కలానికి, కుంచెకు సమాన ప్రాధాన్యతనిచ్చిన శీలావీ

సాహిత్యం

కొందరి పరిచయాలు వారి గొప్పతనం,వారితో ముడిపడివున్న జ్ఞాపకాలు- వారు జీవించి వున్నా, మనల్ని విడిచి, కనిపించని దూరాలకు వెళ్ళిపోయినా, జీవితాంతం అవి మన చుట్టూనే తిరుగుతుంటాయి. గతాన్ని సింహావలోకనం చేసుకునేలా చేస్తాయి. దానికి వారి వ్యక్తిత్వమూ, మంచితనమూ,స్నేహగుణం వంటి అంశాలు కారణం అవుతాయి. నా జీవితంలో నాకు అలాంటి వ్యక్తి తారసపడడం నా అదృష్టంగా భావిస్తాను.
________

నవల,కథ, వ్యాస రచయిత, కవి, చిత్రకారుడు, సహృదయ మూర్తి ’శీలావీ’ గా ప్రసిద్ధులైన శ్రీ శీలా వీర్రాజు గారు.. కలానికి, కుంచెకు,సమానమైన ప్రాధాన్యతనిచ్చి, రెంటిలోనూ, అత్యుత్తమ ఫలితాలను సాధించిన గొప్ప రచయిత, చిత్రకారుడూ శ్రీ శీలా వీర్రాజు గారు. ఇంత గొప్ప వ్యక్తి నాలాంటి ఒక సామాన్య వ్యక్తికి ఎలా పరిచయం అవుతారు ? మా పరిచయానికి దోహదపడింది మరో సహృదయ మూర్తి మా పెద్దన్నయ్య స్వర్గీయ శ్రీ కె కె మీనన్ .
__________

వీర్రాజుగారు,మీనన్ గారు, స్నేహానికి చిరునామాలాంటి వారు. అన్నయ్య ద్వారా నాకు వీర్రాజు గారు పరిచయం.విడదీయరాని స్నేహబంధం ఆ ఇద్దరిదీ!.

మీనన్ గారు ఎప్పుడూ వారి స్నేహానికి సంబంధించిన విషయమొకటి వ్యక్త పరుస్తుండేవారు. ‘నాకు జీవితంలో ఒకే ఒక్క స్నేహితుడు వున్నాడు, ఆయనే శ్రీ శీలా వీర్రాజుగారు’ అని. కొన్ని అనారోగ్య సమస్యల వలన నేను నా 13 సంవత్సరాల వయసులోనే,అన్నయ్య మీనన్ గారి దగ్గరకు హైదరాబాద్ వచ్చేసాను .

వీర్రాజుగారు..ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మరోపక్క రచయితగా, చిత్రకారునిగా నిత్యం బిజీగా వున్నా అప్పుడప్పుడూ అన్నయ్యను కలవడానికి మా ఇంటికి వస్తుండేవారు. అలా నాకు పెద్దలు వీర్రాజు గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన విలువ ఏమిటో పెద్దగా తెలియదు. అందుకేనేమో! నా పాఠ్య పుస్తకాల మీద ఆయనతో నా పేరు రాయించుకునేవాడిని.

ఆయన తెలుగు అక్షరాలు ప్రత్యేకంగా ఉంటాయి . ‘ఇవి వీర్రాజుగారి అక్షరాలు’ అని గుర్తుపట్టేలా ఉంటాయి. అప్పట్లో సీనియర్ రచయితలతో పాటు,వర్ధమాన రచయితల పుస్తకాలకు వీర్రాజు గారే ముఖ చిత్రాలు (అందులో ఎక్కువ ఉచితాలే!)వేసేవారు. మీనన్ గారి కొన్ని పుస్తకాలకు వీర్రాజు గారే ముఖచిత్రాలు ఇచ్చారు !

నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పని ఒకటి చేసిపెట్టిన మహానుభావుడు శ్రీ శీలా వీర్రాజు గారు. అదేమిటంటే –నేను 1975లో,బి డి ఎస్ లో జాయిన్ అయ్యేసరికి ప్రత్యేకంగా, దంత వైద్య కళాశాల లేదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే ‘డెంటల్ వింగ్’ అని అనుబంధంగా ఉండేది. తరువాత 1978 లో అనుకుంటాను..డెంటల్ వింగ్ పేరు మారి, ప్రభుత్వ దంత వైద్య కళాశాల (అఫ్జల్ గంజ్) గా, నామకరణం జరిగింది. అప్పుడు మా మొదటి ప్రిన్సిపాల్ ప్రొ.శేషాద్రి గారు.. నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకుని దేశంలోని నాలుగైదు దంతవైద్య కళాశాలల లోగోలు నా ముందు పెట్టి మన కాలేజి కోసం ఒక లోగో తయారు చేయించే బాధ్యత నువ్వు తీసుకో అన్నారు.

ముందు కాస్త భయపడ్డాను. తర్వాత వీర్రాజు గారు గుర్తుకు వచ్చి తప్పక బాధ్యత తీసుకుంటానని చెప్పాను. అలా శ్రీ శీలావి గారు మా దంతవైద్య కళాశాల లోగో వేసి నా చేతిలో పెట్టారు. ప్రభుత్వం నుండి ఆర్టిస్టుకు బిల్లు చెల్లిస్తారని ఎంత చెప్పినా ఆయన అంగీకరించలేదు . ఆయన వ్యక్తిత్వం అలాంటిది.అలా వీర్రాజుగారు మా దంతవైద్య కళాశాలలో అందరి మధ్య చిరంజీవిగా వున్నారని నేను భావిస్తాను. అప్పటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోరిక మేరకు ‘కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం’ లోగో కూడా వీర్రాజు గారే చేసారని తెలిసింది.

వీర్రాజు గారు నాకథలు కొన్ని చదివారు. ‘’ఇలానే రాస్తూండండి ‘’ అని ప్రోత్సహించేవారు. ఒకసారి నా కవిత చదివి ‘ఆలస్యంగా కవిత్వం రాయడం మొదలు పెట్టారు. అయినా ఫరవాలేదు,రాయడం ఆపకండి’ అని ఆశీర్వదించారు. ఇంచుమించు ఆయన స్వంత రచనలన్నీ నాకు బహుకరించారు. అందులో ఆయన పురస్కారం పొందిన ‘మైనా’నవల కూడా వుంది. వచన కవితలో కథ,నవల రాయడంలో వీర్రాజుగారు దిట్ట. కుందుర్తి ఆంజనేయులు గారు, వీర్రాజు గారు వచన కవిత్వం ప్రక్రియలో విశేషమైన కృషి చేసినట్టు పెద్దన్నయ్య మీనన్.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుండేవారు. అలా ఆయన రచనలు చదివే అవకాశము, అదృష్టం నాకు దక్కాయి.

మా అన్నయ్య ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా,వీర్రాజుగారి ప్రభావం దానిమీద ఏదో రూపంలో ఉండేది. అలా నాకు కూడా ఆయన ఆశీస్సులు అందుతుండేవి.అలా నేను 1993 ప్రాంతంలో హైదరాబాద్ లో ‘డా.ఇన్స్ టౌన్ షిప్’ లో ఇల్లు కట్టుకున్న సందర్భంలో..ఇంటి పేరు,మా పేర్లు,ఆయన ఇచ్చిన అక్షరాలే శిలాఫలకాలపై అమరాయి. నా ఇంటికి పేరు “అనురాగ”ను వీర్రాజు గారే సూచించినట్లు గుర్తు. అలాగే మా స్వగ్రామం దిండిలో ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఉచిత దంత వైద్య శిబిరం అన్నయ్య సహకారంతో,ప్రోత్సాహంతో ఏర్పాటు చేస్తుండేవాడిని. వాటికి అవసరం అయిన బ్యానర్లు ‘శీలావీ’గారే రాసి ఇచ్చేవారు. అవసరమైన కరపత్రాలపై ఆయన అక్షరాలే దర్శనం ఇచ్చేవి.అలా వీర్రాజు గారితో జ్ఞాపకాలు ఎన్నెన్నో. వీర్రాజు గారి ఇంట్లోకి ప్రవేశించగానే, శిల్పారామంలో ప్రవేశించిన భావన కలుగుతుంది.రకరకాల శిల్పకళాఖండాలు, తైలవర్ణ చిత్రాలు దర్శనం ఇస్తాయి.

_________

ఇక వీర్రాజుగారి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు ,కుమార్తె పల్లవి, సాహిత్యంతో ,చిత్ర-కళతో సంబంధం వున్నవారే ! వీరందరి సహృదయత, ఆత్మీయత,వెలకట్టలేనివి. ఈ మధ్యనే, రాజమండ్రి వెళ్ళినప్పుడు ‘శ్రీ దామెర్ల రామారావు చిత్ర కళా ప్రదర్శన మందిరం’ కు వెళ్లే అవకాశం కలిగింది.అక్కడ వీర్రాజుగారు వేసిన చిత్రాలు చూసి ఆయనను చూసినట్టుగానే అనిపించింది నాకు. ఆయన నన్ను పలకరించిన భావన కలిగింది.
_________

చివరగా ఒకమాట చెప్పక తప్పదు.మా పెద్దన్నయ్య శ్రీ కె కె మీనన్, వృద్దాశ్రమంలో వున్నప్పుడు,ఆయనతో ఎక్కువగా గడిపింది వీర్రాజుగారే ! అయితే ఇప్పటికీ వీర్రాజు గారి విషయంలో నేనొక బాధను అనుభవిస్తున్నాను అని చెప్పక తప్పదు. వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన రోజున వారిని నేను చూడలేక పోవడం. కావాలనే నేను వెళ్ళలేదేమో! పార్థివ దేహాన్ని చూడలేక ! వీర్రాజు గారి లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు బహు అరుదు. ఆ సహృదయ మూర్తికి జూన్ 1వ తేదీన 2వ వర్ధంతి సందర్భంగా నివాళులు

-డా.కె.యల్.వి.ప్రసాద్
98662 52002

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *