ఎస్‌బిఐ ఇంటర్‌ సర్కిల్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

బిజినెస్ హోమ్

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇంటర్‌ సర్కిల్‌ 2023 క్రికెట్‌ టోర్నమెంట్‌ సికింద్రాబాద్‌ రైల్వే రిక్రియేషన్‌ అథ్లెటిక్స్‌ మైదానంలో ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బిఐ 16 సర్కిల్స్‌కు చెందిన సిబ్బందికి అనేక ప్రాంతాలలో జరుగుతున్న వివిధ రకాల క్రీడా పోటీలలో భాగంగా ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ ఈ క్రికెట్‌ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తున్నది.
దేశవ్యాప్తంగా వివిధ ఎస్‌బిఐ సర్కిల్స్‌ నుండి వచ్చిన క్రీడాకారులు 24 లీగ్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఈనెల 26న సెమీ ఫైనల్‌, 27వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం ముగింపు సభ జరుగుతుంది. ఎఓసి, ఇసిఐఎల్‌, ఆర్‌ఆర్‌సి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఎస్‌బి హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేశ్‌ కుమార్‌ జ్యోతి వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. ఆయనతోపాటు జనరల్‌ మేనేజర్ల దేవాశిశ్‌ మిత్రా, కె.స్వామినాథన్‌, పీయూశ్‌ కుమార్‌, డిజిఎం జితేంద్ర కుమార్‌శర్మ, ఎస్‌బిఐ హైదరాబాద్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ ఆకాశ్‌ భండారి ప్రభృతులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, టోర్నమెంటులో పాల్గొనే జట్లు తమ తమ శక్తిసామర్థ్యాల మేరకు రాణిస్తాయని, మానసికంగా, భౌతికంగా బలమైన జట్లే ఈ పోటీలలో అంతిమంగా విజయం సాధించగలవని అన్నారు. ఇటీవలి వరల్డ్‌ కప్‌ టోర్నమెంటులో జట్ల సామర్థ్యాలను మనం ఎంతో ఎంజాయ్‌ చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన జట్లును చూస్తుంటే ఇక్కడ మినీ భారతదేశం ఆవిష్కృతమైన దృశ్యం కళ్ళ ఎదుట ఆవిష్కృతమైందని సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవికమైన క్రీడాస్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు ఆయన హితవు పలికారు. ఈ పోటీలను ఆ విధంగా ఎంతో వినోదభరితంగా, థ్రిల్లింగ్‌గా, ఉత్కంఠ భరితంగా, చిరస్మరణీయంగా క్రీడాకారులు తీర్చిదిద్దగలరని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాజేశ్‌ కుమార్‌ ఈ సందర్భంగా పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు.
ఎస్‌బిఐ ప్రతి సంవత్సరం ఈ విధంగా జాతీయస్థాయిలో ఈ పోటీలు అంతర్గతంగా నిర్వహిస్తుంది. మొత్తం 16 ఎస్‌బిఐ సర్కిల్స్‌కు చెందిన ఉద్యోగులకు వివిధ రకాల క్రీడలను దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. వీటిల్లో క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, కబడ్డీ వంటి క్రీడలు, ఆటలను నిర్వహిస్తునారు. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గాచిన ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఈ పోటీలకు కొత్త కాంతులు వచ్చాయి.
తొలుత సికింద్రాబాద్‌లో ఈ పోటీలు ప్రారంభం కావనికి ముందు రమాదేవి డ్యాన్స్‌ అకాడమీ హైదరాబాద్‌ వారు సంప్రదాయ నృత్యాలతో సభికులను అలరించారు. తర్వాత పోటీల్లో పాల్గొనే జట్ల కెప్టెన్లకు, కోచ్‌లకు, మేనేజర్లకు ఆహ్వానం పలికారు.