9.4కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ
మహారాష్ట్రలో ప్రారంభించిన ప్రధాని మోడీ
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18వ విడుతలో 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు జమ కానున్నాయి. ఈ సందర్భంగా నమో షెత్కారీ మహాసమ్మాన్ నిధి యోజన సైతం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేల చొప్పున మూడు విడుతల్లో కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా రైతుల ఖాతాల్లో సమ చేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడుతలో ఏప్రిల్ జూలై మధ్య.. రెండో విడుతలో ఆగస్టు` నవంబర్.. మూడో విడుతలో డిసెంబర్`మార్చి మధ్య కేంద్రం సాయాన్ని రైతులకు అందిస్తున్నది. ఇక ఇప్పటి వరకు రూ.3.45 లక్షల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. కిసాన్ నిధులు సమ కాని రైతులు తప్పనిసరిగా ఈ`కేవైసీ చేయించుకోవాలని.. ఇందు కోసం అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కేంద్ర సూచించింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, మంత్రి సంజయ్ రాథోడ్ పాల్గొన్నారు. వెబ్‌కాస్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పీఎం కిసాన్ నిధుల విడుదల రోజును.. పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించి.. తద్వారా వారి జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. ఈ పతకం కింద భూమి కలిగిన ప్రతి రైతుకు మూడు సమాన వాయిదాల చొప్పున సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఇప్పటి వరకు 18 విడతలు నిధులు పంపిణీ చేయగా.. ఈ మొత్తం రూ. 3.45 లక్షల కోట్లు దాటిందని, దేశ వ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ది పొందారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.