విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని సిఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యా శాఖపై ఐసిసిసిలో సిఎం ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణాలను వివిధ విభాగాలు చేపట్టడం సరైంది కాదని, ఈ నిర్మాణాల నాణ్యతప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి గానూ ఒకే విభాగం కింద ఉండాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యుడిసి) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సిఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపొద్దని సిఎం అన్నారు. తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సిఎం ఆదేశించారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని, కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సిఎం తెలిపారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సిఎం ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలే ఉన్నారని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సిఎం ఆదేశించారు. సమీక్షలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సిఎం ఓఎస్‌డి వేముల శ్రీనివాసులు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
