంది.
-హర్షనేత్ర
