తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పెట్టుబడి,రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేలను కలుపుకుని పోవటంలేదని పార్టీలోపల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో ఒక్కసారిగా ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదిగాడు. నేరుగా సీఎం అయ్యాడు. ప్రజాభవన్ లో ప్రజలను అనుమతించడం,కేసీఆర్ దానికి వేసిన సంకెళ్లను తుంచడం ప్రజలకు మరింత చేరువయ్యాడు. హామీల అమలు వందరోజుల్లో నేరవేర్చడంలో కొంతవరకూ కృతకృత్యుడవంతో సీనియర్లను కలుపుకుపోవడం విజయమే. రైతు బంధు,రుణమాఫీలు మినహా మిగిలిన హామీలు నెరవేర్చగలిగారు. నిధుల కొరతతో ప్రభుత్వం సతమతమవుతున్నది. కేంద్రం తో సఖ్యతగా ఉంటూ పనులు చేయించుకుంటున్నారు.అందులో భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని పౌర ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురాగలిగారు.రేవంత్ ప్రభుత్వం,అందులో కాంగ్రెస్ సీనియర్లను సంతృప్తి పరుస్తూ ముందుకు సాగడం అంత సులభంకాదు. రేవంత్ కేవలం శ్రీనివాసరెడ్డి తో మాత్రమే క్లోజ్ గా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మేడిగడ్డ పూర్తిగా దెబ్బతిందని అది బాగవడం సాధ్యం కాదని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎల్అండ్ టీ కంపెనీ విజయవంతంగా మరమ్మత్తులు చేయడంతో ఆయన మాటలు అవాస్తవాలని తేలాయని కేటీఆర్ విమర్శించడం గమనార్హం. ఇప్పటివరకూ రాజకీయంచేసి మాటలు , ఆరోపణలతో కాలం గడిపారని ఆయన అనడం విశేషం. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే పనిలో రేవంత్ పడ్డారు.ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవేపు లాక్కవడం ద్వారా వారికి చావుదెబ్బ తీయాలనుకున్నారు. ఆ పనిలో కొంతవరకు సంజయ్ ను చేర్చుకోవడంతో సఫలం అయ్యారు.మొదట్లో రేవంత్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాని రోజులు గడిచే కొద్ది ఆయనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు పెంచాయి.బీఆర్ఎస్ నాయకులు కవిత అరెస్టుపై నోరుమెదపడంలేదు. సొంత కూతురిని రక్షించుకోలేని కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం ఆరునెలలే అని ఆ తరువాత తామే అధికారంలోకి వస్తామని ఊదర కొడుతున్నారు.అది సాధ్యమా, ప్రజలు తాము చెప్పే మాటలు నమ్ముతున్నారా అనేది ఆలోచించడంలేదు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ లాంటి నాయకుడు అనడం గర్హనీయం. ఎమ్మెల్యేలను కాపాడుకునే పని మానేసి ప్రభుత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఏ మాత్రం ఆయన స్థాయికి తగదు. మేడిగడ్డ మరమ్మతులు విజయవంతం కావడం బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా సంతోషంకావాలి.తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేవని తేలడం వారికి ఒక విధంగా ఊరటే. ఇదిలా ఉండగా కరెంట్ వ్యవహారంలో ప్రభుత్వం వేసిన కమిషన్ చెల్లదని తీర్పు చెప్పాలని హైకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేయడం ఆయనకు భంగపాటు.ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలపై చర్చలకు రమ్మనమని రేవంత్ ను ఆహ్వానించడం శుభసూచికం. కవితను రక్షించుకోలేని నిస్సహాయత, తనపై వస్తున్న ఆరోపణలు తప్పని రుజువుచేసుకోవడం చేతగాని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిత్వంపై వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఏదిఏమైనా రేవంత్ నిధులను సమకూర్చుకుని రైతుల హామీలను నేరవేర్చడం ఆయన ముందు ఉన్న ప్రధాన టాస్క్. దాన్ని నెరవేర్చి రేవంత్ చేతలమనిషి అని రుజువు చేసుకోవడం ద్వారా పార్టీలోనూ ప్రభుత్వంలోని పట్టు సాధిస్తేనే విమర్శకుల నోళ్లు మూతలు పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)