వడ్లగింజ,గులాబీ అత్తరు కథలు ఆణిముత్యాలు
తండ్రి సంస్కృతంలో మహా పండితుడిని చేయాలనుకున్నాడు.కానీ విధి ఆ కుమారుడిని తెలుగు భాషలో కథాచక్రవర్తిని చేసింది. ఆయనే శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి .తండ్రి ఆదేశంతో సంస్కృతం నేర్చుకోవడానికి గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు వల్లూరు వెళ్లారు.అక్కడే ఆయన జీవితం మలుపుతిరిగింది.ఒక ముసలావిడ ఈ పిల్లవాడిని మదనకామరాజు కథలు తెలుగులో చెప్పమని కోరింది.దాంతో ఆయన ఆ పుస్తకం పలుమార్లు చదివి స్వయంగా తెలుగు నేర్చుకున్నాడు. అప్పుడే తెలుగులోని మాధుర్యాన్ని గ్రహించాడు.అంటే తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకున్నాడు. భవిష్యత్ లో తెలుగు వారు గర్వించే రచనలు చేసారు.తెలుగుకథను సాహీతీ ప్రపంచాన్ని శిఖరస్థాయిలో నిలిపాడు. ఏ భాషలకన్నా తెలుగు భాష తక్కువ కాదని నిరూపించారు.వారికథల్లోని పాత్రలు. జనబాహుళ్యం నుంచే సజీవపాత్రలనుతీసుకునేవాడు.
కధలు,కథానికల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు.భాషకు గౌరవం తీసుకువచ్చారు.అందుకే ఆయనను ఆధునిక కథా చక్రవర్తిగా పిలుస్తారు.మొదట గ్రాంధికాన్ని పాటించినా తర్వాత వ్యవహారికాన్ని అనుసరించారు .ఆయన కథల్లో గిడుగు, గురజాడల వంటి మహాకవులను దర్శించుకోవచ్చు.
ఆయన దాదాపు 75 కథలు రాసారు .వాటిలో వడ్లగింజ, ,గులాబీ అత్తరు,అరికాళ్ల క్రింద మంటలు,ఇలాంటి తవ్వాయి వస్తే…? ఆణిముత్యాలు. వడ్లగింజ కథ శ్రీపాద వారికి ఎంతో పేరు తెచ్చింది.
శంకరప్ప ఒక పేద బ్రాహ్మణుడితో చదరంగలోని గడుల రెట్టింపులోని కళ్లు చెదిరిపోయే సంఖ్యను బయట పెట్టించాడు. రాజూగారితో చదరంగం ఆడి గెలిచి చదరంగంలోని గడులలో మొదటి దానిలో ఒక వడ్లగింజ,రెండవదానిలో రెండూ మూడోదానిలో నాలుగు,అలా రెట్టింపు చేసుకుంటూ 64వ గడివరకూ చేస్తే కళ్లుతిరిగే సంఖ్య వస్తుందని ప్రపంచానికీ తన కథతో తెలిపిన మేధావి శ్రీపాద. ఈకథలో శ్రీపాద వారి గణిత ప్రతిభ ,చదరంగం ఆటతో సమన్వయం చేసిన తీరు పాఠకులనువిస్మయపరిచింది .ఇంత వరకూ ఒక వడ్లగింజ 64చదరంగపుగడుల వెంబడి రెట్టింపు చేసుకుంటూ పోతేఊహించనని సంఖ్య వస్తుందని శంకరప్ప ద్వారా శ్రీపాద చెప్పడం నిజంగా అమోఘం,అద్భతం.
మరో కథ గులాబీ అత్తరుకథ ముగింపు మరో అద్భుతమని చెప్పవచ్చు. షుకురల్లీఖాను అత్తరు తయారు చేసే సాయిబు.అతని అత్తరుకు ఢిల్లీ నుంచి గోల్కొండ వరకూ అందరూ గులాములే. దక్షిణాది పెద్దాపురం మహారాజు శ్రీవత్సవాయి జగపతి ప్రభువులు సరసుడని,కళాపోషకుడని తెలిసి ఆయన కోసం కాశ్మీరీ గులాబీలతో రెండు సంవత్సరాలపాటు కష్టపడి అత్తరు తయారు చేసి ఎంతో ఆశతో వారి దివాణంలో అడుగుపెట్టాడు. అక్కడ అడుగడుగునా ఠాణేదారు,దివానుజీ అడ్డగించి నీ అత్తరు అంత గొప్పదా అని ఎగతాళి చేశారు. వారిమాటలకు ఖంగు తిన్న ఖాన్ వట్టివేళ్ల అత్తరు సీసా బిరడా తీశాడు.ఒక్కసారిగా మలయమారుతంలా దివాను పరిసరాలు సువాసనలతో గుభాళించింది. పందికిఏమి తెలుసు సెంటువాసన అన్నతీరులో దివానుజీ ఇదేమి కంపు అని వెక్కిరించాడు.
.తన అత్తరుకు కంపు అని కితాబు ఇచ్చిన దివానుకు ఢిల్లీ,గోల్కొండ ల్లో నవాబులు ఎంతగా ఆదరిస్తారో చెప్పినా పట్టించుకోక పోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.మనస్సులో హిందువులలో విభ్రమవిలాసాలకు అంత విలువ ఉండదని గొణుక్కున్నాడు.చివరికి ఠాణాదారు జాలిపడి పొద్దుపొడవగానే రాజుగారు వాహ్యాళికి వస్తారని,నీ అదృష్టం పరిక్షించుకోమని సలహా ఇచ్చాడు. ఖాను ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసాడు.
తెల్లవారగానే కోటలో ప్రవేశించాడు.అక్కడ మళ్లీ సైనికులు అడ్డుపడ్డారు. చివరకు విసుగు చెంది తెచ్చిన అత్తరును తిరిగి తీసుకెళ్లడం ఆత్మహత్యాసదృశంగా తలచాడు. అంతే ఖాను తన చేతిలోని అత్తరు బుడ్డిని కోట గోడకేసి కొట్టాడు .భళ్లున బద్ధలైన ఆ చిన్న బుడ్డి నుంచి వెలువడిన గులాబీ గుభాళింపులు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. అందరూ మత్తెక్కుతున్నారు.అక్క డ ఉన్నవారికితెలివిరాగానే ఒక్కసారి కళ్లుపైకెత్తి చూడగానే మహారాజు గుర్రంపై నుంచి అరకంట చూస్తూ సొక్కి ఉన్నారు.
ఇప్పటికీ ఆ ప్రదేశంలో అత్తరు గుబాళీస్తునే ఉందంటూ చూసివచ్చినవారు చెబుతున్నారు..అంటూ ముగించారు శ్రీపాద.
తవ్వాయి వస్తే..కథలో దళితులకు అగ్రవర్ణాలవారికి మంచినీటి చెరువు విషయంలో వచ్చిన వివాదాన్ని మతమార్పిడితో పరిష్కరించారు.ఆనాటి దళితుల జీవన బాధలను ఆవిష్కరించారు. మరో కథ అరికాళ్ల క్రింద మంటలు కథలో యువ వితంతువును కుటుంబంలోనివారే రాచి రంపాన పెట్టడం కళ్లకు కట్టినట్లు చూపించారు.నాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో వితంతువుల ఘోరమైన బతుకులను ఆవిష్కరించారు.చివరకు వీరేశలింగం ఆశ్రమానికిచేరడం, ఆ వితంతువు పొందే శాంతితో ముగించారు.
శ్రీపాద వారు 1891లో తూర్పు గోదావరి జిల్లా పొలమూరులో జన్మించారు.1956లో ఆయనకు స్వర్ణాభిషేకం చేసారు. 1961లో రాజమండ్రిలో పరమపదించారు. ఆయన ప్రజాస్వామ్యవాది,సంస్కరణాభిలాషి.సంఘంలోని జీవిత కథలనే తన కథ పాత్రలుగా మలిచారు. గాంధీ,ఖద్దరు,హిందీలను వ్యతిరేకించిన ధైర్యశాలి.9 ఏళ్లపాటు ప్రబుద్ధ ఆంధ్రపత్రికనునడిపారు.కథలు, కథానికలతోపాటు నవలలు,నాటకాలు,భాషా గ్రంథాలతోపాటు ఆత్మకథను రచించారు.రామాయణ ఇతరపురాణాలనుతనదైనశైలిలోరచించారు.
ఆంగ్ల నాటక కర్త షేక్స్పియర్,తెలుగు కథా చక్రవర్తిశ్రీపాద ఏప్రిల్ 23న జన్మించడం యాదృచ్ఛికం.
శ్రీపాదసంస్కృతపండితుడు,ఆయుర్వేదవైద్యుడు.ఆయుర్వేద గ్రంథాలనూ వ్రాసారు. ఆయనకు ఆంగ్లభాష రాదు . .అందుకే తెలుగు భాష ఆయన చేతిలో సుసంపన్నం అయిందని చాలామంది అంటారు. తెలుగుభాషకు ఆయన చేసిన సేవకు గుర్తుగా రాజమండ్రిలో సాహిత్యాభిమానులు శిలావిగ్రహాన్ని స్థాపించారు.వారి కథల్లో స్త్రీల పాత్రలకు అపార గౌరవం ఇచ్చేవారు.
తన ఆత్మ కథలో’శ్రీనాధుడైనా,శ్రీపాదకైనా కష్టాలు తప్పవు. కళాకారులకు జీవనభారం తప్పదు అని తాను చరమాంకంలో పడిన బాధలను ప్రస్తావించారు. ఏదిఏమైనా తెలుగు భాష ఏ భాషకు తీసిపోదని, ఇది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని నిరూపించిన కథా చక్రవర్తి శ్రీపాద.