నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్ : ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, పంటలు ఇబ్బంది పడితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఆపరేషన్, మెయింటెనెన్స్ సమగ్రంగా సమర్థవంతంగా జరగాలని, ప్రతి రోజు కాలువల పరిశీలనతో పాటు చెరువులు, కాలువల మరమ్మతులు, వరద నివారణ తదితర పనులు సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. పనులు వేగంగా, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. నీటి పారుదల శాఖ పనితీరుపై ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం జల సౌదలో రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ఈఎన్‌సిలు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీటి పారుదల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు కొత్త ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. తమ ప్రభుత్వ హాయంలో ప్రతి సంవత్సరం 6 నుంచి ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేవపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులతో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో రూ. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని తెలిపారు. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిపారుదలకు సంబంధించి అన్ని చెరువుల నుంచి జలాశయాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక నీటిపారుదల రంగంలో కొత్త అధ్యాయం (చాప్టర్) ప్రారంభించాలని, అది రైతులకు ప్రజలకు మేలు జరగాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరి అధికార దుర్వినియోగం చేయం.. కమిషన్‌ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టంబోమని అన్నారు. 36 లక్షల ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకెళతామన్నారు. రైతులకు వీలైనంత మేలు చేయాలనేదే తమ తపన అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు తలపెట్టిందన్నారు. తర్వాత బిఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత దాని పనులు కొనసాగించారని, దీనికి జాతీయ హోదా కూడా అడిగారని అన్నారు. ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ పనులు ఆపేసి..30వేల కోట్లు అయ్యే ఆ వ్యయం.. ఏకంగా 85 వేల కోట్లకు పెంచారని కానీ ప్రాజెక్టు ఆయకట్టు మాత్రం అంతేనని ఇదీ గత ప్రభుత్వం తీరుని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ.. ప్రశాంత్ పాటిల్, ఈఎన్‌సి అనిల్ తదితరులు పాల్గొన్నారు.