రచనల్లో.. రచయిత తనెంచుకున్న లక్ష్యం దిశగానే ‘సమాజపు’ తీరు తెన్నులను చిత్రిస్తాడు. పాఠకులను తనవైపు తీసుకుంటాడు. రచయిత కల్పనలకు ఓ భాష ఉంటుంది. కాలం, సమాజం వంటివి రచయితపైన ప్రభావం చూపుతాయి. చివరిగా… రచయితలో తపన, ప్రతిభ, సాధన అనేవి అతనిని శిఖరాగ్రాన నిలుపుతాయి. ఇన్ని గొప్ప సుగుణాలున్న రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపిస్తాయి. దృశ్యమానమైన భాషాపరబంధాలు ఆయన ప్రత్యేకత. బహుగ్రంథ చదువరి. ‘పురుషుల భాష అయినా, ఇప్పటిలా ఇంగ్లీష్ మొదలైన పరభాషతో సంకరం అయి, పలుకుబళ్ళులేనిది కాదప్పడు. అయినా పురుషుల భాషలో కంటే, స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యమూ తెనుగుభాషలో నాకు మాతృభాష ప్రసాదించాయి. మరో సందర్భంలో ‘ముప్పయి సంవత్సరాలుగా నిర్విరామంగా రాస్తున్నాను. వ్యావహారికం అయినా నాదింకా సాధకావస్థగానే వుంది. అంటారాయన. తెలుగు సాహిత్య జగత్తులో శ్రీపాదవారు ఏవర్గానికి ‘సరిపడని’ వారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, గురజాడ, కందుకూరి, విశ్వనాథ ఇలా వీరందరూ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడినవారు… కానీ శ్రీపాద వారిని అనుసరించిన వారు తక్కువ. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలినవారు విడివిడిగా తీసుకొని తమ రచనా అజెండాలుగా చేసుకున్నారు. కానీ… శ్రీపాదవారు వాటిని విడివిడిగా చూడలేదు. బహుశా ఆయనలోని ప్రజాస్వామిక భావజాలం ఇందుకు వేదిక అయిందనుకోవాలి.
డా॥వేదగిరి రాంబాబు గారు ‘తెలుగు జాతి, భాషలపట్ల అభిమానంతో `సాహిత్య సహకారంతో, విశిష్టసేవల్ని అందించిన అద్వితీయమూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి’ అంటారు. శ్రీపాద వారు 20వ శతాబ్ధపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. ఏప్రిల్ 23, 1891లో అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. ఫిబ్రవరి 25, 1961న రాజమండ్రిలో మరణించారు.
శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనేవి వీరికి ఉన్న ఇతర పేర్లు. తన అత్త కూతురునే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ‘సీత’, తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి ‘మహాలక్ష్మి సోదెమ్మ’ వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, స్మార్తం పూర్తి చేసి, పెద్దన్న గారి దగ్గర రఘువంశ పాఠము నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి గారి దగ్గరకు ఊరు విడిచి ‘వల్లూరు’ వెళ్ళారు. ‘తెనుగులో మంచి పాండిత్యం సంపాదించాలి’ అని నిశ్చయించుకొన్న శ్రీపాద వారి పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితీ విందును అందించింది.
ఆయన తన కథల్లో వినిపించే ‘సంస్కరణవాదం’ తెలుగు కథకు సువాసనలద్దింది. ఆయన కథలు చదివిన వారు శ్రీశ్రీ, చలం, విశ్వనాధం వారిని ప్రక్కనపెట్టేసి, ఈయన కథల్లో వారందరి ‘వాదాల’ను చూస్తారు. ఈయన ‘కొత్తచూపు’ కథ చిన్నదే… కానీ.. కథలో అన్నపూర్ణ వేసిన ప్రశ్న నాటిది… నేటిది కూడా… ‘ఆడపెళ్ళి వారిని దాష్టీకం చేసే మగపెళ్ళి వారిని ఉద్దేశించి భారతీయ స్త్రీలెందరో మానభంగాలకు లోనయారు. ఉత్తరాంధ్ర భూముల్లో మనవాళ్ళెందరికో అలాంటిది తటస్థపడుతుంది.
తెలుగు స్త్రీలది చావుబ్రతుకులకు సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచిపెట్టడానికి వల్ల కాదు. మరి మీ కళ్ళ యెదుట మీ ఆత్మీయలకున్నూ అలాంటిదే తటస్థ పడితే, తరువాత మాటయేదయినా, ముందు కళ్ళు మూసుకొని శత్రువుల మీద పడగలరా? అన్నారు. ఇంకో సన్నివేశంలో ‘తెనుగు కన్యలం మేమిప్పుడు చూసుకోవలసి సరియోగ్యత చక్కదనం కాదు. చదువు కాదు. ఐశ్వర్యం అసలే కాదు. ఇవన్నీ తెలుగు యువతిని బానిసని చేసాయి. ఈ లక్షణాలున్న తెలుగు యువకులింత వరకు చక్రవర్తులుగా చలామణి అయ్యారు. ఇలాంటి వారు వివాహానికి అర్హులు కారు, అనిపిస్తారు కూడా’ అంటుంది.
_____
శ్రీపాద వారు రాసిన 75 చిన్న కథల్లో ప్రతీదీ సమాజ దర్పణంగానే నిలిచింది. ‘కలుపు మొక్కలు’ ‘గులాబి అత్తరు’ ‘అరికాళ్ళ క్రింద మంటలు’ ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ ‘గుర్రప్పందేలు, గూడుమారిన కొత్తరికం, ఇలా ప్రతీ కథ గొప్పతనం ఆ కథనేనని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనసు, మెదడు విశాలమవుతుంది. మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ‘తెలుగు వాళ్ళకి మాత్రమే శ్రీపాద వారి కథలు చదివే అదృష్టముంద’న్నారు. ‘ప్రేమపాశం’, ‘నిగళబంధనం’, ‘రాజరాజు’, ‘కలంపోటు’ వంటి నాటక నాటికలు రాసారు. వీటిలో ‘రాజరాజు’ గొప్ప ప్రసిద్ధి పొందింది.
______
రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రసాత్మకంగా తీర్చిదిద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన ఆత్మ కథను ‘అనుభవాలు- జ్ఞాపకాలునూ’గా రాసారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. తెలుగు ఆత్మకథల్లో ఇది అగ్రస్థానంలో నిలవగలిగేదనే చెప్పవచ్చు. తొమ్మిది సంవత్సారాలపాటు సంపాదకునిగా వ్యవహరించి ‘ప్రబుద్ధాంద్ర’ పత్రికను నిర్వహించారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. వీరి మొదటి కథ ‘ఇరువురము ఒక్క చోటికే పోదాము’ 1915 లో ప్రచురితమైనది. ‘మిథునానురాగము’ వీరి మొదటి నవల. 1923 వరకు గ్రాంథిక రచనలే చేసారు. 1925 నుంచి పూర్తి వ్యవహారిక భాషలోనికి వచ్చేసారు. ‘ఏ జాతి యెదటా ఏ సందర్భంలోనూ ఎందున్నా నా తెనుగు జాతి తీసిపోదు’… అని సత్యాలను నినదించిన అచ్చతెనుగు కవి, నాటక, నవలా కథ, వ్యాస రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన రచనా నిబద్దత సాటిలేనిది.
‘‘నేను చెయ్యగలిగినా చెయ్యలేక పోయినా దేశీయులది గుర్తించినా, గుర్తించలేకపోయినా, నా జాతికి నేనే చెయ్యవలసినదేదో కొంత ఉంది. రచనే అందుకు సాధనం నాకు. అది సాగించాలంటే కాలూ, చేయీ ఆడాలి. అలా ఆడ్డానికి బువ్వ కావాలి. కళాజీవి అయిన వాడికి బువ్వ ప్రయోజనం అంతే… నాకు ఎప్పుడూ ఉంటున్నదే డబ్బు ఇబ్బంది. అనివార్యంగా కాదు అభిమానం ముందుకు రావడం వల్ల యేర్పడుతోంది’ అని తన గురించి తనే చెప్పుకొన్నారు.
(ఏప్రిల్ 23,శ్రీపాద వారి 133వ జయంతి)
-భమిడిపాటి గౌరీశంకర్,
94928 58395