న్యూఢిల్లీ : శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించగా.. అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా నయా హె్‌డ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బోణీ కొట్టారు. చెలరేగిన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లతో 32) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(3/26) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(2/24), అక్షర్ పటేల్(2/30), హార్దిక్ పాండ్యా(2/23) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), సూర్యకుమార్ యాదవ్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, వానిందు హసరంగా, మహీష్ పతీరణ తలో వికెట్ తీసారు.
వర్షం అంతరాయం..
162 పరుగుల లక్ష్యచేధనకు దిగిన భారత్ మూడు బంతులు ఆడి 6/0 పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దాంతో గంటన్నరపాటు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగా.. అంపైర్లు భారత్ లక్ష్యాన్ని కుదించారు. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఆట తిరిగిన ప్రారంభమైన వెంటనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. సంజూ శాంసన్(0) తీక్షణ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ నాలుగు ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మతీష పతీరణ విడదీసాడు. ఊరించే బంతితో సూర్యకుమార్ యాదవ్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు రాగా.. యశస్వి జైస్వాల్ హసరంగా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాది.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. హార్దిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
