మహారాష్ట్ర దళిత పాంథర్స్ ప్రభావం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో 1980వ దశకంలో ప్రారంభమయిన దళితోద్యమము క్రమక్రమంగా కవిత్వమై కష్టాలనీ, కన్నీళ్ళనీ వ్యక్తీకరించి అస్తిత్వగానమై నేటివరకు గొంతు విప్పుతూనే వుంది. ఈ చైతన్యం ద్వారా వచ్చిన పాటలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. సామాజిక లక్ష్యం కోసం దళిత కవులు బాధ్యతతో నిలబడ్డారు. ప్రజల్లో చైతన్యం నింపారు. దళిత కవుల సంపాదకత్వంలో సామాన్యులే కథానాయకులుగా కవిత్వం, వివిధ సంకలనాలుగా ధిక్కారమై ఎగసి పడుతున్నందున ‘ఇపుడు నడుస్తున్నది చండాల చరిత్ర’ అని ప్రఖ్యాత కవి శివసాగర్ పేర్కొన్నారు. ఈ కవిత్వం ఆత్మలని పలికిస్తూ ఉర్రూతలూగించింది. తెలుగు నేలపై దళిత తాత్త్విక, వ్యవస్థాగత, సంస్థాగత, సామాజిక రాజకీయ ఆలోచనలకు ఆలంబనై ముందుకు సాగుతూనే ఉంది.
దళితుల ఆక్రందనలు, అమాయకత్వం, పీడింపబడటం, మొదలైనవి కథ ద్వారా అనేక మందికి చేరువైంది. దళిత కథలు అచ్చైనా పుస్తక రూపంలో చూసుకోలేని దళిత కథకులు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో విశాలాంధ్ర వారు దళిత కథలు పేరుతో కొన్ని సంకలనాలు తేవడం వలన కొంత సమస్య తీరింది. 1990లో వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో కథా వార్షిక ప్రారంభమైంది. ఆ వార్షికలో ఒకటీ, అరా మాత్రమే దళిత కథలు ఉండేవి. కాకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలలో… సమాజంలో వేళ్ళూనికొని ఉన్న అసంబద్ధతను ప్రశ్నించే దళిత కథకు కొంత స్థానం కొరవడినట్లు ఇప్పటిదాకా కనబడుతుండేది. కథా వార్షిక అనంతరం సరిగ్గా మూడు దశాబ్ధాలకు కానీ దళిత కథా వార్షిక రాలేదు.
ఆలస్యమైనప్పటికీ జంబూ సాహితి దళిత కథా సాహిత్యంపై ఆన్లైన్ ప్రసంగాలు, దళిత కథను కేతనంలా తెలుగు సాహిత్యంలో ఎత్తి ఒక చైతన్యవంతగా కొనసాగిస్తున్నారు డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్యలు. వీరి సంపాదకత్వంలో గత మూడు సంవత్సరాలుగా ‘దళిత కథా వార్షిక’ పేరిట వార్షికలు తెస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో ప్రచురించబడిన దళిత కథలను పరిశీలించడం, ఎంపిక చేయడం, మేలైన కథలను సంకలనంగా తీసుకురావటం జంబూ సాహితి చేస్తున్న జాతి పట్ల ఉన్న అంకితభావానికి, నిబద్ధతకు తార్కాణం. తొలి వార్షిక “తొండం బొక్కెన-2020”, “చిందూ నేల-2021” వెలువడ్డాయి.. ’సాక’ దళిత కథా వార్షిక-2022 తేవడం. ఈ పనికి బాధ్యతగా పూనుకున్న సంపాదకులు ఎంతైనా అభినందనీయులు.
______
“సాక” అంటే… అర్పించడం, అర్పణం, తర్పణం, ధారపోయడం లాంటి అర్థాలున్నాయి. మూలవాసుల అస్తిత్వ విశ్లేషణ ఈ సంకలనంలో చోటుచేసుకున్న కథల్లో ఉంది. మొత్తం పదహారుమంది కథకులలో కొత్తగా కథలు రాసేవారి కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. దళితుల జీవన వేదం, బతుకు చిత్రణ కథా కమామిషు ఈ కథల్లో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రజా యుద్దనౌక గద్దర్ కు అంకితం ఇవ్వడం చెప్పుకోదగిన విశేషం.
_______
ప్రముఖ కవి, సీనియర్ కథకులు, పాత్రికేయులు సతీష్ చందర్ ‘యువరానర్’ అనే కథ ఈ సంకలనంలో మొదటి కథగా చోటు చేసుకుంది. ‘యువరానర్’ కథ ప్రారంభంలో ఇదేదో కార్పొరేట్ సోఫిస్టికేటెడ్ కుటుంబాలకు చెందిన కథనుకుంటారు. రచయిత నడిపిన కథనంలో చివరకు కుండబద్దలు కొడతారు. ఇది కథా మర్మము అని పాఠకులు నివ్వెరపోక తప్పదు.
ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర కథల్లో సజీవమైన చక్కని మాండలిక భాష, గొప్ప శిల్ప సౌందర్యముతో కథను నడుపుతుంది. ‘అప్పు వడ్డది సుమీ…’ కథలో ‘ఆరోల్ల పూలమ్మ చక్కదనాన్ని, ఆమె అలంకరణను వర్ణించిన తీరు బాగుంది. ఆమె అందం.. తోటి ఆడవారినే అబ్బుర పరిచేది. ఆమెకు మాయరోగం వచ్చి మరణించింది. బతికుండగా మాలమాదిగలను ఆమడ దూరం తరిమి దూరంగొడతివి. ఇప్పుడు గాల్లే నీకు దిక్కయిరి’ అని కథ చెప్పిన తీరులో దళితులకు మానవత్వం అప్పువడ్డదని ముగించడం సముచితంగా ఉంది.
‘వీకెండ్’ కథా రచయిత అనిల్ డ్యానీ.. కవి, రచయిత, విమర్శకుడు. చాలా వరకు దళిత కులాలలో ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని, తమ మూలాలను మరచిపోరు అనే విషయాన్ని చాలా చక్కగా దృశ్యీకరించాడు. దళితుల ఆహారపు అలవాట్లు కూడా ఉన్నత స్థాయిలో వున్నా కొనసాగుతూనే ఉంటాయనే విషయాన్ని తాను ఎన్నుకున్న పాత్రలచేత కథా సారాన్ని పాఠకుని మనసుకు ఒప్పిస్తాడు. మాంసాహారాన్ని ముక్కలుగా, తీగల్లా కోసి ఎండబెట్టిన మాంసానికి ‘మల్లెమొగ్గలు’ అంటూ చక్కని పేరు పెట్టాడు రచయిత. ఆదివారం రోజు సమృద్ధిగా పెద్దమాంసం తెచ్చుకొని తిన్నకాడికి తిని మిగిలింది ఇంట్లో ఫానుకింద ఆరబెట్టు కుంటారు. ప్రమోషన్ కోసమని జాకబ్ తన బాస్ ని కుటుంబంతో సహా పిలవడం, భార్యను ఒప్పించి, అతిథులకు అన్ని వంటలు ఇష్టంగా చేయిస్తాడు. ఆదివారం రోజున ఆ ఇంటిలో సాధారణంగా వచ్చే మసాలా వంటలకు భిన్నంగా వచ్చే ఘుమఘుమలను పక్కవాళ్ళు ఆస్వాదిస్తూ మేరిని పొగడటం జరుగుతుంది. జాకబ్ వాళ్ళ బాస్ వాళ్ళు వచ్చాక ఎంతో ఉత్సాహంగా పిచ్చాపాటి మాట్లాడుకున్నాక వాళ్ళ శ్రీమతికి ఇల్లంతా కలియదిరుగుతూ ప్రతిగదిని చూపించే దశలో వంటగదిలో ఫాను గాలికి ఆరబెట్టిన ‘మల్లెమొగ్గల్ని’ చూసి అవాక్కయి పోతుంది బాస్ వాళ్ళ భార్య. ఇక ఇక్కడి సన్నివేశం కథ చదివితేనే ఎలా మనసునూరిస్తుందో తెలుస్తుంది. రచయిత అనిల్ డ్యాని కథనం, శిల్పం, శైలి మెచ్చుకోదగినవి.
డా. సిద్దెంకి యాదగిరి రాసిన కథ ‘ఋణం’ కథలో.. వర్ణనలు, సామెతలను సందర్భోచితంగా వాడుతూ వాతావరణాన్ని పోలికలతో చెబుతూ కథను నడిపించిన తీరు చాలా గొప్పగా ఉంది. కరోనా రోగి ఈ కథకు వస్తువు. మడేల్ అనే చాకలాయనకు కరోనా సోకి చిక్కి శల్యమైపోయాడు. ఊరంతా అతన్ని చూసి జీవమున్న మనిషనుకోలేదు ఏదో అనాథ శవమనుకున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది హాస్పిటల్ కి తీసుకపోతే చికిత్సచేసే ఆ డాక్టరు, పేషంట్ ఇద్దరూ ఒక ఊరు వారే అవడం, ఈ మల్లయ్య వల్లనే డాక్టర్ మల్లయ్య బతకడం, ఆ ఇద్దరిలోనూ ప్రేమ పొంగుకరావడం, స్థానీయ అస్తిత్వం, మానవీయ విలువలు కలగలిసి కరోనా వైరస్ సోకిన వ్యక్తి బతికి బట్టకట్టడం, కరోనా కాలంలో వైద్యులు.. రోగిని బ్రతికించడంలో తాము పడే కష్టం, ఇత్యాది విషయాలను వివరించడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. ‘చెవులు కోసిన కుక్క తీరున ఆటో ఊల్లోకి అడుగు పెట్టింది’. ‘పొద్దు తిరుగుడు సేన్ల రామచిలకలు చేరినట్టు’ అంటాడు. చదివి, దాచుకోదగిన మంచి కథ ఇది.
గుడిపల్లి నిరంజన్ ప్రముఖ కవి, కథకుడు, విమర్శకుడు. వీరి కథ ‘తప్పెట సిటుకు’. భర్త చేసిన తప్పుకి కోంటోల్ల కళావతమ్మ బలవుతుంది. ఎవరినైతే అంటరాని వాళ్ళగా, తక్కువ వాళ్ళగా చూసి చీదరించుకుందో చివరికి వాళ్ళే దిక్కయ్యారు కళావతికి. మాదిగ తత్వాన్నీ, మాదిగల ప్రేమ తత్వాన్నీ ..కళావతి పాత్రతో చెప్పిస్తూ, ఒక సున్నితమైన సమస్యను కథగా మలిచిన తీరు పాఠకుల గుండెలకత్తుకుంటుంది.
డా.యాకమ్మ కథ ‘వెన్నెల గొడుగు’. బృహత్తరమైన మాదిగ జీవితం, రోడ్డు వార చిల్లుల గొడుగు కింద మాదిగ జీవితం-అతనితో ముడిపడి ఉన్న పనిముట్లను పాఠకలోకానికి చక్కగా పరిచయం చేశారు యాకమ్మ. కనుమరుగవుతున్న మాదిగ పనిముట్లు కత్తి, ఆరె, రంపం, గూటం, మైనపు ఉండ, దారం, కొమ్ము, మిగ్గు అడవికి పోయి తంగేడు కట్టెలు తెచ్చి, వాటి బెరడు(చెక్క) తీసి లందలో మురిగాక తోళ్ళు తీసే విధానాన్ని ఓ శాస్త్రవేత్తలా అభివర్ణించారు యాకమ్మ. ఎంచుకున్న వస్తువుకు తగిన భాషను వాడుతూ మాదిగ జాతి మూలాలను నేటి తరం వారికి అందించారు.
______
ఈ కథా వార్షికలో భూతం ముత్యాలు, డా. జిలుకర శ్రీనివాస్, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, పసునూరి రవీందర్, చరణ్ పరిమి, మెర్సీ మార్గరెట్, కెంగార మోహన్, పెనుమాక రత్నాకర్, డి.జి .హైమవతి, సోలోమోన్ విజయ్ తదితరులు రాసిన గొప్పకథలు ఉన్నాయి. ఈ సంకలనంలోని కథలు అన్నీ గొప్ప కథలే. కథలు అనడం కంటే జీవితాలు అనడం సబబుగా ఉంటుంది.
_______
దళితులే రాసిన మంచి కథలను సేకరించి, మేలైన కథలను ఏరి కూర్చి సంకలనంగా తీసుకురావడం మహత్తరమైన పని. ఇట్టి పని నిరంతరాయంగా, శక్తివంచన లేకుండా చేస్తున్నందుకు, దళిత కథను భవిష్యత్తుకు దివిటీగా నిలుపుతున్న జంబూ సాహితికి అభినందనలు తెలుపుతున్నాను. సాకతో పాటు దళిత కథా వార్షికలు అన్నీ కొని భద్రపరుచుకోవలసిన కథా సంకలనాలు.
(సాక:దళిత కథా వార్షిక 2022,పేజీలు 152. వెల:150/- ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్:9441244773)
-దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి
80962 25974