సాహిత్య ప్రక్రియల్లో వినూత్న రీతుల్ని వెంటనే స్వాగతించకపోవడం అనాదిగా వస్తున్నదే!
లఘురూప కవిత్వ రీతులను జన సామాన్యానికి చేర్చవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది
లఘురూప కవితావేదిక తెలంగాణ విభాగ అధ్యక్షులు, వివిధ లఘురూప కవితల సజన కర్త, సుదీర్ఘ కాలం కవిత్వంలో సంచరిస్తున్న నూతక్కి రాఘవేంద్రరావుతో ఈ వారం కరచాలనం.
మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి?
నా బాల్యం గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, దుగ్గిరాల ఫిర్కా చిలువూరులో, ఆడుతూపాడుతూ సాగింది. మాది చాలా పెద్దకుటుంబం. నాన్నగారు భూస్వామి. మా అమ్మగారు నా అయిదవ ఏట ఏదో రుగ్మతతో ఆకస్మిక మరణించారు. నాటికి ఆమె కన్న పదకొండు మంది సంతానంలో మిగిలిన యేడుగురిలో నేను అయిదవవాడిని. ఆ తరువాత అమ్మలేని లోటు తెలియకుండా వివాహిత అయినా మా పెద్దక్క పెంపకంలో, మా మేనత్తల పర్యవేక్షణలో, సంస్కారయుతంగా పెరిగాను.
తెలుగుభాష, కవిత్వంపై మోజు ఏ దశలో ఎలా కలిగింది?
నా పదో ఏట మా పెద్దన్నయ్య కాలేజీ దశలో శ్రీ.శ్రీ. సాహిత్యాన్ని చదివే వాడు . నేనూ చదవాలని ప్రయత్నించే తరుణంలో సాహిత్యమంటే ఆసక్తి కలిగింది. దానికి తోడు కాలక్షేపానికి మా అక్కయ్య తెప్పించుకొనే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ, బాలమిత్ర మొదలైనవి నా పఠనాసక్తికి మూలకారణం. అవే బాల్యంలోనే సాహిత్యం పై ఆసక్తిని పెంచాయి. నా పదిహేను పదహారో ఏట పదవతరగతి, ఎస్సెస్సెల్సీ చదివే తరుణంలో హెడ్‌మాస్టరుగారి ప్రోత్సాహంతో నాటికలు రాసి ప్రదర్శించడం, అదే సమయంలో చైనా దురాక్రమ జరుగుతున్న ఉద్రిక్త తరుణంలో చైనా దురాక్రమణ బుర్రకథ, నౌకర్ల విజయం, సంఘం నాటకం వ్రాయడం జరిగింది. అవన్నీ నాటి ఆస్థానకవి కాశీకష్ణాచార్యగారి అభినందనలు పొందాయి. 1963లో అవి పరిమిత ముద్రణకు నోచుకున్నాయి. అదే సమయంలో కొన్ని చిరుపదాలతో కొన్ని వచన కవితలు అల్లిక చేయడం, అవి అభినందనలు పొందడం, వాటికి ‘‘చక్కెరకేళీలు’’గా నామకరణం చేయడం జరిగింది. సైన్స్ కోసం వేసే చిత్రాలు ఫ్రీహ్యాండ్‌తో వేసే తరుణంలో రంగులద్దుతూ చిత్రలేఖనంపై కూడా ఆసక్తిని పెంచుకున్నాను. శ్రీ.శ్రీ. గారితో, చలం గారితోనూ నాకు ఉత్తర ప్రత్యుత్తరాలుండేవి. భాగ్యనగరం వచ్చిన పిదప తెనాలిలో క్లాస్మేట్, అతి సన్నిహితుడైన నామిత్రుడు వెనిగళ్ల వెంకటరత్నంతో కలిసి నారాయణగూడలో పి.టి రెడ్డిగారి యింట్లో ప్రతీనెలా జరిగే సాహిత్య సమావేశాల్లో పాల్గొనే వాడిని. శ్రీ నార్ల వెంకటేశ్వరరావు వంటి ఎందరో అతిరథులు, సాహితీవేత్తలతోనూ ప్రముఖ చిత్రకారులతోనూ యశోదారెడ్డి వంటి విదుషీమణులతోనూ, మౌన ప్రేక్షకునిలా ఆవేదిక పంచుకొనేవాణ్ణి.
లఘురూప కవిత్వం, మిని-కవిత్వం – ఈ రెండిటి మధ్య తేడాలున్నాయా?
రెక్కలు రూపశిల్పి సుగంబాబు నేతత్వంలో, వారు స్థాపక అధ్యక్షులుగా స్థాపించబడిన లఘురూపకవితావేదిక ఏర్పడేనాటికే శ్రీ రావి రంగారావుగారు మినీకవితను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారన్నది లోకవిదితం. అప్పటికి అనేక లఘు కవితారీతులు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. మినీ కవితకూడా లఘురూప కవితలే! నిర్మాణ రూపాలలో భిన్నం తప్ప, లఘు – మినీ కవితల్లో పెద్ద భేదం లేదు.
లఘురూప కవిత్వావేదిక రాష్ర్ట అధ్యక్షునిగా తెలంగాణాలో మీరు చేస్తున్న కార్యకలాపాలు క్లుప్తంగా చెప్పండి?
లఘురూప కవితావేదిక రెండు రాష్ర్టవిభాగాలు. భూపతిరాజు విశ్వేశ్వర వర్మ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోను, నా నేతత్వంలో తెలంగాణలోను, మంచి సమన్వయంతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్‌లో రవీంద్ర భారతిలో లఘురూప కవితావేదికలు జరిగిన సమావేశాలలో ఆహ్వానించబడి, ప్రచురించబడిన లఘురూప కవితా సంకలనాలనుండి ఎంపికచేయబడిన సంకలనాలు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులను, నగదు మరియు సన్మానంతో పురస్కారాలు అందజేయడం జరిగింది. ప్రతీయేడు యిచ్చే పురస్కారాలకై గతఏడాదిలో ప్రచురించబడిన లఘురూప కవితాసంకలనాలను ఆహ్వానిస్తు ఉంటాం. లఘురూప కవితావేదికల ఆధ్వర్యంలో లఘురూప కవితా కావ్యాలను ప్రోత్సహించగా రామాయణం, భారతం, భాగవతం గీతాసారం ఇత్యాది కావ్యాల సష్టి లఘురూప కవిత్వంతో జరిగింది. అవన్నీ ఈ వేదిక సభల్లో ఆవిష్కరించబడ్డాయి. లఘురూప కవిత్వం పై మా కషి నిరంతరం కొనసాగుతున్నది.
లఘురూప కవిత్వం అసలు కవిత్వమే కాదని కొందరు విమర్శకులనడంపై మీరెలా స్పందిస్తారు?
కందపద్యం కవిత్వం కాదన్న కాలాలూ ఉన్నాయి. ఇప్పుడు కవిత్వంలో భాగమే కదా! సాహిత్య ప్రక్రియల్లో వినూత్న రీతుల్ని వెంటనే అంగీకరించకపోవడం, స్వాగతించకపోవడం అనాదిగా వస్తున్నదే! అయితే ‘‘క్లుప్తం, వ్యక్తం, భావోపేతం, కవిత్వం’’ అన్నాను ఒక నానో లో నేను. విషయం వ్యక్తపరచడానికి సుదీర్ఘ రీతిలోనూ వ్యక్తం చేయవచ్చు. క్లుప్తంగానూ వ్యక్తం చేయవచ్చు. కవిత్వం లంబాచౌడా ఉండవలసిన అవసరం లేదని నా భావన. నిడుపాటిపెద్ద పెద్ద కవితలను నేడు చదివే ఓపిక లేని తరుణంలో పాఠకులు లఘు కవితారీతుల వైపు మొగ్గుచూపడం చూస్తున్నాం.
మీరు వ్రాసిన లఘురూప కవిత్వ సంపుటులు – వివరాలు?
లఘురూప కవిత్వరీతుల్లో అనేక ప్రక్రియలలో ఆ వ్యక్తీకరణలు ఉన్నాయి. కనీసం వివిధ ప్రక్రియలలో నా వ్యక్తీకరణలు అచ్చులో ఒక్కొక్కటి వందపేజీలతో ఓ యాభై సంకలనాలుగా తేవచ్చు. 16 వేలు పైబడిన నా నానోల గ్రంధం ఓ బహద్గ్రంధంగా వెలికి తేవలిసిన అవసరం ఉంది. అనేక వ్యక్తిగత కారణాలవల్ల నా ఆకాంక్షలు సాకారమవడంలేదు. ఇకపోతే 1962లో వ్రాసి ముద్రించిన చైనా దురాక్రమణ బుర్ర కథ, నౌకర్ల విజయం నాటిక, సంఘం నాటకం కాక, గత అయిదేళ్ల కాలపరిమితిలో ముద్రణకు నోచుకున్న నా పుస్తకాలు ఉల్కలు -3, అణువులు, విస్మయాలు, ఆరుద్రగారి కూనలమ్మ పదాల తరహాలో వ్రాసిన 361 లఘురూప కవితా ఖండికలతో సంపూర్ణ రామాయణం ఉన్నాయి. ఇంకా కషి చేస్తూనే ఉన్నాను.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లఘురూప కవిత్వం భవిష్యత్తెలా ఉంటుందంటారు?
నిజానికి పత్రికలూ ప్రచారమాధ్యమాలు ఇంకా విస్తతరీతిలో లఘురూప కవితారీతులను స్వాగతించాలి. కానీ అది జరగడం లేదు. వచన కవితారీతులకు ఇస్తున్న ప్రాధాన్యం లఘు కవన రీతులకు ఇవ్వడంలేదు. ఆ దిశగా పత్రికా నిర్వాహకుల దష్టిని త్రిప్పవలసిన బాధ్యత, లఘురూప కవితావేదికలు ఇంకా ముమ్మరంగా జరుపవలసిన బాధ్యత, మాపై ఉంది. ఇప్పటికే లఘురూప కవితారీతులపై విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఆ స్థితి లేదు. మరింత విస్తతంగా లఘురూప కవితారీతులపై పరిశోధనలు జరిగి లఘురూప కవిత్వ రీతులను జన సామాన్యానికి చేర్చవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది. ఇటీవల హర్షించదగ్గ పరిణామం ఏమిటంటే, లఘురూప కవిత్వంపై యూ.జీ.సి వారు ఆదేశించిన పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ సిద్ధాంత వ్యాసం, డా.వాస భూపాల్ త్వరలో సమర్పించనున్నారు. తెలుగు సాహిత్యంలో వచన కవిత్వవైభవం, ఉనికి, ఏ తీరున ఉన్నా, లఘురూప కవిత్వం తన వైభవాన్ని కాపాడుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం.
ఈనాటి కవులకు మీ సలహాలు/సందేశం ఏమిటి?
మీ ప్రశ్నకు నేను ‘‘క్లుప్తం, భావయుక్తం, లఘురూపం, కవిత్వం’’ లఘురూప కవిత్వంలో ఉండాలంటాను. ‘‘క్లుప్తముగ ఓ సజిత/ సాహిత్యమునకే భవిత/ లఘురూపమా కవిత/ ఓ కోకిలమ్మా!’’ అంటాను. అలాగే ‘‘హైకూలో, రెక్కలో/ నానీలో, నానోలో, రవ్వలో/ అణువులో, త్రిపదలో, కూనలమ్మల ెయలో/ మీదైన రీతిలో భవ్యమై మీ హదయ భావనలో/ వ్యక్తమై తత్వమై లఘుకవితాక్షరి విశంఖల’’ అంటాను. వినూతన లఘురూప ప్రక్రియలు సజించి, భవ్యమైన కవిత్వం ప్రపంచానికి అందించి మీ ప్రతిభ చూపండి. లఘురూప కవిత్వం సాహిత్యానికి తలమానికగా తీర్చిదిద్దండి అంటాను. ఇంతకన్నా సందేశం ఏమివ్వగలను ఔత్సాహికులకు?
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య, (9490400858)