హృదయాలను గెలుచుకున్న సుంకరి కృష్ణప్రసాద్ నానీలు

సాహిత్యం

వచన కవిత్వం ఒక స్థిరమైన చట్రం నుండి బయటపడి ఒళ్ళు విరుచుకున్న తరువాత అనేక రూపాలను సంతరించుకున్నది. ఇందులో భాగంగా ప్రఖ్యాత కవి ఎన్. గోపి గారు ప్రవేశపెట్టిన నానీల రూపం ఇప్పటికీ సూక్ష్మ లేదా చిన్న కవితల్లో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నది నిర్వివాదాంశం. చూడడానికి నాలుగు లైన్ల చిన్న పద్యమే అయినా ఏదో లైను కింద లైను రాశాను 20 నుండి 25 అక్షరాల లెక్క చూసుకున్నాను అనగానే సరిపోదు, ఆ నాలుగు లైన్లలోనే ఆ చిన్న పద్యంలోనే పెద్ద భావాన్ని పాఠకులకు చేరవేయకపోతే అది విఫలమైనట్లే, లెక్క తప్పినట్టే.
____________
కొన్నిసార్లు నానీలను చదివినప్పుడు ఒక పెద్ద కవిత చేయలేని పనిని మెరుపులా ఒక చిన్న కవిత చేసేస్తుంది అనిపిస్తుంది. ఈరోజున ఫేస్బుక్ మాధ్యమంగా విరివిగా, ప్రతిరోజు నానీలు రాస్తున్న వారిలో సుంకరి కృష్ణ ప్రసాద్ ఒకరు. కవుల్లో అనేకమంది చాలా రకాలైన ప్రక్రియల్లో ప్రవేశిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు, రచనలు చేస్తూ ఉంటారు. ఈ కవి తాను సగర్వంగా నిలబడి తనను నిలబెట్టే, ప్రపంచానికి తన సత్తాను చాటగల ఒకే ఒక మార్గాన్ని (ప్రస్తుతానికి అయితే) ఎంచుకొని నానీలకు కట్టుబడి తన అక్షరాల పెట్టుబడితో సాహిత్య సేద్యం చేస్తున్నాడు. ఈయన స్పృశించని అంశం లేదు. వస్తు విస్తృతి విశాలమైనది. భావ ప్రకటన, వస్తువుల ఎంపికలో పరిణతి మెండుగా ఉన్నటువంటి కవి ఇతను. జల ఎండిపోకుండా ఎలాగైతే జీవనది ఆగిపోకుండా ప్రవహిస్తుందో తన కవిత్వం కూడా అలాగే సాగాలని అనుకున్నాడో ఏమో తన పుస్తకం “నా చిన్ని హృదయం” ను ప్రవహించే నదికి అంకితం చేశాడు.
________________
నా కవితలను
నదికి అంకితమిచ్చా
ఆ విధంగా…
అడవిని దాటాను

అన్న నానీతో మొదలై నాలుగు వందల అరవై నాలుగు మజిలీలపాటు సాగిన సుదీర్ఘ ప్రయాణం పొడవునా మెజారిటీగా నాణ్యమైన నానీలు మనల్ని పలకరిస్తాయి, ఆలోచింపచేస్తాయి, నవ్విస్తాయి, ఆహా అనిపిస్తాయి, భలే ఉన్నాయి అనిపిస్తుంది. ఇలా అనేక భావోద్వేగాలకు గురిచేస్తాయి.

వరి చేను గాలికి
హొయలు పోతోంది
నా రాక
ఆమెకు తెలిసిపోయింది

మేము పుట్టుకతోనే
పెద్దవాళ్ళం
మా బాల్యం
నడివయస్సును మోస్తుంది
ఈ రెండు నానీలను చదివినప్పుడు.. కృష్ణ ప్రసాద్ రచనల్లో ప్రేమకు, జీవితానికి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. సాహిత్య రూపం ఏదైనా సృజన కోసం వస్తువు దొరికే అతి పెద్ద వనరు జీవితం మాత్రమే. ఆ జీవితం ఫలప్రదంగా సంతోషంగా సంతృప్తికరంగా ఉండాలంటే దాని నిండా ప్రేమ కూడా ఉండాలి. ఈ రెండు పార్శ్వాలను స్పృశిస్తూ చక్కని నానీలు రాశాడు ఈ కవి.
ఏదైనా ఒక సత్యం
చెప్పమన్నారు
ప్రేమ గురించి మాత్రమే
చెప్పగలిగా

ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రేమ అంటే తనకి ఎంత ప్రేమనో చెప్పడానికి. పేరు తెలియని ‘ఆమె ‘ కోసం, ఆమె ప్రేమ కోసం తపించినవి, అనుభవించినవి, ఎదురు చూసినవి, నవ్వించినవి, ఏడిపించినవి ఇలా అనేక భావాల సమాహారంగా ఇందులో అనేక నానీలు ఉన్నాయి.
ఆమె అడ్రస్ పట్టుకు
తిరుగుతున్నా..
కవినయ్యానని
చెబుదామని

ఆమె కోసం
నా మాటల్ని దాచి ఉంచాను
నన్ను చూస్తూ
నవ్వుతూ వెళ్ళిపోయింది
ఒక్కోసారి ఒక కవిత రాయడం కన్నా చిన్న పద్యం అయిన నాని రాయడం కష్ట సాధ్యం అనిపిస్తుంది, కానీ ఈ పనిని చాలా సమర్థవంతంగా నెరవేర్చాడు కృష్ణ ప్రసాద్. ఎత్తుగడ మరియు ముగింపు, మెరుపు సమపాళ్లలో రంగరించి శెభాష్ అనిపించుకున్నాడు.
బుద్ధుని బొమ్మ ఉన్న
నా బ్యాగు పోయింది
ఎవరికో
జ్ఞానోదయం అయింది

ఇలా మన జీవితంలో అడపాదడపా జరిగే చిన్నపాటి సంఘటనలను భావస్ఫోరకంగా ఒక చమత్కారంతో నానీలుగా మలచడంలో కృష్ణ ప్రసాద్ రాణించాడు.
కవిత్వంలో తప్పనిసరిగా తొంగిచూసే తాత్త్వికత ఈ పుస్తకంలో కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది. అందువల్ల వీటికి సార్వజనీనత ప్రాసంగీకత చేకూరింది.
ఆకలి
ఎంత గొప్పదో
మరణాన్ని
జీవితంతో లిఖిస్తోంది

వెలుగు ఎప్పుడు
విభజిస్తూనే ఉంటది
చీకటికి
కలపడమే వచ్చు
ఇలాంటివి చదివినప్పుడు కవి.. జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో కదా అనిపిస్తుంది. కవి మీద ఒక గౌరవభావం ఏర్పడుతుంది. తన రచనల్లో ప్రకృతి ప్రధాన వస్తువుగా గోచరిస్తుంది. ఉదయం, రాత్రి, పొలం, కొండలు, ఆకాశం, నదులు, పిట్టలు, వర్షం, పూలు ఇలా ప్రతిదానిని వదలకుండా కవితాత్మకంగా అర్థం చెడిపోకుండా అక్షరబద్ధం చేయడంలో కృతకృత్యుడయ్యాడు కవి. ప్రకృతిని తన జీవన యానంలో ఒక ముఖ్యమైన అవిభాజ్యమైన అంశంగా పరిగణించడం వల్లనే దీనికింత ప్రాముఖ్యత ఏర్పడిందని మనకు అర్థమవుతుంది.
వరి చేనంతా
బంగారం వేసుకుంది
పుట్టింటికి
సిద్ధం అయ్యింది

కొండను చూస్తే
నాకు ఆనందం
అదెప్పుడూ
ఆకాశాన్ని తాకుతుంటది
ఏ కవి అయినా తన తల్లిదండ్రుల ఊసు లేకుండా రచనను వెలికి తేవడం జరగదు. కృష్ణ ప్రసాద్ దీనికి మినహాయింపు ఏమీ కాదు.
నేను
రెండు రూపాల మనిషిని
ఒకటి నాన్న
రెండవదీ నాన్నే

అమ్మ ఎప్పుడూ
పనిలో ఉంటది
తను కాలం..
స్వప్నాలని కలగంటది
ఇందులో మనల్ని ఆకర్షించే మరో అంశం వృత్తిపరంగా ఉపాధ్యాయుడు కావడంతో బడితో బడి పిల్లలతో తన అనుబంధం అనేక సార్లు అత్యంత సహజంగా అక్షరీకరించబడడం. ఆ స్వచ్ఛత, అమాయకత్వం, ప్రేమ, స్వేచ్ఛ ఇతని అక్షరాలలో బాల్యానికి నాస్టాలజిక్ కిరీటం తొడిగింది.
పిల్లలు ఇసుక గూళ్లను
కడుతూనే ఉన్నారు
స్వప్నాలన్నీ
ఊహలు కావు

సెలవు రోజున
బడిలో గడిపాను
తన బాధను
తీరిగ్గా పంచుకుంది
ఇలా వైవిధ్య భరితంగా వస్తు ఎంపికలో విస్తృతి కారణంగా 400 పైచిలుకు నానీలు ఉన్నా అన్నింటిని ఏకబిగిన చదివిస్తుంది ఈ పుస్తకం. ఐతే ‘ఆమె’ అంశంగా రాసినవి మరీ ఎక్కువగా ఉండడం, అక్కడక్కడా కొన్ని వచనంలా తేలిపోవడం, పదాలు పదబంధాలు వేరైనా సమాన అర్ధాన్నిచ్చే పునరుక్తి పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిమీద కవి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఈ కోణాన్ని మినహాయిస్తే “నా చిన్ని హృదయం” లోని నానీలను ఇష్టపడే అందరి హృదయాలను గెలుచుకుంది అనడంలో సందేహం లేదు.

జీవితం బరువు
బాగానే ఉంది
నా కవితల పుస్తకం
చేతికొచ్చింది

కవిగా తన ప్రస్థానానికి బరువుని పరువుని తెచ్చిన ఈ పుస్తకం పట్ల అభినందనలు తెలియజేస్తూ తన రాబోయే రెండవ నానీల సంపుటి “నా లోపలి తీరాలు” కోసం శుభాకాంక్షలు తెలియజేద్దాం.

 

 

-పెనుగొండ బసవేశ్వర్
కరీంనగర్, 94411 59615

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *