‘‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌’’ లో అన్ని భాషల కవులు, రచయితలు భాగస్వామ్యం కావాలి

కవితో కరచాలనం

కవితో కరచాలనం

58 సం.లుగా అవిశ్రాంతంగా భారతీయ భాషా సాహిత్యాల పరిరక్షణకు కృషిచేస్తున్న ‘‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌’’ లో అన్ని భాషల కవులు, రచయితలు భాగస్వామ్యం కావాలి

అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌, భోపాల్‌ వారి అత్యున్నత పురస్కారం ‘‘రాష్ట్ర భాష గౌరవ సమ్మాన్‌ ‘‘ పొందిన సందర్భంగా అంతర్జాతీయ కవి డా.పెరుగు రామకృష్ణ తో ఈ వారం కరచాలనం.

అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌, భోపాల్‌ వారి అత్యున్నత పురస్కారం ‘‘రాష్ట్ర భాష గౌరవ సమ్మాన్‌ ‘‘ పొందిన తెలుగు కవిగా మీ అనుభూతి?
ఐదు దశాబ్దాలుగా నిత్య సాహిత్య జైత్ర యాత్ర చేస్తున్న సందర్భంలో, ఏన్నో దేశ విదేశీ ప్రతిష్ఠాత్మక అవార్డులు, మెడల్స్‌, గౌరవాలు అందుకున్నాను. అయితే ఈ సంస్థ అధ్యక్షులుగా నవ్య ఆంధ్రప్రదేశ్‌ లో నా ఆధ్వర్యంలో మొదటిసారి మహాకవి తిక్కన నడయాడిన మా సొంతగడ్డ నెల్లూరులో జరిగిన జాతీయసభలో ఒక్కరికే దక్కిన ఈ అత్యున్నత గౌరవం అందుకోవటం ఎంతో ప్రత్యేకం అనిపించింది. మా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి చేతులమీద అందుకోవటం మరింత ప్రత్యేకం.

ఈ సంస్థ కార్యకలాపాలు, దాని వ్యవస్థాపకుని గురించి క్లుప్తంగా చెప్పండి?
ఈ సంస్థ 1966 లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో స్వర్గీయ సతీష్‌ చతుర్వేది వ్యవస్థాపకులుగా స్థాపించారు. 58 యేళ్లుగా అవిశ్రాంతంగా భారతీయ భాషా సాహిత్యాల పరిరక్షణకు కృషిచేస్తోంది. అనేక రాష్ట్రాలలో శాఖలు ఏర్పరచి వివిధ భారతీయ భాషల మధ్య సమన్వయం చేస్తుంది.

సంస్థ బహూకరించే బిరుదులు, ఇంకా మెమోరియల్‌ అవార్డుల వివరాలు?
సంస్థ వ్యవస్థాపకులు స్మారక దినంగా ప్రతి ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్త జీవిత సభ్యులకు సతీష్‌ చతుర్వేది, శ్రీమతి సుమన్‌ చతుర్వేది, ఉమ్మడి ఆంధ్ర శాఖ నిర్మాత డాక్టర్‌ పోతుకూచి సాంబశివరావు స్మారక సాహిత్య పురస్కారాలు, నగదు బహుమతి, మరికొన్ని ధర్మనిధి స్మారక పురస్కారాలు, నగదుతో కలిపి అందిస్తారు. సంస్థ వార్షిక జాతీయ సమావేశం ప్రతి యేట జూన్‌-జూలై మాసాల్లో కేంద్ర కార్యాలయం భోపాల్‌ లేదా ఇతర రాష్ట్ర శాఖలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో జరుగుతాయి. ఈ సందర్భంగా సంస్థలో జీవిత సభ్యులైన వారికి యేట ఇచ్చే ప్రతిష్టాత్మక సమన్వయశ్రీ, సాహిత్య శ్రీ, సంస్కృతీభూషణ్‌, భారత్‌ భాషా భూషణ్‌, సరస్వతీ సమ్మాన్‌, రాష్ట్ర భాషా గౌరవ్‌ సమ్మాన్‌ అనే అవార్డులను ప్రదానం చేస్తారు. ఇటీవల యువతను అభినందిస్తూ నెక్స్ట్‌ జనరేషన్‌ యూత్‌ ఎక్సలెన్స్‌ అవార్డు కూడా ప్రవేశ పెట్టారు. ఇవి ఆయా రాష్ట్ర అధ్యక్షుల ప్రతిపాదనలు అనుసరించి కేంద్ర కార్యాలయం ప్రకటిస్తుంది. డాక్టర్‌ సి నారాయణ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా ఈ సంస్థ టైటిల్‌ అందుకుని వుండడం విశేషం.

ఏ.బి.బి.ఎస్‌.ఎస్‌, భోపాల్‌ వారిచ్చే బిరుదులకు ప్రాతిపదిక ఏమిటి?
రాష్ట్ర భాషా గౌరవ్‌ సత్కారం మరియు సరస్వతి సమ్మాన్‌ కోసం జీవితకాల సాహిత్య సేవ మరియు సమ్మేళన్‌ యొక్క జీవితకాల సభ్యత్వం అవసరం. భారత భాషా భూషణ్‌ కోసం 60 సంవత్సరాల పైబడిన పండితుల కనీసం 5 పుస్తకాలు, సంస్కృతి భూషణ్‌ కోసం 10 సంవత్సరాల సాహిత్య సేవ 3 ప్రచురిత రచనలు. సాహిత్య శ్రీ కోసం 5 సంవత్సరాల సాహిత్య సేవ 2 ప్రచురిత రచనలు. సమన్వయ శ్రీ కోసం కనీసం 1 ప్రచురిత పుస్తకం వుండాలి.

కొందరు రాష్ట్రపతులు, ప్రధానులతో సాన్నిహిత్యం కలిగి, కొందరు గవర్నర్‌ లు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ చేస్తున్న కృషి ఆంధ్ర ప్రదేశ్‌లో అందరికీ పరిచయమేనా ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో శాఖ వ్యవహారాలు డాక్టర్‌ పోతుకూచి చూసేవారు. ఎందరినో ఆయన జీవిత సభ్యులగా చేర్చి సంస్థ పురస్కారాలు యిప్పించారు. తెలంగాణ, నవ్యాంధ్ర విడిపోయాక అక్కడ డాక్టర్‌ పోతుకూచి మరణానంతరం కడారి సత్యమూర్తి అధ్యక్షులుగా కార్యవర్గం ఏర్పడి సేవలు అందిస్తుంది. 2018 లో నవ్యాంధ్ర అధ్యక్షులుగా నన్ను సతీష్‌ చతుర్వేది ఎంపిక చేశాక నేను పలువురు ఆంధ్ర రచయితల్ని జీవిత సభ్యులుగా చేర్చి స్మారక పురస్కారాలు, జాతీయ పురస్కారాలు ఇప్పించడం ప్రతి యేట క్రమం తప్పకుండా చేస్తున్నా. 2024 జాతీయ సమావేశం ఆంధ్రలో తొలిసారి జరిపి అధిక సంఖ్యలో 20 మందికి పురస్కారాలు ఇప్పించాం. ఇది చాలా సంతృప్తి కలిగించింది.

ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ నుండి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకొన్న ప్రముఖులెవరు?
ముఖ్యమైన అవార్డులు అంటే సరస్వతీ సమ్మాన్‌ అవార్డులు అవి ఈ సంవత్సరం, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ, శతాధిక గ్రంథకర్తగా, విశేష సాహిత్య సేవలందిస్తున్న డా.జీ.వి. పూర్ణచంద్‌, ప్రముఖ కథ, నవలా రచయత్రి డా.సోమిరెడ్డి జయప్రద, అలాగే కవి,రచయిత, విమర్శకుడు డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ అవార్డులు అందుకున్నారు. ఇంకా తెలంగాణా నుండి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, సినీరంగ ప్రముఖులైన కె.గోపాలకృష్ణలకు ఈ అవార్డు లభించింది. ఇంకా సాహిత్య సేవలు కొనసాగిస్తున్నవారికి భారత్‌ భాషాభూషణ్‌ ఆంధ్ర, తెలంగాణ వారితో పాటు ఒడియా కవయిత్రి డా.సుశ్రీ సంగీత మిశ్రా లాంటి ఇతర భారతీయభాషల వారికి ఇవ్వడం జరిగింది.

ఏ.బి.బి.ఎస్‌.ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖకు అధ్యక్షునిగా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి..?
ప్రస్తుత జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ వీరేంద్ర సింగ్‌, సెక్రటరీ చీఫ్‌ శ్రీమతి కృతి చతుర్వేది ల ఆదేశాలు పాటిస్తూ, సంస్థలో అధికసంఖ్యలో జీవిత సభ్యులను చేర్పించడం ముందు చేయాల్సిన పని. ఆ తరువాత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అనంతపురం లాంటి అన్నిప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించి సంస్థ ఉనికి ప్రచారం చేయడం, వీలువెంబడి రాష్ట్ర సంస్థ ద్వారా రాష్ట్ర పురస్కారాలు యివ్వడం లాంటి ప్రణాళికలు చేయాలని వుంది. యువరచయితలను ఎక్కువ భాగస్వామ్యం చేస్తే, భవిష్యతులో సంస్థను కొనసాగిస్తారనే ఆశాభావం వుంది..!!

– సృజనక్రాంతి తరఫున డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *